కరోనావైరస్: క్వారంటైన్‌తో ‘జూ’లో జంతువుల్లా మారిన కుటుంబాలు

భారతదేశం వేలాది మంది ప్రజలను వారి ఇళ్లలోనే క్వారంటైన్ చేసింది. కానీ.. వారిని ఇళ్లలోనే ఉంచటం కోసం వారి ఇళ్ల ముందు నోటీసులు అంటించటం, వారి వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేయటం వంటి కొన్ని చర్యలు అవాంఛిత, బాధాకర పరిణామాలకు దారితీశాయి. బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే కథనం.
భరత్ ఢింగ్రా కుటుంబంలోని ఆరుగురు సభ్యులూ.. దేశ రాజధాని దిల్లీ నగరంలో ‘హోం క్వారంటైన్’లో ఉన్నారు. ఆయన సోదరుడు, అతడి భార్య మార్చి 22వ తేదీన అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచీ వారందరూ గృహ నిర్బంధంలోనే ఉన్నారు.
వారిద్దరిలో ఎవరికీ ఎటువంటి లక్షణాలూ కనిపించలేదు. కానీ ఆ కుటుంబం మొత్తం ప్రభుత్వ సలహాను పాటిస్తూ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.
అంతలో అధికారులు వారి ఇళ్ల బయట నోటీసులు అంటించారు. ‘‘ఈ ఇంటికి వెళ్లొద్దు.. క్వారంటైన్‌లో ఉన్నారు’’ అనేది దాని సారాంశం.
జనం నిబంధనలు పాటించేలా చూడటం దాని ఉద్దేశం. కానీ.. నిబంధనలను పూర్తిగా పాటిస్తున్న ఢింగ్రా వంటి వారికి ఈ నోటీసు ‘‘ఒత్తిడి, మనోవేదన’’ కలిగించింది.
‘‘మా ఇల్లు ఒక జూ లాగా మారింది. జనం అటూ ఇటూ వెళుతూ ఆగి ఫొటోలు తీసుకుంటున్నారు. మేం ఒక్క నిమిషం పాటు బాల్కనీలో అడుగుపెట్టినా కానీ మా పొరుగు వాళ్లు మమ్మల్ని లోపలికి వెళ్లాలని చెప్తున్నారు’’ అని ఆయన బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘జనానికి అవగాహన కోసం క్వారంటైన్లో ఉన్న ఇళ్లను గుర్తుపట్టటానికి నోటీసులు అవసరమని మేం అర్థం చేసుకోగలం. ప్రభుత్వ అధికారులు మా పట్ల మంచిగానే వ్యవహరిస్తున్నారు. కానీ కొంత మంది జనం తీరు మమ్మల్ని బాధిస్తోంది’’ అని చెప్పారాయన.
‘‘కొందరు మా ఇంటి ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు.. హెచ్చరికగా’’ అని పేర్కొన్నారు.
అది తమ కుటుంబ గోప్యతను ఉల్లంఘించటమేనన్నారు.
‘‘హోం క్వారంటైన్ అనేది ముందు జాగ్రత్త చర్య అని జనం తెలుసుకోవాలి. దాని అర్థం మాకు ఇన్ఫెక్షన్ సోకిందని కాదు. ఒకవేళ మాకు సోకినా కానీ.. అందువల్ల మా పట్ల ఇలా వివక్ష చూపకూడదు’’ అని వ్యాఖ్యానించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇదే తరహా అనుభవాలు ఎదురైన కొందరు వ్యక్తులతో బీబీసీ మాట్లాడింది.
నోయిడాలో నివసించే ఓ దంపతులు.. తమ ఇల్లు ‘‘చాలా మందికి ఒక భయంకరమైన స్థలం’’గా మారిందని చెప్పారు. వారు తమ వివరాలు వెల్లడించవద్దని కోరారు.
‘‘విదేశం నుంచి వచ్చిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా మేం హోం క్వారంటైన్లో ఉన్నాం. కానీ మమ్మల్ని సమాజం పూర్తిగా వెలివేస్తుందని మాకు తెలియలేదు’’ అని చెప్పారు.
ఫోన్లో కానీ టెక్ట్స్ మెసేజ్లో కానీ కాస్త ప్రోత్సాహమిచ్చే మాటలు మాత్రమే వారు ఆశించారు.
‘‘కానీ ప్రతి ఒక్కరూ మమ్మల్ని అనుమానంగా చూస్తారు. మా బాల్కనీలో నిలుచున్నా కూడా వారి కళ్లలో అది కనిపిస్తూనే ఉంటుంది’’ అని తెలిపారు.
‘‘మేం ఎవరినీ కలవటం లేదు. మమ్మల్ని ఇలా చూడటం చాలా బాధాకరం’’ అన్నారు.

