కొలంబియా నుంచి బెంగళూరు వచ్చి 'కన్నం' వేశారు

ఫొటో సోర్స్, BANGALORE POLICE
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
'హ్యాపెనింగ్ సిటీ' (ఆర్థికంగా సంపన్నమైన నగరం)గా పేరున్న బెంగళూరు నగరంపై కొలంబియా దొంగల కన్ను పడింది. చోరీల కోసం ఐదుగురు దొంగలు అంత దూరం నుంచి బెంగళూరుకు వచ్చేలా చేసింది.
ఐదుగురు దొంగల్లో ముగ్గురు గత కొన్నేళ్లలోనే రెండోసారి బెంగళూరు వచ్చారు.
ఈ గ్యాంగ్‌లో ఇంగ్లిష్ మాట్లాడ్డం ఒకరికి మాత్రమే వచ్చు. దొంగతనాలు చేయడానికి వాళ్లు ఒక పెద్ద ఇంటిని అద్దెకు తీసుకునేవారు. తమలో తాము మాట్లాడుకోవడానికి వాకీ-టాకీలు ఉపయోగించేవారు.

ఫొటో సోర్స్, BANGALORE POLICE
సీసీటీవీ వీడియోతో చిక్కారు
"నాకు తెలిసినంత వరకూ బెంగళూరులో ఎప్పుడూ ఏ దొంగల గ్యాంగూ దొంగతనాల కోసం వాకీ-టాకీలు ఉపయోగించలేదు" అని బెంగళూరు అదనపు పోలీస్ కమిషనర్ (పశ్చిమ) బీకే సింగ్ బీబీసీతో అన్నారు.
"దొంగతనాలు చేయడానికి బెంగళూరు వచ్చామని వాళ్లు మాకు చెప్పారు. ఆర్థికంగా ఇది చాలా సంపన్న నగరం అని వాళ్లు అనుకున్నారు. దొంగతనాల కోసం భారత్‌లో వేరే ఏ నగరం గురించీ వాళ్లు ఆలోచించలేదు" అని ఆయన చెప్పారు.
చోరీలు చేయడానికి ఈ గ్యాంగ్ టెక్నాలజీ ఉపయోగించింది.
వాళ్లు మొదట తాము దొంగతనం చేయాలనుకున్న ఇళ్ల దగ్గర రెక్కీ నిర్వహిస్తారు. తర్వాత దాన్ని జీపీఎస్‌లో మార్క్ చేసుకుంటారు. కానీ లోపల సీసీటీవీ కెమెరాలు అమర్చి ఉంటారని మాత్రం ఊహించలేకపోయారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా గత వారం వీరందరినీ అరెస్ట్ చేశారు.
దొంగతనం కోసం వీరు టార్గెట్ చేసిన భవనాల్లో కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి ఇల్లు కూడా ఉంది.

ఫొటో సోర్స్, AFP
నిందితుల అరెస్ట్
ఇళ్లలో చోరీలు చేసిన ఐదుగురినీ "హోసే ఎడ్వర్డ్ అలియాస్ ఎరివాలో బుర్బానో (40), గుస్తావో ఒడోల్ఫో అలియాస్ జారామీలో జీరోల్డో (47), యాయిర్ అల్బర్టో సాంచెజ్ అలియాస్ రోజర్ స్మిత్ డువర్ట్ (45), ఎడుయర్డ్ ఎలిక్స్ గార్సియా పెరెమావో (38), అతడి గర్ల్ ఫ్రెండ్ కింబర్లీ గ్యూటెరెజ్ (30)గా గుర్తించారు.
ఈ గ్యాంగ్ నగరంలోని దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఇళ్ల దగ్గర రెక్కీ చేసింది.
ఎవరూ లేరని అనిపించే ఇళ్ల దగ్గరకు గ్యాంగ్‌లోని యువతి కింబర్లీ గ్యూటెరెజ్ వెళ్లి వాటి కాలింగ్ బెల్ కొడుతుంది. లోపల ఎవరూ లేరని ధ్రువీకరించుకుంటుంది. తర్వాత జీపీఎస్‌లో ఆమె ఆ ఇళ్లను మార్క్ చేస్తుంది.

