అప్పుడు గంగానది శవాలతో ఉప్పొంగింది... మరణమృదంగం మోగించిన 1918 నాటి ఫ్లూ మహమ్మారి

ఫొటో సోర్స్, NATIONAL MUSEUM OF HEALTH AND MEDICINE
''జీవితం మీద ఆసక్తి పూర్తిగా చచ్చిపోయింది...'' - మహాత్మా గాంధీ 1918లో గుజరాత్‌లోని తన ఆశ్రమంలో తనను కలిసిన ఒక సన్నిహితుడితో చెప్పిన మాట ఇది. అప్పుడు ఆయన ఒక ప్రాణాంతక ఫ్లూతో పోరాడుతున్నారు.
అప్పుడు గాంధీ వయసు 48 ఏళ్ళు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చి నాలుగేళ్లయింది. గుజరాత్‌లోని ఆయన ఆశ్రమాన్ని స్పానిష్ ఫ్లూ మహమ్మారి చుట్టుముట్టింది.
గాంధీకి కూడా అది సోకింది. ఆయన జీవితంలో అది ''సుదీర్ఘంగా సాగిన తొలి జబ్బు''. ఆయన ద్రవాహారానికి మాత్రమే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు. ఆయన అనారోగ్యం గురించి తెలిసినపుడు ఒక స్థానిక వార్తాపత్రిక: ''గాంధీ జీవితం ఆయనకు చెందదు - అది భారతదేశానికి చెందుతుంది'' అని రాసింది.
ఆశ్రమం వెలుపల.. 1918 జూన్‌లో మొదటి ప్రపంచ యుద్ధం నుంచి తిరిగివచ్చిన సైనికులతో పాటు బొంబాయి (ఇప్పుడు ముంబై) రేవుకు ఓడలో వచ్చిన ఆ ప్రాణాంతక ఫ్లూ భారతదేశాన్ని అతలాకుతలం చేసింది.
హెల్త్ ఇన్‌స్పెక్టర్ జె.ఎస్.టర్నర్ నివేదిక ప్రకారం.. ఆ మహమ్మారి ''రాత్రి పూట దొంగలా వచ్చింది. వేగంగా మోసపూరితంగా వ్యాపించింది''. ఈ వ్యాధి రెండోసారి సెప్టెంబర్‌లో దక్షిణ భారతదేశం మీద పంజా విసిరింది. తీరప్రాంతమంతా విస్తరించింది.
ఆ ఇన్‌ఫ్లుయెన్జా 1.7 కోట్ల నుంచి 1.8 కోట్ల మంది భారతీయులను బలితీసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో మొత్తం చనిపోయిన వారి సంఖ్య కన్నా ఇది అధికం. భారతప్రజల్లో ఆరు శాతం మంది చనిపోయారు.

పురుషుల కన్నా మహిళలు అధికంగా చనిపోయారు. పోషకాహార లోపంతో పాటు.. అపరిశుభ్రమైన, గాలీవెలుతురు సరిగా లేని నివాసాలు, రోగం బారిన పడిన వారికి సేవలు చేస్తుండటం దీనికి కారణం.
ఆ మహమ్మారి ప్రపంచంలో మూడో వంతు ప్రజలకు సోకిందని భావిస్తారు. దానివల్ల మొత్తంగా 5 నుంచి 10 కోట్ల మంది వరకూ చనిపోయారని అంచనా.
గాంధీ, ఆశ్రమంలో ఆయనతో పాటు ఈ వ్యాధి బారిన పడిన సహచరులు అదృష్టవశాత్తూ కోలుకున్నారు.
ఆ మహమ్మారి కారణంగా కృశించిన ఉత్తర భారతదేశపు గ్రామీణ ప్రాంతంలో ప్రఖ్యాత హిందీ కవి సూర్యకాంత్ త్రిపాఠి తన భార్యను, కొందరు కుటుంబ సభ్యులను కూడా కోల్పోయారు. ''రెప్పవాటులో నా కుటుంబం అదృశ్యమైంది. గంగా నది శవాలతో ఉప్పొంగి పోయింది'' అని ఆయన రాశారు.
