కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు

ఫొటో సోర్స్, Getty Images
కేరళలోని ఒక వలంటీర్ల బృందం.. మార్చి నెలనుంచీ స్థానిక వార్తా పత్రికల్లోనూ, న్యూస్ నెట్‌వర్కుల్లోనూ వస్తున్న కోవిడ్ 19 మరణ వార్తలన్నిటినీ జల్లెడ పట్టింది.
డాక్టర్ అరుణ్ ఎన్ మాధవన్ నాయకత్వంలో ఈ బృందం ఏడు స్థానిక వార్తాపత్రికల జిల్లా ఎడిషన్లను, ఐదు న్యూస్ ఛానెళ్లనూ క్రమం తప్పకుండా రోజూ చూస్తూ... వాటిల్లో వచ్చిన ప్రతీ మరణ వార్తనూ, సంస్మరణ దినాల వివరాలను నమోదు చేశారు.
"లెక్కింపునకు ఇది చాలా ఉపయోగకరమైన పద్ధతి" అని యూనివర్సిటీ ఆఫ్ టొరొంటోకు చెందిన ప్రభాత్ ఝా అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిలియన్ డెత్ స్టడీ’ అధ్యయనానికి ఫ్రొఫెసర్ ఝా నాయకత్వం వహించారు. నెలలు తక్కువగా పుట్టిన శిశువుల మరణాలపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అతి పెద్ద అధ్యయనాల్లో ఇదీ ఒకటి.
గురువారం నాటికి కేరళలో 3,356 కోవిడ్-19 మరణాలు సంభవించినట్లుగా ఈ వలంటీర్ల బృందం వేసిన లెక్కల్లో తేలింది. జనవరిలో మొట్టమొదటి కోవిడ్ కేసు నమోదు అయిన దగ్గరనుంచీ, మార్చిలో కోవిడ్ కారణంగా మొదటి మరణం సంభవించిన నాటినుంచీ ఈ లెక్క వేశారు.
అయితే, అధికారిక లెక్కల ప్రకారం కోవిడ్-19 మరణాల సంఖ్య 1,969 మాత్రమే.

"అనేక కోవిడ్-19 మరణాలను లెక్కించడం లేదు. ప్రభుత్వం చాలా కోవిడ్-19 మరణాలను ఇతర అనారోగ్య కారణాల వల్ల సంభవించిన మరణాలుగా లెక్కించింది" అని డా. మాధవన్, బీబీసీకి తెలిపారు.
ఇప్పటివరకూ ఇండియాలో సుమారు 90 లక్షల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అమెరికా తరువాత అధిక కోవిడ్-19 కేసులు నమోదైన దేశంగా ఇండియా రెండవ స్థానంలో ఉంది.
కోవిడ్ కారణంగా ఇప్పటివరకూ దేశంలో 1,30,000 మరణాలు సంభవించాయి. కానీ, మరణాల శాతం (సీఎఫ్ఆర్) అత్యల్పంగా 1.5% మాత్రమే ఉంది.
అయితే, ఈ మరణాల రేటు పూర్తి వాస్తవాలను చూపించట్లేదని, పలు రాష్ట్రాలలో కోవిడ్ మరణాలను సరిగ్గా లెక్కించడం లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అనుమానం ఉన్న కొన్ని పాజిటివ్ కేసులను గణనలోకి తీసుకోవట్లేదని, కోవిడ్ వలన సంభవించిన మరణాలు ఇతరత్రా కారణాల వల్ల సంభవించినవిగా లెక్కేస్తూ నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు.
డాటా విషయంలో పారదర్శకత పాటిస్తూ, అధికారికంగా సమగ్రమైన కోవిడ్ 19 గణాంకాల పట్టికను రూపొందిస్తూ వస్తున్న కేరళలో మరణాల సంఖ్యను తక్కువ లెక్కించడం ఆశ్చర్యకరమైన విషయమని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అండర్-రిపోర్టింగ్, అంటే వాస్తవాలను తగ్గించి నివేదించడం తీవ్రంగా ఉందని డా. మాధవన్ తెలిపారు. "చనిపోయేముందు కోవిడ్-19 నెగటివ్ వచ్చినవారిని, కేరళకు చెందనివారిని లెక్కించలేదు. 65 నుంచీ 78 ఏళ్ల వయసుగల ముగ్గురు పురుషులు కోవిడ్ లక్షణాలతో నా క్లినిక్‌కు వచ్చారు. చికిత్స అందిస్తుండగానే వారు ముగ్గురూ మరణించారు. అయితే, వారి మరణాల విషయం మీడియాలో రాలేదు. అధికారిక లెక్కల్లో కూడా తీసుకోలేదు. ప్రభుత్వం చాలా మరణాలను గణించడం లేదు" అని ఆయన అన్నారు.
"కోవిడ్ మరణాల విషయంలో కొంత అండర్-రిపోర్టింగ్ జరుగుతోందని, మరణాల సంఖ్యను సరిగ్గా లెక్కించడం లేదని" ప్రభుత్వ ఆరోగ్య ఉన్నతాధికారి రాజీవ్ సదానందన్ ఒప్పుకున్నారు.
"టెర్మినల్ లేదా మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతూ, కోవిడ్-19 బారిన పడిన కేసులను మేము లెక్కించలేదు. అది తప్పు. కరోనా మరణాలను నిర్వచించడంలో చాలా స్పష్టమైన ప్రోటోకాల్స్ ఉన్నాయి" అని రాజీవ్ సదానందన్ బీబీసీకి తెలిపారు.
డాటా పారదర్శకత విషయంలో కేరళ ఉన్నత ప్రమాణాలను పాటిస్తోందని, 2018లో వచ్చిన ‘నిపా వైరస్’ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ పద్ధతి ఉపయోగపడిందని సదానందన్ అభిప్రాయపడ్డారు.
"మేము ఉద్దేశపూర్వకంగా డేటాని దాచిపెట్టాలనుకోలేదు. ప్రతికూల పరిస్థితులకు భయపడి కొన్ని జిల్లాల్లో కొన్ని మరణాలను రిపోర్ట్ చేసి ఉండరు. పూర్తి పారదర్శకతను విశ్వసించే సమాజంలో డేటాను దాచిపెట్టడం చాలా కష్టం" అని ఆయన తెలిపారు.

