అమెరికాలోని డెలవేర్‌లో బాణసంచాపై నిషేధం, తుపాకులకు అనుమతి

ఫొటో సోర్స్, Getty Images
‘కావాలంటే తుపాకులు కొనుక్కోండి. కానీ మందుగుండు సామగ్రిని మాత్రం అనుమతి లేకుండా కొనడానికి వీల్లేదు’.. అంటోంది అమెరికాలోని డెలవేర్ రాష్ట్ర రాజ్యాంగం.
డెలవేర్‌లో తుపాకులు కొనడానికి, ఉపయోగించడానికి ఎలాంటి లైసెన్సులూ, అనుమతులూ అక్కర్లేదు. అదే వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చాలంటే మాత్రం అధికారుల అనుమతి తప్పనిసరి. అక్కడి వారు తుపాకుల కంటే మందుగుండు సామగ్రినే ప్రమాదకరంగా భావిస్తారు.
డెలవేర్ చట్ట ప్రకారం అనుమతి లేకుండా మందుగుండు సామగ్రిని కలిగి ఉంటే దాదాపు ఆరున్నర వేల రూపాయల ఫైన్ చెల్లించాలి. అనుమతి లేకుండా బాణసంచా కల్చినందుకు గతేడాది పదిహేడు మంది జైలుపాలయ్యారు. మరో పక్క అదే రాష్ట్రంలో చాలామంది ఎలాంటి అనుమతి లేకుండా తుపాకుల్ని ఉపయోగిస్తున్నారు. కానీ అది అక్కడ ఏమాత్రం నేరం కాదు.

అమెరికాలో బాణసంచాకి సంబంధించిన చట్టాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. ఇలినాయి, ఒహాయో, వెర్మాంట్ లాంటి రాష్ట్రాల్లో మతాబులు, కాకరపువ్వొత్తుల వంటివి మినహా మిగతా అన్ని రకాల టపాసులపైనా నిషేధం ఉంది. అదే మాసచూసట్స్‌లో మాత్రం ఎలాంటి బాణసంచా అయినా అనుమతి లేకుండా కొనడానికి వీల్లేదు.
డెలవేర్‌లో బాణసంచా కొనేవాళ్లు వాటికి సంబంధించిన పూర్తి బాధ్యత తమదేనంటూ ఓ కాంట్రాక్టుపైన సంతకం చేయడం తప్పనిసరి. అక్కడ తుపాకులతో పోలిస్తే బాణసంచా కారణంగానే ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకోవడమే ఇలాంటి చట్టాలకు కారణమని తెలుస్తోంది.
గమనిక: కింద గ్రాఫిక్ ఫొటో ఉంది
రెండేళ్ల క్రితం పియెరీ పాల్ అనే అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు బాణసంచా కాలుస్తూ ప్రమాదవశాత్తూ తన చేతి రెండు వేళ్లు పోగొట్టుకున్నాడు. అప్పట్నుంచీ అతడు ‘ఫైర్ సేఫ్టీ క్యాంపైన్’కి అంబాసిడర్‌గా ఉంటూ బాణసంచాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో గతేడాది బాణసంచా ప్రమాదాల కారణంగా 11,100 మంది ఆస్పత్రుల పాలయ్యారని ‘కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్’ రిపోర్టు చెబుతోంది. అందుకే చాలా రాష్ట్రాలు వాటిని నిషేధించాయి. కానీ ఇదే అసలు చర్చకు కారణమవుతోంది. ఉన్మాదానికి కారణమవుతున్న తుపాకుల్ని వదిలేసి, వేడుకల్లో భాగమైన బాణసంచాని నిషేధించడం కాస్త ఆశ్చర్యకర విషయమని డెలవేర్ ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్ పీటర్ స్వార్జ్‌కాఫ్ అంటున్నారు.
‘బాణసంచాని నిషేధించడం సులభమే. కానీ అమెరికాలో తుపాకుల్ని నిషేధించడం చాలా క్లిష్టమైన వ్యవహారం. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో చాలా పెద్ద గన్ లాబీ నడుస్తోంది’ అన్నది ఆయన అభిప్రాయం.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








