‘జుగాడ్’ విధానంలో ఉద్ధభ్ భరలి వినూత్న ఆవిష్కరణలు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, కరోలిన్ రైస్,
- హోదా, ఇన్నొవేటర్స్, బీబీసీ వరల్డ్ సర్వీస్
అతి తక్కువ ఖర్చుతో సరికొత్త సాధనాలను రూపొందిస్తూ, సామాన్యుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు అస్సాం వాసి ఉద్ధభ్ భరలి. ఆయన ఇప్పటివరకు 140కి పైగా ఆవిష్కరణలు చేశారు.
కుటుంబాన్ని అప్పుల బారి నుంచి కాపాడేందుకు దాదాపు 30 ఏళ్ల కిందట ఆయన సరికొత్త వస్తువులను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు.
వినూత్న వస్తువుల రూపకల్పన క్రమంగా ఆయనకు అభిరుచిగా మారింది. ఇప్పటివరకు చేసిన ఆవిష్కరణల్లో చాలా వరకు వాణిజ్యపరంగా అమ్ముడయ్యాయి. మరికొన్ని అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకున్నాయి.
వ్యవసాయానికి సంబంధించి చేసిన పలు ఆవిష్కరణలతో ఉద్ధబ్‌కు దేశవ్యాప్తంగా పేరొచ్చింది. వికలాంగుల కోసం చేసిన ఆవిష్కరణలు వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

రాజ్ రెహ్మాన్ అనే బాలుడికి 15 ఏళ్లు. అతడికి అవయవ లోపంతోపాటు సెరిబ్రల్ పాల్సి సమస్య ఉంది. అతడి కోసం వెల్క్రొ మెటీరియల్, చెంచా లాంటి సాధారణ వస్తువులతో ఉద్ధబ్ ఒక పరికరాన్ని అభివృద్ధి చేశారు.
దీనిని రాజ్ ముంజేతికి అమర్చడంతో అతడు సులభంగా తినగలుగుతున్నాడు. రాయగలుగుతున్నాడు. ప్రత్యేకంగా తయారుచేసిన పాదరక్షల సాయంతో సునాయాసంగా కదలగలుగుతున్నాడు కూడా.
ఇప్పుడు ఆ ఒత్తిడి నాలో లేదు: రాజ్ రెహ్మాన్
''ఇంతకుముందు నా గురించి తలుచుకుంటే నాకే బాధగా అనిపించేది. ఇప్పుడు అలాంటి మానసిక ఒత్తిడేమీ నాలో లేదు. ఎందుకంటే- రైలు పట్టాలు దాటి బడికి ఎలా వెళ్లాలనే ఆలోచన నాకు ఇప్పుడు లేదు. ఏ కష్టం లేకుండానే నడవగలుగుతున్నాను. నా పనులు నేను చేసుకోగలుగుతుండటం సంతోషాన్ని ఇస్తోంది'' అంటూ రాజ్ ఉత్సాహంగా చెబుతున్నాడు.
భారత్‌లో వికలాంగులకు ప్రభుత్వాల అండ పరిమితంగానే ఉందని, అందువల్ల తనలాంటి వారు ముందుకొచ్చి వారి సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాల్సి ఉందని ఉద్ధబ్ చెబుతున్నారు.
ప్రారంభంలో తన ఆవిష్కరణలను చాలా మంది పనికిరానివిగా పరిగణించారని ఉద్ధబ్ అంటున్నారు. 18 ఏళ్ల నిర్విరామ శ్రమ తర్వాతగాని తన నైపుణ్యాన్ని, తనలోని ఆవిష్కర్తను గుర్తించలేదని పేర్కొంటున్నారు.
55 ఏళ్ల ఉద్ధభ్ అస్సాంలోని ఉత్తర లఖింపూర్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

