‘భారత్ గురించి ఇమ్రాన్‌కు తెలిసినంతగా ఏ పాక్ నేతకూ తెలియదు’

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, సుహాసిని హైదర్
    • హోదా, బీబీసీ కోసం

పాకిస్తాన్‌కు 1992లో క్రికెట్ వరల్డ్ కప్ విజయం అందించిన కెప్టెన్, తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ తాజా సాధారణ ఎన్నికల్లో తాను విజయం సాధించినట్టు ప్రకటించారు.

ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలు, ట్రెండ్ ప్రకారం ఆయన పార్టీ మెజార్టీకి కొన్ని సీట్ల దూరంలో ఉంది. కొన్ని చిన్న పార్టీలతో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు.

పాకిస్తాన్‌లో బుధవారం(జులై 25)న నేషనల్ అసెంబ్లీలోని 270 జనరల్ స్థానాల కోసం ఓటింగ్ జరిగింది.

"దేశంలోని ఒక బలహీనుడు కూడా తనతో నిలబడగలిగేలా తన దేశాన్ని తయారు చేయాలని అనుకుంటున్నట్టు" ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

పార్టీ కార్యాలయంలో ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, EPA

దేశంలో వ్యాపారం, పెట్టుబడులపై దృష్టి పెడతానన్నారు. పాకిస్తాన్ కరెన్సీని బలోపేతం చేస్తానని తెలిపారు.

పాకిస్తాన్ పొరుగునే ఉండడం వల్ల అక్కడి పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా ఉంటుంది.

ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో భారత్, పాకిస్తాన్ సంబంధాలు బాగుంటే రెండు దేశాలకూ మంచిదనే సంకేతం ఇచ్చారు.

భారత్, పాకిస్తాన్ విభజన తర్వాత రెండు దేశాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతూ వచ్చాయి. ఇప్పుడు అందరి దృష్టి రాబోయే రోజుల్లో భారత్‌తో పాకిస్తాన్ సంబంధాలు ఎలా ఉంటాయి అనేదానిపైనే ఉంది.

"మా వ్యాపార సంబంధాలు మెరుగుపరచాలని కోరుకుంటున్నా. కశ్మీర్లో పరిస్థితిని, అక్కడి సమస్యలను ఎలా చక్కదిద్దాలో రెండు దేశాలు కలిసి కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకోవాలి" అని ఇమ్రాన్ అన్నారు.

ఇరు దేశాలు తమ దేశంలో ఘటనలకు మరోదాన్ని బాధ్యులుగా చేస్తున్నాయని కూడా ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. కానీ వాటికి ముగింపు పలకాలన్నారు. రెండు దేశాలు స్నేహభావంతో ఉండాలన్నారు.

ఇమ్రాన్ ఖాన్ పై సుహాసినీ హైదర్

ప్రచారంలో ఏం చెప్పినా, చర్చలు తప్పదు

ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరోసారి పట్టాలెక్కుతాయని బీబీసీతో మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ సుహాసినీ హైదర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే దాని గురించి అప్పుడే ఏదీ స్పష్టంగా చెప్పలేమని తెలిపారు.

ఈసారి పాకిస్తాన్‌ యువత, కొత్త ఓటర్లు ఒక కొత్త ఆలోచనను, అభివృద్ధి నినాదాన్ని ఎంచుకున్నారని సుహాసిని తెలిపారు.

"అక్కడి మతపరమైన పార్టీలు, ఛాందసవాద పార్టీలకు ఈ ఎన్నికల్లో ఎక్కువ ప్రయోజనం లభించినట్టు కనిపించలేదు.

లష్కర్-ఎ-తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్ కొత్త పార్టీ 'అల్లా హు అక్బర్ తహ్రీక్' ఈ ఎన్నికల్లో మొత్తం 265 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కానీ వారిలో ఎవరూ విజయం సాధించలేకపోయారు.

మతపరమైనదిగా భావించే పార్టీల కూటమి 'ముత్తాహిదా మజ్లిసే-అమల్' పార్టీకి కూడా 10 కంటే తక్కువ సీట్లలో ఆధిక్యం లభించింది.

