కరోనావైరస్: కేరళ ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎలా విజయం సాధించింది? మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఎలాంటి చర్యలు తీసుకుంది?

కేరళ ముఖ్యమంత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేరళలోని ఒక గ్రామంలో ఇద్దరు యువతీయువకులు ప్రభుత్వ రోడ్డు రవాణా బస్సు దిగారు. వారి దగ్గరకు ముగ్గురు మధ్య వయస్కులు వచ్చి కలిశారు.

ఆ ముగ్గురిలో కొంచెం పెద్ద వయసున్నట్లు కనిపిస్తున్న వ్యక్తి, ఆ దగ్గర్లో ఉన్న తాత్కాలిక కుళాయి స్టాండ్‌ వైపు చూపించాడు. సాధారణంగా పెద్ద పెద్ద పెళ్లిళ్లలో విందు పూర్తయ్యాక అతిథులు చేతులు కడుక్కోవడానికి ఉపయోగించే కుళాయి స్టాండ్ అది.

ఆ యువతీయువకులిద్దరూ వెంటనే అక్కడికి వెళ్లి చేతులు కడుక్కున్నారు. అనంతరం తాము వెళ్లాల్సిన చోటుకు బయలుదేరారు. ఆ ముగ్గురు పురుషులు చిరునవ్వు నవ్వారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

నిశబ్దంగా సాగిపోయిన ఈ కార్యక్రమాన్ని చూపుతున్న వీడియో వైరల్‌గా మారింది. కేరళ‌లో కోవిడ్-19 మీద పోరాటానికి మోహరించిన సైన్యంలో అదొక భాగం మాత్రమే.

ఈ మధ్య వయస్కులు పంచాయతీ సభ్యులు. వారితో పాటు జూనియర్ పబ్లిక్ హెల్త్ నర్స్ (జెపిహెచ్ఎన్), జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్లు (జేహెచ్ఐ)లు అని పిలిచే ఆరోగ్య కార్యకర్తలు కూడా కరోనా వైరస్ మీద పోరాటం చేస్తున్నారు.

ఇలా ఆరోగ్య కార్యకర్తలు, క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధుల కలయికే, ఈ రాష్ట్రం కోవిడ్-19 మీద పోరాటంలో వైరస్ సోకిన వారి గ్రాఫ్‌ను సమతలం చేయడానికి తోడ్పడింది.

ఈ సామాజిక పెట్టుబడి ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా ఉంటూ దేశంలో ప్రాణాంతక మహమ్మారిని అదుపులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలిచేలా చేసింది.

భారతదేశంలో మొదటి ముగ్గురు కరోనావైరస్ రోగులు వుహాన్ నుండి జనవరి 29న కేరళకే వచ్చారు. ఆ తర్వాత మూడు నెలలకు ఇక్కడ ఈ వ్యాధి కారణంగా ఇద్దరు చనిపోయారు. అది చిన్న సంఖ్యే.

కానీ, హెచ్1ఎన్1, 1N1, నిపా వంటి వ్యాధులతో పాటు.. గత సంవత్సరం ముంచెత్తిన భీకర వరదలను ఎదుర్కొన్న అనుభవంతో.. ప్రాణాంతకమైన వైరస్‌ను ఎదుర్కోవటానికి ఈ రాష్ట్రం సంసిద్ధమై ఉంది.

ఆరోగ్య కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు కలిసి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రాణాంతకమైన వైరస్ గురించి ప్రజలకు వివరించారు. అంతకుముందు వరదలు రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించినపుడు కూడా.. బావులను ఎలా క్లోరినేట్ చేసుకోవాలో, లెప్టోస్పిరోసిస్‌ను ఎలా నివారించాలో వీరు ఇంటింటికీ తిరిగి వివరించారు.

కేరళ

ఫొటో సోర్స్, Getty Images

అంత మంది ప్రజలకు ఎలా శిక్షణనిచ్చారు?

