హరియాణా: లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి

గాయపడిన ముస్లిం సోదరులు
    • రచయిత, సత్‌ సింగ్
    • హోదా, బీబీసీ కోసం

హరియాణాలోని జింద్ జిల్లా థాథ్రాత్ గ్రామంలో నలుగురు ముస్లిం సోదరుల మీద వారి పొరుగున నివసించే హిందువులు ఆదివారం నాడు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఆదివారం సాయంత్రం కొంత సమయం పాటు ఇంట్లో లైట్లు ఆర్పేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును ఆ నలుగురు గౌరవించకపోవటం దీనికి కారణం.

దాడిలో గాయపడ్డ బషీర్ ఖాన్ (36), సాదికా ఖాన్ (34), నజీర్ ఖాన్ (32), సందీప్ ఖాన్ (30)లను చికిత్స కోసం జింద్ ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల మీద కేసు నమోదు చేసినట్లు డీఐజీ అశ్విన్ షేన్వీ బీబీసీకి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని చెప్పారు.

గాయాలు

బషీర్ ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు అందరి లాగానే తాము కూడా తమదైన రీతిలో ప్రధానమంత్రి పిలుపును పాటిస్తున్నామని చెప్పారు. అయితే తమ ఇంటి వెలుపల ఉన్న ఒక బల్బును ఆర్పివేయలేదంటూ పొరుగింటి వ్యక్తి తమను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు.

అభ్యంతరకర భాష మీద ఆ రాత్రి తమ మధ్య వాగ్వాదం జరిగిందని, అది అంతటితో చల్లారిపోయిందని ఆయన చెప్పారు. మరుసటి రోజు ఉదయం తమ పొరుగింటి వ్యక్తి అభ్యంతరకర భాష వెనుక కారణాన్ని తెలుసుకోవటానికి తాము ప్రయత్నించామని.. వారంతా మళ్లీ తమ మీద విరుచుకుపడ్డారని తెలిపారు.

గాయాలు

కొంతసేపటి తర్వాత తమ ఇంట్లో కుర్చీలో కూర్చున్న తమ చిన్న తమ్ముడు సాదిక్ ఖాన్ మీద ఇరుగుపొరుగు వారు దాదాపు డజను మంది పదునైన ఆయుధాలతో దాడిచేశారని, అతడు తీవ్రంగా గాయపడ్డాడని, దీంతో ఇరు పక్షాల మధ్య ఘర్షణ జరిగిందని వివరించారు.

‘‘మా నలుగురు సోదరులకూ తల, ముఖం, చేతులు, కాళ్ల మీద గాయాలయ్యాయి. మా చిన్న తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. విషమ పరిస్థితిలో ఉన్న అతడిని జింద్ జిల్లా ఆస్పత్రి నుంచి రోహతక్ లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించారు’’ అని బషీర్ ఖాన్ చెప్పారు.

తమ పొరుగున ఉండే హిందువులతో గొడవ జరగటం ఇది మొదటిసారి కాదని ఆయన పేర్కొన్నారు. దిల్లీలో నిజాముద్దీన్ కార్యక్రమానికి హాజరైన వారికి తాము ఆశ్రయం ఇచ్చినందుకు కూడా.. గ్రామస్తుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారంటూ తమను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

గాయపడిన ముస్లిం సోదరులు
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేయాలన్న ప్రధానమంత్రి పిలుపును గౌరవించకుండా సదరు ముస్లిం సోదరులు తప్పు చేయటం ఈ ఘర్షణకు దారితీసిందని ఖాన్ సోదరుల పొరుగున నివసించే సంజయ్ కుమార్ చెప్పారు.

‘‘పొరుగిళ్ల వారు తమ లైట్లు ఆర్పేస్తే.. వారి బల్బు వెలుగుతూనే ఉంది. దానిని ఆర్పివేయాలని మేం వారికి చెప్పాం. అందుకు వారు స్పందించారు. ఆ తర్వాత.. వారు తమ కుటుంబ సభ్యుడు కాని ఒక బయటి వ్యక్తికి ఆశ్రయం ఇచ్చినట్లు మేం గుర్తించాం. దాని గురించి అడిగితే వారు మాతో గొడవకు దిగారు’’ అని ఆయన ఆరోపించారు.

లైట్లు ఆర్పివేయాలన్న ప్రధాని పిలుపును పాటించి ఉన్నట్లయితే.. హిందూ, ముస్లిం కుటుంబాల మధ్య ఈ ఘర్షణ జరిగి ఉండేది కాదని గ్రామ పెద్ద రమేష్ కుమార్ పేర్కొన్నారు.

‘‘ఆదివారం రాత్రి ఆ రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం వారు ఎదురెదురుగా వచ్చినపుడు అది భౌతిక ఘర్షణగా మారింది’’ అని ఆయన చెప్పారు.

సంజయ్ కుమార్
ఫొటో క్యాప్షన్, సంజయ్ కుమార్

ఆ ఘటన జరిగినపుడు తాను హుటాహుటిన అక్కడికి వెళ్లానని.. కానీ అప్పటికే వాళ్లు పరస్పరం తీవ్రంగా గాయపరచుకున్నారని పేర్కొన్నారు.

జింద్ జిల్లాలోని థాథ్రాత్ గ్రామంలో 2000కు పైగా హిందూ కుటుంబాలతో పాటు.. 20 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.

ముస్లిం కుటుంబం ప్రధాని పిలుపు మేరకు దీపాలు వెలిగించిందని, కానీ పొరపాటున ఒక బల్బును ఆపివేయలేదని, అందువల్ల అది వెలుగుతూనే ఉండిపోయిందని తమ విచారణలో వెల్లడైందని.. కేసు దర్యాప్తు చేస్తున్న రాకేష్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లిన అనంతరం మీడియాకు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)