"పాకిస్తాన్‌లో విపక్షం, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్(నవాజ్), ఆసిఫ్ అలీ జర్దారీ పీపుల్స్ పార్టీలపై భారత్ సన్నిహితులని ఆరోపణలు వచ్చాయి" అని సుహాసినీ తెలిపారు.

ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు రాగానే ఇమ్రాన్ ఖాన్ "నవాజ్ షరీఫ్‌ను భారత ప్రధానమంత్రి మోదీ, భారతీయ మీడియా ఫేవరెట్"గా వర్ణించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

బుధవారం ట్విటర్‌లో ఆయన పార్టీ పీటీఐ "మన భద్రతాదళాలపై దాడులు చేసే బయటి శక్తులకు నవాజ్ షరీఫ్ వీలైనంత సాయం చేసేందుకు ప్రయత్నించారు. నవాజ్ షరీఫ్ అంటే మోదీకి ఇష్టం. కానీ దేశంలోని సైనికులకు కాదు" అని పోస్ట్ చేసింది.

ఇమ్రాన్ ఖాన్ తన ఎన్నికల ప్రచార సమయంలో "నేను ప్రధాని అయితే ఇండిపెండెంట్ పీఎం అవుతా. పాకిస్తాన్ హక్కు గురించి గొంతు వినిపిస్తా" అని చెబుతూనే వచ్చారని సుహాసిని తెలిపారు.

కానీ ఎవరు ప్రధానమంత్రి అయినా, కొంతకాలం తర్వాత వాళ్లు భారత్‌తో ఏదో ఒక విధంగా మాట్లాడక తప్పదు అంటారు సుహాసిని.

క్రికెటర్లతో ఇమ్రాన్

ఫొటో సోర్స్, PA

ఇమ్రాన్‌కు భారత్ గురించి బాగా తెలుసు

అంతర్జాతీయ మీడియా "క్రికెటర్‌గా ఇమ్రాన్ ఖాన్ ఇమేజ్ బాగానే ఉంటుంది, కానీ ఒక రాజకీయ నేతగా ఆయన తాలిబానీ ఖాన్" అని వర్ణించింది. ఆయనకున్న ఆ ఇమేజ్ ఇప్పుడు ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తుందా?

ఈ ప్రశ్నకు సమాధానంగా "ఆయన్ను లెఫ్టిస్ట్, పాపులిస్ట్ నేత అంటారనే మాట నిజం. కానీ ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, టర్కీ, బ్రిటన్ లాంటి ఎన్నో దేశాల్లో రైట్ వింగ్ ఆవిర్భావం మనం చూస్తున్నాం. ఇక్కడ భారత్‌లో బీజేపీతోపాటు, ఇమ్రాన్ ఖాన్ విజయం కూడా అదే మోడల్‌లో కనిపిస్తుంది. వాళ్లు మత ఛాందసవాదులను. యువతను తమ వెంట తీసుకుని ముందుకు వెళ్తున్నారు" అన్నారు సుహాసిని.

"కానీ చూస్తుంటే, భారత్‌తో చాల సుదీర్ఘమైన, మెరుగైన సంబంధాలున్నది ఒక్క ఇమ్రాన్ ఖాన్‌కే అనిపిస్తుంది. మొదట ఒక క్రికెటర్‌గా తర్వాత ఒక కామెంటరేటర్‌గా ఆయనకు భారత్‌తో చాలా అనుబంధం ఉంది. అందుకే భారత్ గురించి ఆయనకు తెలిసినంత బాగా, బహుశా ఏ పాకిస్తానీ నేతకూ తెలీకపోవచ్చు" అని సుహాసినీ చెప్పారు.

"క్రికెటర్‌గా, క్రీడా నిపుణుడిగా భారత్‌తో బంధం ఉండడం, ఒక దేశాధినేతగా మరో దేశంతో సంబంధాలు నెరపడం పూర్తిగా భిన్నంగా ఉంటుంది అనేది కూడా నిజం".

