వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు

వాస్ప్-76బి

ఫొటో సోర్స్, ESO/M.KORNMESSER

ఫొటో క్యాప్షన్, వర్ణచిత్రం: వాస్ప్-76బి మీద రాత్రి వైపు 1,400 సెంటీగ్రేడ్ల వేడి ఉంటుంది.. ఇది ఇనుప ఆవిరి ద్రవీభవనం చెందటానికి సరిపోయేంత చల్లగా ఉంటుంది
    • రచయిత, జొనాథన్ ఆమోస్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంలో సుదూరంగా ఉన్న ఒక కొత్త గ్రహాన్ని గుర్తించారు. అక్కడ ఇనుము వర్షంలా కురుస్తుందని భావిస్తున్నారు.

ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా వినిపించొచ్చు. కానీ.. మనం ఇప్పుడు గుర్తిస్తున్న సుదూర గ్రహాల్లో ఇది సహజ వాతావరణం.

కొత్తగా గుర్తించిన ఈ గ్రహాన్ని వాస్ప్-76బి అని పిలుస్తున్నారు. ఇది తన సౌరకుటుంబంలో నక్షత్రానికి - అంటే అక్కడి సూర్యుడికి - అతి సమీపంలోని కక్ష్యలో తిరుగుతోంది. అది నక్షత్రానికి ఎంత దగ్గరగా ఉందంటే.. ఆ గ్రహం మీద పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లుగా ఉంటుంది. ఆ వేడికి ఇనుము, ఉక్కు వంటి లోహాలు సైతం ఆవిరైపోతాయి.

అయితే.. ఈ గ్రహం మీద రాత్రి వైపు ఉష్ణోగ్రత.. పగటి ఉష్ణోగ్రత కన్నా 1,000 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. దానివల్ల ఆవిరైన లోహాలు ద్రవీభవనం చెంది వర్షంలా కురుస్తాయి.

ఇదో విచిత్రమైన వాతావరణమని యూనివర్సిటీ ఆఫ్ జెనీవా పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ ఎరిన్‌రీచ్ చెప్పారు.

ఆయన బీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ''ఆకాశం నుంచి నీటి చుక్కల వానజల్లుకు బదులు.. మండుతున్న ఇనుము ద్రావకం వర్షపు చుక్కలుగా కురుస్తుంటే ఎలా ఉంటుందో ఊహించండి'' అని పేర్కొన్నారు.

స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్ డేవిడ్, ఆయన సహచర శాస్త్రవేత్తలు.. ఈ చిత్రమైన గ్రహం గురించి తాము గుర్తించిన ఈ విషయాలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.

స్పెక్ట్రోమీటర్ ఎస్‌ప్రెసో

ఫొటో సోర్స్, ESO/S.BRUNIER

ఫొటో క్యాప్షన్, యూరప్‌ వెరీ లార్జ్ టెలిస్కోప్ వ్యవస్థలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పెక్ట్రోమీటర్ ఎస్‌ప్రెసో

చిలీలో గల యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్‌ప్రెసో పరికరాన్ని ఉపయోగించుకుని.. వాస్ప్76బి గ్రహం మీద క్షుణ్నంగా ఎలా పరిశోధించామనేది ఈ బృందం వివరించింది.

ఈ కొత్త గ్రహం భూమికి 640 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది తన నక్షత్రం చుట్టూ ఒకసారి తిరగటానికి 43 గంటలు మాత్రమే పడుతుంది.

ఈ గ్రహానికి సంబంధించి మరో ఆసక్తి కరమైన లక్షణం ఏమిటంటే.. ఈ గ్రహం తన నక్షత్రం దిశలో ఎల్లప్పుడూ ఒకే అభిముఖంతో ఉంటుంది. భూమి లాగా గుండ్రంగా తిరగదు. అలా ఒకే అభిముఖంతో ఉండే లక్షణాన్ని శాస్త్రవేత్తలు 'టైడల్లీ లాక్డ్' అని వ్యవహరిస్తారు. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చందమామ కూడా సరిగ్గా ఇలాగే ఒక దిశలోనే ఉంటుంది. మనం ఎప్పుడు చూసినా చంద్రుడి ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది.

అంటే.. వాస్ప్76బిలో ఒకవైపు నిరంతరం పగలు ఉంటే.. మరొకవైపు నిరంతరం రాత్రే ఉంటుంది. దీనర్థం.. పగలు ఉన్నవైపు మలమలా మాడిపోతూ ఉంటుంది.

నిజానికి.. నక్షత్రం వైపు అభిముఖంగా ఉండే గ్రహార్థభాగంలో ఎంత వేడి ఉండాలంటే.. మేఘాలు చెదిరిపోయి, వాతావరణంలోని అణువులన్నీ ఒకదానితో ఒకటి తెగతెంపులు చేసుకుని ఒంటరి పరమాణువులుగా మారిపోవాలి.

