కరోనావైరస్... ఈ భూమి మీద ఒక ఆదిమ జాతిని సమూలంగా నాశనం చేస్తుందా?

- రచయిత, జావో ఫెల్లెట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నకరోనావైరస్ దాడికి అమెజాన్ అడవుల్లోని నివసిస్తున్న ఆరుదైన మానవ జాతులు మొత్తం అంతరించే ప్రమాదం ఏర్పడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విషపూరిత వైరస్ కారణంగా వచ్చే శ్వాస కోశ వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం ఇప్పటికే అక్కడ ఆదిమ జాతుల్లో చాలా ఎక్కువగా ఉంది.
ఆదివారం అంటే ఏప్రిల్ 5 నాటికి మొత్తం 11వేల కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కోవిడ్-19 కారణంగా 486 మంది ప్రాణాలు కోల్పోయారని బ్రెజిల్ వెల్లడించింది.
ఈ వైరస్ మొదట పారిశ్రామిక నగరమైన శావ్ పావ్‌లోపై ప్రభావం చూపింది. ఆ తర్వాత క్రమ క్రమంగా అమెజాన్ అటవీ ప్రాంతం సహా దేశ మంతా విస్తరించింది. విస్తీర్ణంలో అమెజాన్ అడవులు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మొత్తంతో సమానం.

తొలి కోవిడ్-19 కేసు నమోదు
ఇప్పటికే అమెజోనస్ రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది.
“ఆదిమ జాతుల్లో ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం తీవ్రంగా ఉంది. ఇది వారి వినాశనానికే దారీ తీయవచ్చు” అంటూ శావ్‌పాలో లోని ఫెడరల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డాక్టర్ సోఫియా మెండోంక ఆందోళన వ్యక్తం చేశారు.
అమెజాన్ వర్షారణ్యంలోని షింగు నది ప్రాంతంలోని అరుదైన మానవ జాతులపై యూనివర్శిటీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఓ హెల్త్ ప్రాజెక్టులో డాక్టర్ మెండోంక సమన్వయ కర్తగా పని చేస్తున్నారు.
గతంలో మీజిల్స్ వ్యాధి ఎంత తీవ్ర ప్రభావం చూపించిందో ఇప్పుడు కరోనావైరస్ కూడా అంతే ప్రభావం చూపించవచ్చని ఆమె ఆందోళన చెందుతున్నారు.
1960లో తట్టు(మీజిల్స్) మహమ్మారి స్థానిక వెనెజ్వెలా సరిహద్దుల్లో నివసించే యనొమమి జాతి ప్రజలను వణికించింది. వ్యాధి సోకిన వారిలో 9 శాతం మందిని పొట్టనబెట్టుకుంది.
“ప్రతి ఒక్కరూ ప్రమాదంలో పడతారు. వయసు మీరిన వారందర్నీ వారి ప్రపంచాన్ని, వారి సమాజాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇదో అరాచక పరిస్థితి.” అని డాక్టర్ మెండోకా అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాతుల సమూహాలు చిన్న చిన్న బృందాలుగా విడిపోయి వేర్వేరుగా అడవుల్లో తలదాచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గతంలో ఇటువంటి మహమ్మారులు విజృంభించినప్పుడు కూడా వారు ఇలాగే చేశారని ఆమె చెప్పారు.
“ముందుగానే వారికి అవసరమయ్యే ఆహార పదార్థాలు వేటకు, చేపలు పట్టేందుకు వినియోగించే ఆయుధాలు అన్నింటిని సిద్ధం చేసుకొని ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసుకుంటారు. మహమ్మారి ప్రభావం తగ్గేంత వరకు అక్కడే ఉంటారు.” అని డాక్టర్ మెండోకా తెలిపారు.

చేతులు కడుక్కోవాలని తెలియదు
వ్యాధి సంక్రమించకుండా ముందు జాగ్రత్తగా నాగరిక సమాజం చేస్తున్నట్టు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అలాగే శానిటైజర్ల వినియోగం గురించి వారిలో చాలా జాతులకు తెలియదు.
అంతా ఒక్క చోటే నివసిస్తుండటం, ఒకరు వాడిన వస్తువుల్నే ఇంకొకరు కూడా వాడుతుండటం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకడమే కాదు... చాలా వేగంగా వ్యాపిస్తుంది కూడా.
ఒకరు వినియోగించే వంట పాత్రలు మరొకరు వాడద్దని వైద్యులు ఇప్పుడు వారికి సూచిస్తున్నారు. అలాగే మహిళలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎలాగైతే అందరికీ దూరంగా ఏకాంతంగా ఉంటారో అలాగే కోవిడ్-19 సోకిన వారు కూడా దూరంగా , ఏకాంతంగా ఉండాలని చెబుతున్నారు.
అయితే వారు నివసించే ప్రాంతాలు వైద్య సౌకర్యాలకు అందనంత దూరంలో ఉంటాయి. ఇక ఐసీయూల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

