కరోనా వైరస్‌తో కొత్త ఉద్యోగాలు.. ఆన్‌లైన్ అమ్మకాలు పెరగడంతో లక్ష మందిని నియమించుకుంటున్న అమెజాన్

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Reuters

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల అనేక రంగాలు కుదేలై ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. కానీ, ఇదే సమయంలో ఈకామర్స్ సంస్థ అమెజాన్ మాత్రం కొత్త నియామకాలు చేపడుతోంది.

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఆధారపడుతున్నారు. దీంతో పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లుగా అమెజాన్ సంస్థ అమెరికాలో లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది.

ఆన్‌లైన్ అమ్మకాలకు పెరిగిన డిమాండ్ తట్టుకునేందుకు వీలుగా గోదాములలో పని చేయడానికి, సరుకులు డెలివరీ చేయడానికి ఉద్యోగులను నియమిస్తామని సంస్థ ప్రకటించింది.

యూకే, యూరప్, అమెరికాలలో పని చేసే ఉద్యోగులకు జీతాలు కూడా పెంచుతామని సంస్థ ప్రకటించింది.

కరోనా వైరస్ భయంతో ఆన్లైన్ కొనుగోళ్ళకు డిమాండ్ పెరిగిందని సంస్థ తెలిపింది.

ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 7000 మంది మరణించారు. ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే సౌకర్యం కల్పించాయి.

ఆన్లైన్ అమ్మకాలకు డిమాండ్ పెరగడంతో అమెజాన్ తరహాలోనే ఆల్బర్ట్ సన్స్, క్రొగెర్ అండ్ రేలీస్ లాంటి కొన్ని అమెరికన్ సూపర్ మార్కెట్ చైన్లు కూడా అదనపు ఉద్యోగులను పనుల్లోకి తీసుకుంటున్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనా వైరస్ వలన పనులు కోల్పోయి రెస్టారెంట్, పర్యటక, వినోద పరిశ్రమల్లో పని చేసి ఖాళీగా ఉన్న వారిని ఉద్యోగాలలో నియమించేందుకు ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

పరిస్థితులు చక్కబడేవరకు వారికి పని కల్పిస్తామని అమెజాన్ వరల్డ్ వైడ్ ఆపరేషన్స్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ ఒక బ్లాగ్ పోస్ట్ లో పేర్కొన్నారు.

యు.కె , అమెరికా, యూరోప్ దేశాలలో తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకి గంటకి సుమారు150 రూపాయిలు అదనపు వేతనం ఇస్తామని అమెజాన్ ప్రకటించింది. దీనితో కంపెనీకి సుమారు 2587 కోట్ల రూపాయిల అదనపు ఖర్చు అవుతుందని పేర్కొంది.

అయితే, యూకేలో కొత్త ఉద్యొగులను తీసుకుంటారా లేదా అనే విషయం పై కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

తమ సంస్థలో పని చేసే ఉద్యోగులెవరికైనా కరోనా వైరస్ సోకితే రెండు వారాల వేతనం ఇస్తామని గత వారంలో ప్రకటించింది. అంతే కాకుండా సంస్థ కోసం స్వతంత్రంగా పని చేసే వారికి, భాగస్వాముల కోసం 184 కోట్ల రూపాయిల సహాయ నిధిని కూడా కేటాయిస్తున్నట్లు తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా 182000 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, 7000 మరణాలు చోటు చేసుకున్నాయని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది.

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)