స్పానిష్ ఫ్లూ మరణాలతో శవాలు కుప్పలుగా పేరుకుపోయాయి. వాటిని దహనం చేయటానికి సరిపడేంతగా కట్టెలు లేవు. ఈ పరిస్థితుల్లో వర్షాలు ముఖం చాటేశాయి. పంటలు పండలేదు. కరవు పరిస్థితులు తలెత్తాయి. జనానికి సరైన తిండి లేదు. మరింత బలహీనంగా మారారు. దీంతో పని కోసం, తిండి కోసం నగరాల బాట పట్టారు. అటువంటి పరిస్థితుల్లో మహమ్మారి మరింత వేగంగా విస్తరించింది.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
1918 నాటి స్పానిష్ ఫ్లూ యాంటీబయాటిక్ శకానికి ముందు దాడిచేసింది. అత్యంత తీవ్రంగా జబ్బుపడిన వారికి చికిత్స అందించటానికి సరిపడా వైద్య పరికరాలే లేవు. పాశ్చాత్య ఔషధాలను భారతదేశంలో అంతగా ఆమోదించేవారు కాదు కూడా. చాలా మంది జనం దేశీయ మందుల మీదే ఆధారపడ్డారు.
స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా వ్యాపించటానికి మూలం.. తీవ్ర జనసమ్మర్థంతో కూడిన బొంబాయిలో అది మొదలుకావటం. రెండు కోట్ల మందికి జనాభా ఉన్న బొంబాయి... భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరం. ఆ నగరం ఉన్న మహారాష్ట్ర నుంచి ఈ వైరస్ వేగంగా విస్తరించింది.
1918 జూలై ఆరంభం నాటికి స్పానిష్ ఫ్లూ కారణంగా రోజుకు 230 మంది చనిపోయాకు. జూన్ చివర కలా రోజు వారీ మరణాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి.
''అధిక జ్వరం, వీపు నొప్పులు ప్రధాన లక్షణాలు. మూడు రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. బొంబాయిలో దాదాపు ప్రతి ఇంట్లో కొంతమంది జ్వరంతో మంచాన పడ్డారు'' అని ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో చెప్పింది.
కార్మికులు కార్యాలయాలు, కర్మాగారాలకు వెళ్లకుండా దూరంగా ఉన్నారు. భారతదేశంలో నివసించే యూరప్ వాసులకన్నా భారతీయులే అధికంగా ఈ వ్యాధి బారినపడ్డారు.
జనం బయటకు రావద్దని, ఇళ్లలోపలే ఉండాలని ఆ పత్రిక సూచించింది. ఈ వ్యాధికి ''ముఖ్యమైన పరిష్కారం.. మంచం మీద పడుకోవటం.. ఆందోళన చెందకుండా ఉండటం'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
''ఈ వ్యాధి సోకిన వారి ముక్కు, నోరు నుంచి కారే ద్రవాల ద్వారా.. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఇది వ్యాపిస్తోంది'' అని ప్రజలకు గుర్తుచేసింది.
''ఈ వ్యాధిబారిన పడకుండా ఉండటానికి జనం ఎక్కువగా గుమికూడే అన్ని ప్రదేశాలకూ దూరంగా ఉండాలి. సంతలు, పండుగలు, థియేటర్లు, స్కూళ్లు, సమావేశ మందిరాలు, సినిమాలు, పార్టీలు, రద్దీగా ఉన్న రైల్వే బోగీలు వంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి'' అని ఆ పత్రిక రాసింది.
జనం గాలీవెలుతురు సరిగా లేని గదుల్లో కాకుండా ఆరుబయట నిద్రించాలని, పోషకాహారం తీసుకోవాలని, వ్యాయామం చేయాలని సలహా ఇచ్చింది. ''అన్నిటికీ మించి ఈ జబ్బు గురించి అంతగా ఆందోళన చెందవద్దు'' అని చెప్పింది.
ఈ ఇన్‌ఫెక్షన్ ఎలా వచ్చిందనే అంశంపై వలస పాలకుల మధ్య విభేదాలున్నాయి. బొంబాయి రేవులో ఆగిన నౌకలోని జనం ఈ స్పానిష్ ఫ్లూను బొంబాయికి తీసుకువచ్చారని ఆరోగ్య అధికారి టర్నర్ విశ్వసించారు. కానీ.. ఆ నౌకలోని వారికి బొంబాయి నగరంలోనే ఈ ఫ్లూ సోకిందని ప్రభుత్వం వాదించింది.