‘‘ఈ శిక్షణ ప్రక్రియకు రెండు, మూడు రోజులకు మించి పట్టదు. నిపుణులు తయారుచేసిన అధ్యయన సామగ్రి సహాయంతో వీరు వెళ్లి ఇతరులకు శిక్షణ ఇస్తారు’’ అని కేరళ వైద్య విభాగం మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్. శ్రీధర్ బీబీసీ హిందీతో చెప్పారు.

‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) కార్యకర్తలు, పట్టణ ప్రాంతాల్లో ఉషా (అర్బన్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) కార్యకర్తలు ఉన్నారు. ప్రజలకు ఏం వివరించాలనేది వీరందరికీ చెప్తారు. ఒక్కో ఆశా కార్యకర్త సుమారు 1,000 మంది ప్రజల బాధ్యత చూస్తారు’’ అని ఆయన తెలిపారు.

వారితో పాటు ప్రతి జూనియర్ పబ్లిక్ హెల్త్ నర్సు (జేజీహెచ్ఎన్) 10,000 మందికి, ఒక్కో జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ 15,000 మందికి బాధ్యత వహిస్తారు. అలాగే.. 1,000 మంది ప్రజలకు బాధ్యత వహించే అంగన్‌వాడి కార్యకర్తలు కూడా ఆరోగ్య శాఖకు - సామాజిక న్యాయ విభాగానికి మధ్య వారధిగా ఉంటారు.

‘‘మాస్కును ఎలా ధరించాలి వంటి సమాచారాన్ని ప్రధానంగా ఆరోగ్య కార్యకర్త ద్వారా తెలియజేస్తారు. రాబోయే పరిస్థితుల గురించి పంచాయతీ ప్రతినిధులకు మేం అవగాహన కల్పిస్తాం. తద్వారా వారు అప్రమత్తంగా ఉంటారు. పట్టణ ప్రాంతంలో హెల్త్‌కేర్ ఇన్స్పెక్టర్, స్థానిక వార్డు సభ్యుడు సబ్-సెంటర్లలో భాగంగా ఉంటారు’’ అని డాక్టర్ శ్రీధర్ వివరించారు.

‘‘వుహాన్ నుంచి మొదటి ప్రయాణికుడు విమానాశ్రయానికి వచ్చిన వెంటనే ఏం చేయాలి, ఏం చేస్తున్నాం.. అనే సమాచారాన్ని మొత్తం ఆరోగ్యకార్యకర్తలు, పంజాయతీ సభ్యుల సైన్యానికి తెలియజేస్తుంటాం’’ అని చెప్పారు.

కేరళ

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రంలో దిశ పేరుతో సామాజిక కాల్ సెంటర్‌ను నెలకొల్పి దానికి టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య అధికారి దగ్గరకు వచ్చే విచారణలు, ఫిర్యాదులను ఈ కేంద్రం స్వీకరించి సమాచారం తెలియజేస్తుంది.

‘‘ఎవరైనా క్వారంటైన్ వ్యవస్థను ఉల్లంఘిస్తున్నట్లయితే.. పంచాయతీ కార్యకర్త, ఆరోగ్య కార్యకర్త వారిని గుర్తించి తిరిగి క్వారంటైన్‌లోకి తీసుకువస్తారు’’ అని డాక్టర్ శ్రీధర్ తెలిపారు.

వుహాన్ నుండి వచ్చిన మొదటి బృందం విద్యార్థులను, వారి ప్రాధమిక, ద్వితీయ కాంటాక్టులను క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత కేరళ ఊపిరిపీల్చుకుంది. కానీ అంతలోనే.. విమానాశ్రయంలో ఒక జంట స్క్రీనింగ్ చేయించుకోకుండా తప్పుకుపోయారని, ఓ వ్యక్తి అనారోగ్యంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది.

ఆ దంపతులు, వారి కుమారుడు ఇటలీ నుండి తిరిగి వచ్చినందున "ఇటలీ కుటుంబం"గా అభివర్ణిస్తున్నారు. వారిని, వారి కూతురు, అల్లుడిని వెదికి పట్టుకోవటానికి అధికార యంత్రాంగం చాలా కష్టపడింది. ఆ తర్వాత ఆ నలుగురికీ కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.