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా

ఉత్తరప్రదేశ్ లోని ఫరూకాబాద్ జిల్లాలో క్వారంటైన్లో ఉన్న కుల్జీత్ సింగ్ కూడా ఇటువంటి అనుభవాలు ఎదుర్కొన్నారు.
బాలీవుడ్ గాయని కనికా కపూర్ ఇచ్చిన ఒక పార్టీకి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత ఆమెకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
‘‘ఈ ఉదంతం మీద మీడియాలో అంతులేని చర్చ జరిగింది. అది మా కుటుంబాన్ని చాలా ఒత్తిడికి గురిచేసింది. ఎన్నో రకాల వదంతులు వ్యాపించటం మొదలయ్యాయి. నేను రక్తం కక్కుకుంటున్నానని, కొన్ని రోజుల్లోనే చనిపోతానని కూడా కొందరు చెప్పుకొచ్చారు’’ అని ఆయన వివరించారు.
జనం బాగా భయపడి ఉన్నారని, సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులనైనా వారు నమ్మేసే పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆయన క్వారంటైన్ సమయం ముగిసింది. అయినా కానీ తమ పట్ల వివక్ష తొలగిపోవటానికి చాలా కాలం పడుతుందని అంటున్నారు.
‘‘కూరగాయలు, పాలు అమ్మేవాళ్లు కూడా మా ఇంటి దగ్గరకు వాటిని అందించటానికి తిరస్కరిస్తున్నారు’’ అని తెలిపారాయన.
కొన్ని చోట్ల పరీక్షలు నిర్వహించిన విధానం కూడా సమస్యలకు దారితీసింది. బిహార్లో నివసించే ఒక కుటుంబం.. కెనడా నుంచి వచ్చి స్వీయ క్వారంటైన్‌లో ఉన్న తమ కొడుకును అపార్ట్‌మెంట్ భవనం నుంచి రోడ్డు మీదకు వచ్చి.. పరీక్ష కోసం లాలాజల నమూనా ఇవ్వాలని చెప్పారని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘వ్యక్తిగత రక్షణ సూట్లు ధరించిన అంతమంది డాక్టర్లను అక్కడ చూసినపుడు మా ఇరుగుపొరుగు వారు చాలా భయపడిపోయారు. జనం సురక్షితమైన దూరం నుంచి పలకరించటం కూడా మానేశారు’’ అని వారు వివరించారు.
తమ కుమారుడికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయిందని.. కానీ ఆ పరీక్ష చేసిన తీరు వల్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని, జనం తమను కలవటానికి ఇంకా అయిష్టంగానే ఉన్నారని చెప్పారు.
సమాచారం లీక్...
మరోవైపు.. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో క్వారంటైన్‌లో ఉన్న వారి పేర్లను బహిర్గతం చేశారు.
‘‘హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు ఏదో సెలవులు గడపటానికి వచ్చినట్లు సంతోషంగా సంచరిస్తున్నారు. అందకే మేం వారి వివరాలను బహిర్గతం చేశాం’’ అని బెంగళూరులోని ఒక సీనియర్ అధికారి బీబీసీ హిందీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీకి చెప్పారు.
కానీ ఇది వారి వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించటమేనని నిపుణులు చెప్తున్నారు.
‘‘ప్రభుత్వం కేవలం వారి పేర్లు మాత్రమే ప్రచురించి ఉంటే సమస్య లేదు. కానీ చిరునామాలు కూడా వెల్లడించటం వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టటమే’’ అని బెంగళూరుకు చెందిన న్యాయవాది కె.వి.ధనంజయ్ పేర్కొన్నారు.
క్వారంటైన్ కేంద్రాల విషయంలో కొన్నిచోట్ల నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి.
బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలోని మైసూరులో.. 27 మందిని క్వారంటైన్‌లో ఉంచిన ఒక హోటల్‌ను స్థానిక జనం బలవంతంగా ఖాళీ చేయించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘హోటల్‌లో ఉన్న వారు కిటికీల నుంచి ఉమ్మివేస్తారని.. దానితో తమకు ఇన్‌ఫెక్షన్ సోకుతుందని జనం భయపడ్డారు’’ అని మైసూర్ మాజీ డిప్యూటీ మేయర్ ఎం.జె.రవికుమార్ చెప్పారు.
వివక్ష చూపేవారి పట్ల, వదంతులు వ్యాప్తి చేసేవారి పట్ల కఠిన చర్యలు చేపడతామని సీనియర్ పోలీసు అధికారి సి.బి.రిష్యంత్ పేర్కొన్నారు.
ఇక హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్న 19 మంది వ్యక్తిగత సమాచారం, వారి ఫోన్ నంబర్లు లీకయ్యాయి.
దీంతో వారి కుటుంబాలకు ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్ కాల్స్ రావటంతో పాటు.. వైరస్‌ను ఎలా చంపాలనే ఉచిత సలహాలు కూడా ఇవ్వటం మొదలైంది.
మార్చి 24న లాక్‌డౌన్ ప్రకటించటానికి ఒక రోజు ముందు నగరం నుంచి గ్రామానికి వెళ్లిన రమేష్ తుంగ.. తనకూ ఇటువంటి వివక్ష ఎదురైందని చెప్పారు.
‘‘నేను విదేశాలకు వెళ్లివచ్చిన చరిత్ర ఏదీ లేదు. అయినాకానీ ఊర్లో అధికారులకు సమాచారం ఇచ్చి.. స్వీయ నిర్బంధంలో ఉన్నాను. కానీ అది నాకు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది’’ అని తెలిపారు.
‘‘జనం మా కుటుంబంతో మాట్లాడటం మానేశారు. నాకు కరోనావైరస్ ఉందని, నా వల్ల గ్రామం మొత్తానికీ వైరస్ సోకుతుందని అందరూ నమ్మేశారు.
‘‘జనం జాగ్రత్తగా ఉండటం మంచిది.. కానీ మనుషులుగా ఉండటం మానేయకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