''ప్రభుత్వాలు ఏదైనా మహమ్మారిని తాము నియంత్రించలేనపుడు.. భారతీయుల అపరిశుభ్ర పరిస్థితులే దీనికి కారణమని ఆపాదించటం సాధారణ లక్షణంగా మారింది'' అని వైద్య చరిత్రకారిణి మృదులా రామన్న అభిప్రాయపడ్డారు. స్పానిష్ ఫ్లూ మహమ్మారి నుంచి బొంబాయి ఎలా కోలుకుందో అధ్యయనం చేసి రాసిన పుస్తకంలో ఆమె ఆ విషయం రాశారు.
అనంతరం ఒక ప్రభుత్వ నివేదిక.. భారతదేశ ప్రభుత్వ స్థితిగతుల మీద విచారం వ్యక్తం చేస్తూ.. దానిని తక్షణమే సంస్కరించాల్సిన, విస్తరించాల్సిన ఆవశ్యకతను విశదీకరించింది.
అత్యవసర కాలంలో అధికారులు కొండల్లోనే ఉండిపోయారని.. ప్రభుత్వం ప్రజలను వారి ఖర్మకు వదిలివేసిందని వార్తాపత్రికలు ఆరోపించాయి.
బొంబాయిలో ఫ్లూ నుంచి కోలుకుంటున్న బ్రిటిష్ సైనికులకు హాస్పిటల్ స్వీపర్లు దూరంగా ఉన్నారని.. 'పేల్ రైడర్: ద స్పానిష్ ఫ్లూ ఆఫ్ 1918 అండ్ హౌ ఇట్ చేంజ్డ్ ద వరల్డ్' రచయిత లారా స్పిన్నీ రాశారు.
''1886-1914 మధ్య 80 లక్షల మంది భారతీయులను బలితీసుకున్న ప్లేగు మహమ్మారి విషయంలో బ్రిటిష్ పాలకుల స్పందన ఎలా ఉందన్నది స్వీపర్లకు గుర్తుంది'' అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
''స్థానిక ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లిప్తతకు వలస పాలకులు కూడా మూల్యం చెల్లించారు. ఎందుకంటే ఈ విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం వారికి ఏ మాత్రం లేదు. పైగా వైద్యులు చాలా మంది యుద్ధ రంగంలో దూరంగా ఉండటం వల్ల స్థానికంగా వారి కొరత కూడా ఉంది'' అని లారా వివరించారు.
చివరికి స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి చేయి కలిపారు. వాళ్లు తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. మృతదేహాలను తొలగించారు. దహనాలకు ఏర్పాట్లు చేశారు. చిన్న చిన్న ఆస్పత్రులు తెరిచారు. రోగులకు చికిత్స అందించారు. నిధులు సమీకరించారు. దుస్తులు, మందులు పంచటానికి సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పౌరులు ఇన్‌ఫ్లున్జా వ్యతిరేక సంఘాలను ఏర్పాటు చేశారు.
''విద్యావంతులు, సమాజంలో మెరుగైన స్థానంలో ఉన్నవారు తమకన్నా పేదవారైన తమ సోదరులకు తీవ్ర కష్టకాలంలో సాయం చేయటానికి ఇంత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చిన ఉదంతం బహుశా భారతదేశ చరిత్రలో అంతకుముందు ఎన్నడూ లేదు'' అని ప్రభుత్వ నివేదిక ఒకటి చెప్తోంది.
ఆ తరువాత కరోనావైరస్ చుట్టుముట్టినప్పుడు కూడా దేశం ఒక్కటై పోరాడింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించారు. ఇలాంటి ఘటనలు ఒక సమాజపు స్మృతిలో చెరగని గుణపాఠాలుగా మిగిలిపోతాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: జనతా కర్ఫ్యూ... యావత్ భారతదేశ నిర్బంధానికి ఆరంభమా?
- ఈ రాకాసి గబ్బిలాలు రక్తం జుర్రుకుంటూ ముద్దులు పెట్టుకుంటాయ్
- నిర్భయ కేసు హంతకుల ఉరితీత: ఆ నలుగురి చివరి కోరికలేంటి
- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కమల్నాథ్ రాజీనామా
- కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోని మహా నగరాల వీధులు ఇప్పుడెలా ఉన్నాయో చూడండి...
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- కరోనావైరస్: ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించండి - ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








