సౌరకుటుంబాన్ని పోలిన కెప్లర్-90ను కనుగొన్న నాసా

ఫొటో సోర్స్, NASA
- రచయిత, పాల్ రిన్‌కాన్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
మన సౌరకుటుంబంలాగే, ఎనిమిది గ్రహాలు కలిగి ఉన్న నక్షత్రాన్ని నాసా కనుగొంది. మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న గ్రహవ్యవస్థలలో ఇప్పటివరకు ఇదే అతి పెద్దది.
కెప్లర్-90 అనే ఈ నక్షత్రం సూర్యుడికన్నా వేడిగా, మరింత పెద్దగా ఉంది.
కొత్తగా కనుగొన్న ఈ లోకం పర్వతాలమయంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
''మన సౌరకుటుంబంలో ఉన్నన్ని గ్రహాలే ఉన్న మొదటి నక్షత్రం కెప్లర్-90'' అని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్రిస్టఫర్ షాలూ తెలిపారు.
సౌరకుటుంబంలోలాగే మరో నక్షత్రం చుట్టూ స్థిరమైన కక్ష్యలో పరిభ్రమించే గ్రహాలను 'ఎక్సోప్లానెట్' అంటారు.

ఫొటో సోర్స్, NASA
గూగుల్ ఇంజనీర్లు ఈ ఎక్సోప్లానెట్లను కనుగొనేందుకు మెషీన్ లెర్నింగ్ అనే కృత్రిమ మేధస్సును ఉపయోగించారు.
నాసా స్పేస్ టెలిస్కోప్ కెప్లర్ సాయంతో దీన్ని కనుగొన్నారు.
ఈ ఎక్సోప్లానెట్లు పరిభ్రమిస్తున్న నక్షత్రం సుమారు 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దాని గ్రహవ్యవస్థ కూడా అచ్చం మన సౌరకుటుంబంలాగే ఉన్నట్లు కనిపిస్తోంది.
యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో పరిశోధకుడిగా ఉన్నఆండ్రూ వాండర్‌బర్గ్, ''కెప్లర్-90 నక్షత్ర వ్యవస్థ మన సౌరకుటుంబానికి మినీ వెర్షన్ లాంటిది. మనలాగే అక్కడ కూడా చిన్న గ్రహాలు లోపల, పెద్ద గ్రహాలు బయట ఉన్నాయి. తేడా అల్లా అవి మరింత దగ్గరదగ్గరగా ఉన్నాయంతే'' అని వివరించారు.

ఫొటో సోర్స్, NASA
అవి ఎంత దగ్గరగా ఉన్నాయో అర్థం చేసుకోవాలంటే - కెప్లర్-90లో అత్యంత దూరంగా పరిభ్రమిస్తున్న గ్రహం, భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నంత దూరంలో ఉంది.
కెప్లర్-90ఐగా పిలుస్తున్న ఈ కొత్త లోకం సౌరవ్యవస్థకన్నా దగ్గరగా ఉండడం వల్ల, నక్షత్రం చుట్టూ దాని ప్రదక్షిణ 14.4 రోజుల్లో పూర్తి అవుతోంది. దాని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 425 డిగ్రీల సెంటీగ్రేడ్‌లుగా ఉంది.
మరో నక్షత్రం చుట్టు తిరుగుతున్న భూమి పరిమాణంలో ఉన్న కెప్లర్-80జి అనే గ్రహాన్ని కనుగొనడానికి కూడా ఈ మెషీన్ లెర్నింగ్ మేధస్సునే ఉపయోగించారు.
గత కొన్ని దశాబ్దాలలో ఇలా ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే సుమారు 3,500 ఎక్సోప్లానెట్లను గుర్తించారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








