మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్ రాజీనామా

కమల్ నాథ్

ఫొటో సోర్స్, Getty Images

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథా రాజీనామా చేశారు. దీంతో 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది.

"ప్రజలు ఐదేళ్లు పరిపాలించడానికి తమ ఓటు ద్వారా తీర్పునిచ్చారు. గతంలో 15 ఏళ్లపాటు బీజేపీకి అధికారంలో కొనసాగేందుకు ప్రజాతీర్పు వచ్చింది. గవర్నర్‌కు నా రాజీనామాను పంపిస్తున్నాను" అని కమల్‌నాథ్ అన్నారు.

కమల్‌నాథ్ మరికాసేపట్లో తన రాజీనామా లేఖను గవర్నర్‌ లాల్జీ టాండన్‌కు సమర్పించనున్నారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని కమల్‌నాథ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆధారపడి ఉందా లేదా అనేది బలపరీక్షలో తేలుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.

ఉదయం 11 గంటలకు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన కమల్‌నాథ్, 12 గంటలకు మీడియాతో మాట్లాడారు.

తనకు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. 22 ఎమ్మెల్యేలను బందించి ఉంచారని, వారికి అనేక రూపాల్లో ఆశలు కల్పించారని ఆయన అన్నారు. దీని కోసం కోట్ల రూపాయలు వెదజల్లారని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను బీజేపీ మంటగలిపిందని అన్నారు.

కొన్నిరోజులుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంక్షోభం నెలకొంది. కమల్‌నాథ్ త్వరలోనే రాజీనామా చేస్తారనే ఊహాగానాలు చెలరేగాయి.

అయితే, దీనిపై సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించగా, మీడియా సమావేశం వరకూ ఎదురుచూడండి అని సమాధానమిచ్చారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లను చూస్తుంటే, సంతలో పశువుల కొనుగోళ్లను మించిపోయిందని కాంగ్రెస్ మంత్రి పీసీ శర్మ వ్యాఖ్యానించారు.

కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడేందుకు ముందే, తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను అంగీకరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరో అవకాశం లేని పరిస్థితుల్లో వారి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకూ 23మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)