బ్రెజిల్ దేశాధ్యక్షుని తీరుపై విమర్శలు
బ్రెజిల్ దేశ వ్యాప్తంగా వైరస్ విస్తరిస్తూ ఉండటంతో ఈ అరుదైన జాతులను కాపాడుకోవాలన్న ఆలోచనలో అధ్యక్షుడు బొల్సనారో ఉన్నారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
అయితే చాలా మంది అరుదైన జాతుల నాయకులు... బొల్సనారోనూ తమ శత్రువుగానే చూస్తారు. ఎందుకంటే తమ ఆవాసమైన విశాల అమెజాన్ అటవీ ప్రాంతం, అక్కడ సహజవనరులు దేశంలోని మిగిలిన ప్రజలందరికీ చెందుతాయని ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నారు.
వ్యాధి తీవ్రతను వీలైనంత వరకు తగ్గించేందుకు బ్రెజిల్‌లోని చాలా రాష్ట్రాల గవర్నర్లు నిషేధాజ్ఞలు జారీ చేస్తుంటే అధ్యక్షుడు బొల్సనారో మాత్రం కోవిడ్-19ని ఓ సాధారణ ఫ్లూతో పోల్చుతున్నారు. అంతే కాదు పాఠశాలలు, షాపింగ్ మాళ్లు తిరిగి తెరవాలని వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, SANDRA HAKUWI KUADY
"కరోనావైరస్‌ను తరిమేద్దాం" అంటూ బ్యానర్లు
ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో చాలా ఆదిమ జాతి సంఘాలు తమ జాతులకు చెందిన ప్రజలు తక్షణం నగరాలకు ప్రయాణాలను నిలిపేయాలని అలాగే నగరాల నుంచి తమ ప్రాంతాలకు ఎవ్వరూ అడుగుపెట్టకుండా చూడాలని సూచిస్తున్నారు.
“నిజమైన స్నేహితులంతా మా పరిస్థితిని అర్థం చేసుకుంటారు. కరోనావైరస్‌ను గ్రామాల్లో అడుగుపెట్టకుండా తరిమేద్దాం.” అంటూ మాటో గ్రొస్సో రాష్ట్రంలోని రోడ్లపై కరజ జాతికి చెందిన ప్రజల పేరిట ఓ బ్యానర్ ఇప్పుడు కనిపిస్తోంది.
అయితే ఇలాంటి ముందు జాగ్రత్తలు అక్కడక్కడా తీసుకుంటున్నప్పటికీ కొన్ని గ్రామాలపై కోవిడ్-19 ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తక్షణం ఆయా గ్రామాల్లో ఇన్ఫెక్షన్‌కు గురైన వారిని ఐసోలేట్ చెయ్యడం ద్వారా ఆ వ్యాధి మరింత మందికి సంక్రమించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
అరుదైన జాతుల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఫెడరల్ ఏజెన్సీ ఫునాయ్ లెక్కల ప్రకారం బ్రెజిల్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న 107 ఆదిమ జాతుల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉన్నాయి.
అక్రమ కలప వ్యాపారులు, వేటగాళ్లు, క్రైస్తవ మిషనరీలు వారుంటున్న ప్రాంతాల్లో తమ కార్య కలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇటీవల కాలంలో వాటి జోరు భారీగా పెరిగిందని ఆదిమ జాతి సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు చెబుతున్నాయి.
కొన్నేళ్లుగా ఫునాయ్ తరచు విధించిన బడ్జెట్ కోతలు కూడా ఇప్పుడు ఈ మారు మూల ప్రాంతాల రక్షణకు ఇబ్బందిగా పరిణిమించింది.
కరోనావైరస్‌పై చేస్తున్న యుద్ధం కారణంగా మున్ముందు అమెజాన్ అటవీ సంరక్షణకు అందించే నిధుల్లో మరిన్ని కోతలు ఉండవచ్చన్న భయం ఇప్పుడు మొదలైంది.