ప్రధాని అయ్యాక రాజకీయ నేతగా భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ వైఖరి ఎలా ఉండబోతోంది?

"ఒక రాజకీయ నేతగా ఇమ్రాన్ ఏదో ఒక ఎజెండా తీసుకుని పని చేయలేరు. పాలనా కాలంలో ఆయన ప్రస్తుతం ప్రభుత్వం ఏం కోరుకుంటోంది అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా భారత్‌తో తమ విదేశాంగ విధానంలో సైన్యం కీలక పాత్ర పోషిస్తుందని పాకిస్తాన్ ఎప్పుడూ చెబుతూనే ఉంది. దానిపై ఆయన ఏమంటారో కూడా చూడాల్సివుంటుంది" అని సుహాసిని హైదర్ చెప్పారు.

పాకిస్తాన్ రాజకీయాల్లో, ముఖ్యంగా విదేశాంగ విధానంలో సైన్యం జోక్యం సబబే అనడంపై, మొదటి నుంచీ ఆరోపణలు రావడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రధాని మోదీతో ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, MEA, INDIA

ఫొటో క్యాప్షన్, 2015 డిసెంబర్ 11న దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఇమ్రాన్ ఖాన్

వ్యాపారం పెంచాలనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్

2015లో ఇమ్రాన్ ఖాన్ భారత్ వచ్చినపుడు, ఆయన మోదీతో సమావేశం కావడం, భారత్, పాక్ మధ్య వ్యాపార సంబంధాలు, ద్వైపాక్షిక చర్చలు మెరుగుపరిచే అంశాలపై ఇద్దరి మధ్య జరిగిన చర్చలను కూడా మనం మరిచిపోకూడదు.

"అంతకు ముందు ఇమ్రాన్ ఖాన్ ఒకసారి మాజీ ప్రధానమంత్రి పర్వేజ్ ముషారఫ్ పాలనలో భారత్-పాక్ సంబంధాలను కూడా మళ్లీ ఒకసారి చూడాలని" అన్నట్టు సుహాసినీ హైదర్ తెలిపారు.

"చెప్పాలంటే ముషారఫ్ పాలన సమయంలో రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరిగాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో చాలా సార్లు చర్చలు జరిగాయి. ఆగ్రాలో జరిగిన రెండు రోజుల సమావేశానికి ముషారఫ్ కూడా హాజరయ్యారు"

"ఇక పాకిస్తాన్ సైన్యం విషయానికి వస్తే, అక్కడ ఎవరు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినా, ఏదో ఒక విధంగా వారికి సైన్యం మద్దతు ఉంటుంది. అక్కడ రాజకీయాల్లో సైన్యం పాత్ర చాలా కీలకంగా భావిస్తారు".

"ఇమ్రాన్ ఖాన్‌పై కూడా సైన్యానికి నచ్చిన అభ్యర్థి అనే ఆరోపణలు వచ్చాయి. అయినా భారత్ అక్కడి ప్రభుత్వం, సైన్యం రెండింటితో చర్చలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది".

నవాజ్ షరీఫ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2015లో ఆప్ఘనిస్తాన్ నుంచి తిరిగి వస్తూ నవాజ్ షరీఫ్‌ను కలవడానికి లాహోర్‌లో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ

మోదీ ఎన్నికల ప్రచారం ఒకసారి గుర్తు చేసుకుంటే.. ఆ ప్రచారంలో ఆయన పాకిస్తాన్ గురించి చాలా మాటలు అన్నారు. పాక్ విదేశాంగ విధానం గురించి విమర్శలు కూడా చేశారు.

కానీ ప్రధాని అయిన తర్వాత మోదీ ఒక భిన్నమైన రాజనీతిని చూపించారు. ఒకసారి ఆయన ఉన్నట్టుండి పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్‌ను కలిస్తే, ఒక్కోసారి అంతర్జాతీయ సమావేశాల్లో ఆయనతో కనీసం మాట కూడా మాట్లాడలేదు.

రెండు దేశాల మధ్య బంధం ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి చెప్పలేం. కానీ అది చాలా వరకూ నేతలు, వారి వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)