ఇమ్రాన్ ఖాన్: "భారత్ మా వైపు ఒక అడుగు వేస్తే.. మేం రెండడుగులు వేస్తాం"

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Reuters

పాకిస్తాన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న పాకిస్తాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫలితాల సరళి తెలిసిన తర్వాత ఇస్లామాబాద్ నుంచి తొలిసారి మాట్లాడారు.

ఫలితాలు అధికారికంగా వెలువడనప్పటికీ ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పలు కీలకాంశాలపై తన విధానాన్ని తెలియజేశారు. జిన్నా కలలు కన్న పాకిస్తాన్‌ను సాకారం చేస్తానని, భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

* పాకిస్తాన్ ఉద్ధానపతనాలు రెండూ చూశాను. 22 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చాను. నా కళ్ల ముందే దేశం అధోగతి పాలు కావడం చూశాను. జిన్నా కలలు కన్న పాకిస్తాన్‌ను సాకారం చేసే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఇవి చరిత్రాత్మక ఎన్నికలు.

* నేను ఎలాంటి పాకిస్తాన్‌ను చూడాలనుకుంటున్నానో చెబుతాను. సంక్షేమానికి దూరంగా ఉన్నాం మనం. బలహీనుల కోసం పనిచేసి సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పాలి. ఇక్కడ సమానత్వపు కలలు కల్లలయ్యాయి.. పేదరికం పెరిగిపోయింది. బలహీనులు, పేదలు, అణగారినవర్గాల వారిని ఆదుకోవల్సిన అవసరం ఉంది.

* కొద్దికాలంగా భారత్ మీడియాలో నాపై దుష్ప్రచారం జరుగుతోంది. నన్ను బాలీవుడ్ సినిమాల్లో విలన్‌లా చూపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే భారత్-పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయన్నట్లుగా చెబుతున్నారు. కానీ... భారత ప్రజలతో గొప్ప సంబంధాలున్న పాకిస్తానీ నేను. క్రికెట్ కారణంగా భారత ప్రజలతో నాకు మంచి సంబంధాలేర్పడ్డాయి.

* ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విదేశాంగ విధానం మనకు పెద్ద సమస్యగా ఉంది. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపర్చుకోవాల్సి ఉంది. అప్పుడే దేశాభివృద్ధిపై దృష్టిపెట్టే అవకాశముంటుంది.

* భారత్‌తో మంచి సంబంధాలు పెంచుకునే లక్ష్యంగా పనిచేస్తాను. కశ్మీర్ సమస్యకు, వాణిజ్య సంబంధాల మెరుగుదలకు స్నేహపూర్వక పరిష్కారాలు కనుగొనాల్సి ఉంది.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, facebook/Pakistan Tehreek-e-Insaf

‘భారత్ ఒక అడుగు వేస్తే.. పాకిస్తాన్ రెండడుగులు వేస్తుంది’

* రెండు దేశాలూ ఒకరినొకరు నిందించుకునే పనిలో ఉండడం వల్లే సంబంధాలు మెరుగుపడడం లేదు. ఈ కారణంగానే ద్వైపాక్షిక సంబంధాలూ ముందుకు సాగడం లేదు. ''ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. అలాగే బలూచిస్తాన్‌లో ఏం జరిగినా అది భారత్ కుట్రేనని మేం అంటున్నాం. ఈ నిందలను దాటి వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాల్సి ఉంది.

* భారత్ మా వైపు ఒక్క అడుగు వేస్తే చాలు.. మేం రెండడుగులు వేస్తాం. కానీ, భారత్ వైపు నుంచి ఆ ప్రక్రియ మొదలైతే మంచిది.

* రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగను. నా మద్దతుదారులకు, మిగతావారికి అందరికీ ఒకటే న్యాయం వర్తిస్తుంది. జవాబుదారీతనం అన్నది నాతోనే మొదలుపెడతా.. నా తరువాత మంత్రులు.. అలా ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం తెస్తాను.

* దేశంలో 50 శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తుంటే నేను విలాసవంతమైన ప్రధాని నివాసంలో ఉండడానికి సిగ్గుపడతాను. తక్కువ ఖర్చుతో బతుకుతాను''

* ప్రజా ధనం వృథా కాకుండా చూస్తాను. ప్రజలు చెల్లించే పన్ను డబ్బును సద్వినియోగం చేస్తాను. యువత సాధికారతకు ప్రాధాన్యమిస్తాను. రైతులు, కార్మికులకు ఉపశమనాలు కల్పిస్తాను. ఉద్యోగాల కల్పన, యువతకు నైపుణ్యాలతో కూడిన విద్య అందిస్తాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)