ఉద్ధబ్ ఆవిష్కరణల్లో అత్యధిక వస్తువుల తయారీ వ్యయం తక్కువ. చాలా వరకు స్థానికంగా చౌకగా లభించే ముడి సామగ్రితోనే తయారు చేస్తుంటారు. ఇలా సమస్యలకు తక్కువ వ్యయమయ్యే సృజనాత్మక, తెలివైన పరిష్కారాలు అందించే విధానాన్ని ‘జుగాడ్' అని వ్యవహరిస్తారు. 'జుగాడ్' హిందీ పదం.
'జుగాడ్'పై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని జడ్జ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన జైదీప్ ప్రభు ఒక పుస్తకం రాశారు.
వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణల దిశగా ఔత్సాహికులను జుగాడ్ విధానం ప్రోత్సహిస్తుందని, వ్యక్తి ఆలోచనే ఇందులో ప్రధాన పెట్టుబడి అని ఆయన తెలిపారు. ''మనం, మన చుట్టూ ఉన్న సమాజం ఎదుర్కొనే సమస్యలను గుర్తించి, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి వాటికి పరిష్కారాలు కనుగొనడమే ఈ విధానంలో ప్రధానాంశం'' అన్నారు.
వ్యాపార సంస్థలకు, ప్రభుత్వాలకు తన వినూత్న వస్తువులు, సాంకేతిక డిజైన్లను అమ్మడం ద్వారా ఉద్ధబ్ ఆదాయాన్ని పొందుతున్నారు.
ఇతరులు సొంతంగా డబ్బు సంపాదించి, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకొనేలా వారికి సహకారం అందించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
అందరికీ అందుబాటులో యంత్రాలు
అందరూ తన యంత్రాలను వినియోగించేందుకు వీలుగా ఉద్ధబ్ కొన్ని కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల మహిళలు బియ్యం మర పడతారు. అక్కడ విక్రయించేందుకు వీలుగా బియ్యం పిండిని పలకలుగా, ఇతర ఆహార పదార్థాలుగా మారుస్తారు.
''మా గ్రామాల్లో జీవనోపాధికి సదుపాయాలుగాని, అవకాశాలుగాని లేవు. ఈ కేంద్రంలో ఉన్న యంత్రాలు, వస్తువులు ఉపయోగించుకొని మా కోసం, మా కుటుంబాల కోసం ఓ మోస్తరుగా సంపాదించుకోగలుగుతున్నాం'' అని ఒక కేంద్రానికి వచ్చిన మహిళ పర్‌బిత్తా దత్తా చెప్పారు.
ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం భారత్‌లో 15 సంవత్సరాలు పైబడిన బాలికలు, మహిళల్లో ఆర్థిక కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉన్నవారు 27 శాతం మంది మాత్రమే.
గ్రామాల్లో మగవారు కూడా ఉద్ధబ్ రూపొందించిన వస్తువులతో లాభపడ్డారు. సిమెంటు ఇటుకలను తయారు చేసే 200 యంత్రాలను ఆయన తయారు చేసి విక్రయించారు. ఒక్కో యంత్రాన్ని ఐదుగురు కలిసి నిర్వహిస్తారు. దీనివల్ల సుమారు వెయ్యి మంది పురుషులకు ఉపాధి లభించిందని ఉద్ధబ్ చెబుతున్నారు.
విజయానికి దగ్గరిదారి లేదు: ఉద్ధభ్
విజయానికి దగ్గరిదారి లేదని చెప్పే ఉద్ధబ్, కఠోరశ్రమతోనే సౌకర్యవంతమైన జీవనం గడిపే స్థాయికి చేరుకున్నానని పేర్కొంటున్నారు. తన వ్యాపారంపై ఆధారపడి 25 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని చెబుతున్నారు.
ఆవిష్కరణల మౌలిక సూత్రాలు నేర్పిస్తే వచ్చేవి కావన్నది ఉద్ధబ్ అభిప్రాయం.
''చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం ఆలోచించే వారే ఇన్నొవేటర్స్. ఆవిష్కరణ(ఇన్నొవేషన్) మనలోంచే పుడుతుంది. వేరే ఎవరో మనల్ని ఇన్నొవేటర్లుగా తయారుచేయలేరు. మనంతట మనం అలా తయారవ్వాలి" అంటారు ఆయన.

ఉద్ధబ్ గతంలో మొదట ఏదైనా యంత్రం డిజైన్ చేసి, తర్వాత దానిని వాణిజ్యపరంగా ఎలా విజయవంతం చేయాలా అని ఆలోచించేవారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన పేరుతో వ్యక్తులు వారంతట వారే ఆయన వద్దకు వచ్చి డబ్బులిచ్చి మరీ సరికొత్త వస్తువులను, యంత్రాలను తయారు చేయించుకుంటున్నారు.
ఇప్పుడా పని వేగాన్ని తగ్గించుకోదలచుకోలేదు ఉద్ధబ్.
సరికొత్త సవాళ్లను ప్రతీసారి సంతోషంగా స్వీకరిస్తానని, అందరికంటే ముందుగానే సమస్యకు పరిష్కారం కనుగొనడంలో ఉండే ఆనందమే వేరని ఆయన పేర్కొంటున్నారు.
''నాకు సమస్యలను పరిష్కరించడమంటే ఇష్టం. జనం మరింత స్వతంత్రంగా లేదా సౌకర్యవంతంగా బతికేలా చూడటం నాకు ఇష్టం. వినూత్న ఆవిష్కరణలతోనే అన్ని సమస్యలకు పరిష్కారాలు సాధ్యం'' అని ఉద్ధబ్ చెబుతున్నారు.
(అదనపు పరిశోధన, రిపోర్టింగ్: ప్రీతీ గుప్తా.)


దక్షిణాసియాలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలకు సరికొత్త పరిష్కార మార్గాలను 'బీబీసీ ఇన్నోవేటర్స్' సిరీస్ వెలుగులోకి తెస్తుంది.
సమస్యలకు పరిష్కారాలు చూపే గొప్ప ఆవిష్కరణలు మీకు ఎక్కడ కనిపించినా, మీరే అలాంటి పరిష్కారాలు కనుగొన్నా ఆ ఫొటోలను మాతో పంచుకోండి.
[email protected] కి ఈమెయిల్ చేయొచ్చు. #Jugaad, #BBCInnovators హ్యాష్‌ట్యాగ్‌లతో @BBCWorldService కి షేర్ చేయండి. లేదా ఈ లింక్‌ను క్లిక్ చేసి అప్‌లోడ్ చేయొచ్చు..

మా ఇతర కథనాలు:
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- అత్యాచారాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతారు? ఎలా చెబుతారు?
- పాక్ ఎన్నికలు: యువత మొబైల్ ఫోన్లలో పొలిటికల్ గేమ్స్
- చెర్రీ: హైదరాబాద్‌లో పుట్టిన అతి చిన్న పసిపాప.. ప్రిమెచ్యూర్ బేబీల జీవితాలకు కొత్త ఆశ
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- అబ్దుల్ కలాం ఆఖరి రోజు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