వాస్ప్-76బి

ఫొటో సోర్స్, ESO/L.CALÇADA

ఫొటో క్యాప్షన్, వర్ణచిత్రం: వాస్ప్-76బి మన బుధగ్రహం కన్నా రెట్టింపు పరిమాణంలో ఉంటుంది

ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ గ్రహం మీద వెలుతురు, చీకటి భాగాల్లోని వాతావరణాల మధ్య ఇంత విపరీతమైన తేడాలు ఉండటం వల్ల.. అక్కడ భీకరమైన పెనుగాలులు కూడా వీస్తుంటాయి. ఆ గాలుల వేగం గంటకు 18,000 కిలోమీటర్లు ఉంటుందని డాక్టర్ డేవిడ్ బృందం చెప్తోంది.

ఈ శాస్త్రవేత్తలు ఎస్‌ప్రెసో స్పెక్ట్రోమీటర్‌ను ఉపయోగించి.. ఈ గ్రహంలో సాయంత్రం ఉండే ప్రాంతంలో అంటే వెలుగు, చీకట్లు కలిసే చోట.. ఇనుప ఆవిరి సంకేతాలను గుర్తించారు. కానీ.. ఉదయపు ప్రాంతం వద్ద పరిశీలించినపుడు ఆ ఆవిరి సంకేతాలు కనిపించలేదు.

''ఈ గ్రహం మీద రాత్రి భాగంలో అక్కడ ఇనుప ఆవిరి ద్రవీభవనం చెందుతోందని మేం అంచనా వేస్తున్నాం. చీకటిగా ఉండే భాగంలో ఉష్ణోగ్రత 1,400 సెంటీగ్రేడ్లుగా ఉన్నా కూడా.. ఇనుప ఆవిరి మేఘాల రూపంలోకి, వర్షంలాగా, చుక్కల్లాగా ద్రవీభవనం చెందటానికి ఆ చల్లదనం సరిపోతుంది. ఈ వర్షం.. గ్రహపు వాతావరణంలోని కింది పొరల్లో పడవచ్చు. ఎస్‌ప్రెసో పరికరంతో ఆ పొరలను మేం పరిశీలించలేకపోయాం'' అని డాక్టర్ డేవిడ్ వివరించారు.

వాస్ప్76బి ఒక భారీ గ్రహం. మన బుధ గ్రహపు విస్తీర్ణం కన్నా రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. బ్రిటన్ నెలకొల్పిన వాస్ప్ టెలిస్కోప్ వ్యవస్థ ఈ గ్రహాన్ని నాలుగేళ్ల కిందట గుర్తించింది. అందువల్ల ఈ గ్రహానికి ఆ టెలిస్కోప్ పేరు పెట్టారు.

వాస్ప్-76బి

ఫొటో సోర్స్, FREDERIK PEETERS

ఫొటో క్యాప్షన్, వర్ణచిత్రం: గ్రాఫిక్ నవలా రచయిత ఫ్రెడరిక్ పీటర్స్ సైన్స్ ఫిక్షన్ వర్ణచిత్రాలకు పేరొందారు

ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ అత్యంత సమీపంగా తిరుగుతుండటం వల్ల ఎన్నో ప్రభావాలకు గురవుతోందని.. ఆ భౌతికశాస్త్రాన్ని మనం అర్థం చేసుకోలేమని ఈ పరిశోధకుల బృందంలోని ఒక శాస్త్రవేత్త, వార్విక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాన్ పొలాకో పేర్కొన్నారు.

''ఈ గ్రహం ఆ నక్షత్రంలో కలిసిపోవటం కానీ, లేదంటే నక్షత్రపు అణుధార్మిక క్షేత్రం ఈ గ్రహాన్ని పేల్చివేయటం కానీ జరుగుతుంది'' అని ఆయన చెప్పారు.

వాస్ప్-76బి లక్షణాలను బట్టి దాని స్వరూపస్వభావాలను చిత్రించాలని స్విస్ ఇలస్ట్రేటర్ ఫ్రెడరిక్ పీటర్స్‌ను డాక్టర్ డేవిడ్ కోరారు.

''ఇటువంటి గ్రహాలను గుర్తించినపుడు మనం సవివరమైన 3డీ చిత్రాలను చూస్తాం. అది నిజమైన ఫొటోనా, లేకపోతే కంప్యూటర్‌లో తయారుచేసిన చిత్రమా అనేది చెప్పటం కష్టమవుతుంది కూడా. మేం దీనికి కొంత హాస్యం జోడించాం.. ఎవరినీ మోసం చేయట్లేదు'' అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)