అప్పుడిక.. వారి కాంటాక్టులను వెదికి పట్టుకుని, వారందరికీ స్క్రీనింగ్ చేయటానికి, కొందరిని పరీక్షించటానికి ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు తెల్లవార్లూ పనిచేశారు. దాదాపు 2,000 మందికి స్క్రీనింగ్, పరీక్షలు నిర్వహించారు. కొన్ని వేల మందిని క్వారంటైన్ చేశారు.

ఈ దంపతుల తల్లిదండ్రులు - 93 సంవత్సరాలు, 88 సంవత్సరాల వయసున్న వృద్ధ దంపతులు - కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తర్వాత రెండు వారాల కిందట డిశ్చార్జ్ అయ్యారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కేరళలో పరిస్థితులను మార్చేసిన బలమైన అంశం ఏమిటి?

‘‘క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీ కార్యకర్తలే ఇక్కడ పరిస్థితులను మార్చేసిన బలమైన అంశం. క్షేత్రస్థాయిలో మాకు సామాజిక పెట్టుబడి ఉంది. ఇతర రాష్ట్రాలకన్నా చాలా భిన్నమైన విషయం ఇదే’’ అని డాక్టర్ ఇక్బాల్ బీబీసీతో పేర్కొన్నారు.

"వాస్తవానికి మాకు ఈ సామాజిక పెట్టుబడితో పాటు... మరో నిపుణులతో కూడిన సామాజిక పెట్టుబడి కూడా ఉంది - అది ఉత్సాహవంతులైన యువ వైద్యుల బృందం. వాళ్లు నా కొడుకు కన్నా చిన్నవాళ్లు. ప్రజారోగ్యం, వైరాలజీ గురించి వారి ద్వారా నేను చాలా తెలుసుకున్నాను" అని ఆయన చెప్పారు.

వివిధ స్పెషాలటీ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తొమ్మిది మంది వైద్యుల బృందం నుండి మరొక ఉప బృందం రూపొందింది. ఆ బృందం కరోనావైరస్ రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీని ఉపయోగించవచ్చంటూ ఒక అధ్యయన పత్రం తయారు చేసింది. ఆ అధ్యయనాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదించింది.

మహమ్మారిని ఎదుర్కోవడంలో కేరళ విజయానికి - క్షేత్రస్థాయి కార్యకర్తల సాయంతో కాంటాక్టులను వెదికి పట్టుకోవటంతో పాటు, నియంత్రణ వ్యూహం కూడా కారణమని డాక్టర్ ఇక్బాల్ అంటారు. ‘‘ఆరోగ్య సంరక్షణను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రులకు, స్థానిక సంస్థలకు వికేంద్రీకరించే మా విధానం చాలా తోడ్పడింది’’ అని చెప్పారాయన.

ఆరోగ్య మంత్రి

ఫొటో సోర్స్, kk shailaja teacher facebook page

ఫొటో క్యాప్షన్, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ

‘‘బలహీనంగా ఉన్న వారిని సాధారణ ప్రజలతో కాంటాక్ట్ లేకుండా దూరంగా ఉంచాలి. వివిధ అనారోగ్యాలతో ఉన్న 60 ఏళ్లకు పైబడిన వయసున్న వారు ఎక్కడెక్కడున్నారనేది మేం గుర్తించాం. వారు మొత్తం 71.6 లక్షల మంది ఉన్నారు. వారందరికీ మందుల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాం. టెలీమెడిసిన్ ద్వారా వారి వైద్యులను సంప్రదిస్తూ ఉండాలని వారికి చెప్పాం. ముఖ్యమంత్రి (పినరయి విజయన్) ఏర్పాటు చేసిన వలంటీర్ దళం కూడా వారికి సాయం చేస్తోంది’’ అని డాక్టర్ ఇక్బాల్ వివరించారు.