ఫొటో సోర్స్, PA
ఇంతకు ముందు కూడా చోరీలు
సిటీలో తిరగడానికి ఈ గ్యాంగ్ పాత కార్లు కూడా కొనుగోలు చేసింది.
కార్లలో వాళ్లు తాము జీపీఎస్‌లో మార్క్ చేసిన ఇళ్లకు చేరుకునేవారు. ముగ్గురు నిందితులు ఇంట్లోకి వెళ్లేవాళ్లు. కింబర్లీ బయటే ఉండి ఎవరైనా వస్తారేమో గమనిస్తుండేది.
ఒకరు పారిపోవడానికి సిద్ధంగా కారు స్టార్ట్ చేసుకుని ఉండేవారు.
ఇళ్ల తలుపులు విరగ్గొట్టడానికి వాళ్లు బలమైన పరికరాలను ఉపయోగించేవారు.
జూన్, జులై మధ్యలో ఈ గ్యాంగ్, 80 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, ఖరీదైన గడియారాలు చోరీ చేసిందని ఆరోపిస్తున్నారు.
తాము దొంగిలించిన బంగారాన్ని వీళ్లు కరగబెట్టి కడ్డీలుగా మార్చి అమ్మేసేవాళ్లు. దొంగతనం చేసిన ప్రతిసారీ తాము ఉపయోగించిన కారును ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో పెట్టి విక్రయించేవారు.
ఈ విదేశీ దొంగలు స్థానిక ఎమ్మెల్యే ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆ ఇంట్లో జరిగిన దొంగతనంలో 40 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ఐదుగురూ కొలంబియా దొంగలే
హోసే, గుస్తావో కొలంబియాలోని జైళ్లలో కూడా గడిపారు.
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి హోసే, హత్య నేరంలో గుస్తావో జైలు శిక్షలు అనుభవించారు.
ఎడుయర్డ్ కొలంబియాలో కూడా ఒ పెద్ద దొంగతనం చేశాడు. అతడి గ్యాంగ్ ఒక హోటల్ నుంచి 1.2 కోట్ల రూపాయల విలువైన నగలు దొంగిలించింది.
గుస్తావో దగ్గర ఎంబీఏ డిగ్రీ ఉంది. ఇక గ్యాంగ్‌లో ఉన్న ఒకే ఒక మహిళ కింబర్లీ... ఫారిన్ ట్రేడ్ (విదేశీ వ్యాపార) విద్యార్థి.
గ్యాంగ్‌లో యాయిర్ మాత్రమే ఇంగ్లిష్‌లో మాట్లాడగలడు. తను వృత్తిపరంగా ఒక వెల్డర్. ఇతడిని అమెరికా మూడుసార్లు కొలంబియాకు అప్పగించింది.
ఈ ఐదుగురు నిందితులూ కొలంబియాలోని బొగోటాకు చెందినవారు.
బెంగళూరు పోలీసులు విదేశీయులపై ఇప్పటివరకూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలు లాంటి ఆరోపణలతో ఎన్నో కేసులు నమోదు చేశారు. కానీ దొంగతనం కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి.
దొంగతనాలు చేసే విదేశీయుల జాబితా రూపొందిస్తున్నట్టు ఒక పోలీస్ అధికారి తెలిపారు.
ఇవికూడా చదవండి:
- ‘తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి’ కానీ..
- బైక్ అంబులెన్స్: రాదారిలేని కొండ కోనల్లో ఆపద్బంధువు
- బిహార్: 'సంరక్షణ గృహంలో 29 మంది బాలికలపై అత్యాచారం'
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- భారత మహిళలు గృహహింసను ఎందుకు భరిస్తారు?
- కేరళ: 'కూర్చునే హక్కు' సాధించుకున్న సేల్స్ గర్ల్స్
- శానిటరీ న్యాప్కిన్లపై జీఎస్టీ రద్దు వెనకున్నది ఈ అమ్మాయే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