తొలుత దాదాపు అన్ని దేశాలూ కోవిడ్-19 మరణాలను 30 నుంచీ 50 శాతం తక్కువగా లెక్క వేసాయని డా. ఝా తెలిపారు. "ఇండియాలో మున్సిపాలిటీలన్నీ వారానికి ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో లెక్కేయాలి. వాటిని గత ఏడాది లేదా అంతకుముందు సంవత్సరాలలో అదే సమయంలో నమోదైన మరణాలతో పోల్చి, ఈ ఏడాది మరణాల సంఖ్య ఎంత పెరిగిందో చూడాలి. అధికంగా నమోదైన మరణాలలో కోవిడ్ మరణాలు ఉండోచ్చు" అని డా. ఝా వివరించారు.
"కేరళలో కోవిడ్ 19 మరణాలను ఉద్దేశపూర్వకంగానే, ఒక పద్ధతి ప్రకారం తక్కువగా లెక్కిస్తున్నారని" అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన ఓమన్ సీ కురియన్ అభిప్రాయపడ్డారు.
"బలమైన పర్యవేక్షణ, ప్రభుత్వానికి సలహాలివ్వడానికి ఒక ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసినప్పటికి కేరళలో కోవిడ్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గలేదని…పరిస్థితులు ఎలా ఉన్నా, కోవిడ్ విషయంలో విజయం సాధించిన రాష్ట్రంగా తమ ఖ్యాతిని పోగోట్టుకోకూడదని అధికారులు విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోందని" ఓమన్ కురియన్ వ్యాఖ్యానించారు.
కేరళలో జనవరిలో మొట్టమొదటి కరోనా కేసు నమోదయ్యింది. అప్పటినుంచీ మెల్లిగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పటికీ, మార్చి నాటికి మిగతా రాష్ట్రాలలో కేరళకన్నా ఎక్కువ కేసులు నమొదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
కేరళలో కట్టుదిట్టమైన విధానాల ద్వారా కేసులను ట్రేస్ చెయ్యడం, పరీక్షలు జరపడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటీన్‌లో ఉంచడం, మూలాలనుంచీ నెట్వర్క్ ఏర్పాటు చెయ్యడం మొదలైన చర్యలతో మే నాటికి కోవిడ్ వ్యాప్తిని బాగా కట్టడి చెయ్యగలిగారు. కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదవ్వని రోజులు ఉన్నాయి.
అయితే, ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. తొలి వెయ్యి కేసులు నమోదు అవ్వడానికి 110 రోజులు పడితే, జూలై నాటికి రోజుకు 800 కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. సెప్టెంబర్‌కు కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదయ్యాయి.
నవంబర్ 19నాటికి కేరళలో మొత్తం 5,45,641 కేసులు నమోదయ్యాయి. 46,000 కన్నా ఎక్కువమంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లేదా ఇళ్ల వద్దే క్వారంటీన్‌లో ఉన్నారు. రోజుకు సగటున 60,000 కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేరళలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కోవిడ్ మరింత ఎక్కువగా వ్యాపించే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
"బహుశా, ఈ అండర్ కౌంటింగ్ అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేదని" పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రభుత్వ అధికారి, బీబీసీకి తెలిపారు. తన అంచనాల ప్రకారం కేరళ ప్రభుత్వం కోవిడ్ మరణాలను 30% తక్కువగా లెక్కించిందని ఆయన తెలిపారు.
"అయితే, మొత్తం అన్ని మరణాలనూ లెక్కించినా కూడా మరణాల సంఖ్యను తగ్గించడంలో కేరళ విజయం సాధించి ఉంటుందనీ, ప్రభుత్వం చేసిన కృషి అసాధారణమైనదని" ఓమన్ కురియన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ
- Contempt of Court: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి విధించే శిక్షలు ఏమిటి
- బ్లాక్ మార్కెట్లో పసి బిడ్డల వ్యాపారం... పెంచుకునేందుకు, బలి ఇచ్చేందుకు పిల్లల్ని అమ్ముతున్నారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