కోవిడ్-19 నియంత్రణ కోసం ఏర్పాటైన నిపుణుల వైద్య కమిటీ.. వైద్యం, ప్రజారోగ్య అంశాలపై చర్చించడానికి ఒకటిన్నర నెలలుగా ప్రతి రోజూ సమావేశమవుతోంది. ``నేను ప్రతి రోజూ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ముఖ్యమంత్రికి వివరాలు తెలియజేస్తాను. సాయంత్రం 4 గంటలకు నివేదిక సమర్పిస్తాను’’ అని కూడా ఆయన చెప్పారు.

కరోనావైరస్ పాజిటివ్ తేలిన వారి సగటు వయసు 37.2 సంవత్సరాలు మాత్రమే ఉండటం ఒక విధంగా కేరళ అదృష్టమని ఇక్బాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల్లో 80 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్న వారు కేవలం ఇద్దరే ఉన్నారని.. అలాగే 60 సంవత్సరాల వయసున్న వారు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.

కేరళ

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్య అవగాహన

‘‘నేను 1990ల ఆరంభంలో ప్రజారోగ్య వ్యవస్థలో చేరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నపుడు.. అక్కడున్న ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 12-30 – 1-00 గంట సమయానికి ఇళ్లకు వెళ్లిపోవటానికి తయారయ్యేవారు. ఇలా ఎలా చేస్తామని నేను అడిగాను. నర్సింగ్ సిబ్బంది.. తాము మూత్రవిసర్జన చేయకుండా అంతకు మించి ఎక్కువసేపు ఆపుకోలేమని చెప్పారు. పీహెచ్‌సీలో టాయిలెట్ లేదు కాబట్టి దాన్ని మూసివేసి ఇంటికెళ్లాల్సి వచ్చేది’’ అని డాక్టర్ ఎస్.ఎస్.లాల్ బీబీసీ హిందీతో చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ అధికారి కూడా అయిన ఆయన ప్రస్తుతం వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న ఒక అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలో కన్సల్టెంట్‌గా ఉన్నారు.

పంచాయతీ సభ్యుడిని పిలిపించి పీహెచ్‌సీ సజావుగా పనిచేయడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి డాక్టర్ లాల్ మాట్లాడారు. మొదట్లో ఆరోగ్య కార్యకర్తలకు, పంచాయతీ సభ్యులకు మధ్య ఘర్షణ వాతావరణం ఉండేదని, కానీ అనతికాలంలోనే అది సమసిపోయిందని ఆయన తెలిపారు.

ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ప్రధాన ఇరుసుగా మారింది. ప్రజారోగ్య వ్యవస్థ దీనిమీదే ఆధారపడింది.

కేరళ

ఫొటో సోర్స్, Getty Images

కేరళలో గౌరీ లక్ష్మీబాయి ట్రావన్‌కోర్‌ను పరిపాలించిన కాలం నుంచీ మంచి ఆరోగ్య సంస్కృతిని ప్రోత్సహించేవారు. స్మాల్ పాక్స్ నివారణ కోసం టీకాలు వేయించుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు చూపించడానికి ఆమె 1813 లోనే ప్రజల్లోకి వచ్చారు.

‘‘రాష్ట్రంలో 1957లో మొదటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. ఈఎంఎస్ నంబూద్రిపాద్ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఒక వైద్యుడు ఉన్దినారు’’ అని డాక్టర్ లాల్ తెలిపారు.

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ వి రవి బీబీసీ హిందీతో మాట్లాడుతూ.. ‘‘కాసర్‌గాడ్‌ను నిర్వహించిన తీరు అసాధారణంగా ఉంది. వారు మార్చి చివరి వారంలో ప్రతి రోజూ 30-40 మందికి కరోనావైరస్ పాజిటివ్ తేలేది. వారందరినీ క్వారంటైన్ చేశారు. వారి ప్రాధమిక, ద్వితీయ కాంటాక్టులందరికీ వేగంగా పరీక్షలు చేసి.. వైరస్ వ్యాప్తిని నియంత్రించారు. వేగంగా పరీక్షలు చేసే వారి వ్యూహం అందరూ అనుసరించదగ్గది’’ అని పేర్కొన్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)