ఫొటో సోర్స్, AFP
ఆకలి కేకలు తప్పవా ?
వ్యాధి తమ ప్రాంతాలకు సంక్రమించకుండా ఉండేందుకు నగరాలకు వెళ్లడం మానేస్తామని చాలా సముహాలు చెబుతున్నాయి. అయితే అదే జరిగితే ప్రజలకు నిత్యాసరాలు అందించే మార్కెట్లు అందుబాటులో ఉండవని ఆకలితో అలమటించాల్సి వస్తుందని ఈ అరుదైన జాతుల సమూహాలకు చెందిన చాలా మంది నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సావ్ గాబ్రియెల్ డ కాషోయిరా... అటు కొలంబియా ఇటు వెనుజ్వెలా సరిహద్దుల్లో ఉన్న అమెజాన్‌కు చెందిన మున్సిపాలిటీ. ఇక్కడ వేలాది మంది ప్రజలు బోట్ల ద్వారా సమీప నగరానికి వెళ్లి ప్రభుత్వ పింఛన్లను, నగదు సాయాన్ని తీసుకుంటూ ఉంటారు.
ఇటీవల కాలంలో ప్రభుత్వాలు అందిస్తున్న ఈ సాయం కారణంగా చాలా మంది తమ వేటకు స్వస్తి చెప్పారు. తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలను సొంతంగా పండించుకుంటున్నారు.
తాజా పరిస్థితితో స్థానికంగా నివసిస్తున్న చాలా మంది ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండిజినస్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ రియో నెగ్రొ అధ్యక్షుడు మారివెల్టొన్ బారె అన్నారు.
“ప్రస్తుతం ఈ సంక్షోభ సమయంలో అమెజాన్ ప్రాంతంలోని మారు మూల గ్రామాల్లో నివసిస్తున్న వారికి మేం ఆహారాన్ని అందించాలి. అప్పుడే వారు బయటకు రాకుండా ఉంటారు.” అని ఆయన చెప్పారు.
సావ్ గాబ్రియెల్ డ కాషోయిరా ఆస్పత్రిలో వెంటిలేటర్లు అందుబాటులో లేవు. ఎవరైనా తీవ్రంగా జబ్బు పడితే వారిని సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెజానస్ రాజధాని మానౌస్‌కి తీసుకెళ్లాలి. అది కూడా బోటు ప్రయాణం ద్వారా.
కరోనావైరస్‌ను నిర్ధారించే పరీక్ష కిట్లు లేవు. అవసరమైన మేర మాస్కులు లేవు. అటవీ ప్రాంతంలో ఉండే ఆదిమ వాసుల గ్రామాలకు వెళ్లి బాధితులకు చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య పరికరాలు లేవు అంటూ అక్కడ నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితుల్ని స్థానికంగా ఆదిమ ప్రజల బాగోగుల్ని చూసే స్పెషల్ సెక్రటేరియట్ ఫర్ ఇండిజినెస్ హెల్త్ (సిసాయ్)లో పని చేస్తున్న ఓ ఓ నర్సు వివరించారు.

అయితే, ఈ సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను వివరించే కర పత్రాలను అధికారులకు అందించామని సిసాయ్‌కి చెందిన వైద్య విభాగం బీబీసీకి చెప్పింది.
వారు ప్రజలకు తగిన సూచనలు ఇస్తారని తద్వారా ప్రజలు తగిన ముందు జాగ్రత్తలు తీసుకొని వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చని తెలిపింది.
కోవిడ్-19 విషయంలో ఎలా చికిత్స అందించాలన్న విషయంపై తమ విభాగాన్ని చెందిన అన్ని వైద్య బృందాలకు శిక్షణ అందించామని కూడా వెల్లడించింది.
కానీ గ్రామాల్లో ఏర్పడే ఆహార కొరతపై ఆ సంస్థ ఎటువంటి సమాధానం చెప్పలేదు.
ఈ మహమ్మారి సమయంలో ఎదురయ్యే ఆహార కొరతను, భూ దురాక్రమణలను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు ఫునాయ్ కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు.
అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి సాయం చెయ్యలేదని లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఆహర కొరత ఏర్పడితే ప్రభుత్వ సూచనల్ని వారు పట్టించుకునే పరిస్థితి ఉండదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆకలితో అలమటించడమా.. లేదా వ్యాధిని ఆహ్వానించడమా అన్న సంశయం తలెత్తినప్పుడు వారు రెండో దాన్నే ఎంచుకుంటారని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే విపత్కర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








