బైక్ అంబులెన్స్: రాదారిలేని కొండ కోనల్లో ఆపద్బంధువు

బైక్ అంబులెన్స్
ఫొటో క్యాప్షన్, రంపచోడవరంలో ఏజన్సీలో బైక్‌ ఆంబులెన్స్‌
    • రచయిత, శ్యాంమోహన్‌
    • హోదా, బీబీసీ కోసం

కొండ మీద ఓ పల్లెలోని పూరిల్లు. ఆ ఇంట్లో ఓ నిండు చూలాలు. ఆమె పేరు ప్రమీల పాయికో. నెలలు నిండాయి. పురిటి నెప్పులు మొదలయ్యాయి. భరించలేని బాధతో ఆమె కేకలు పెడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కానీ ఎలా?

మారుమూల ప్రాంతంలోని ఆ కొండ మీద నుంచి ఆ గర్భిణిని కిందికి తీసుకెళ్లడమెలా? అంబులెన్స్ ఆ కొండెక్కి వచ్చే దారిలేదు. ఇంతలో ఎవరో 108కి ఫోన్‌ చేశారు. గంట లోపే ఒక అంబులెన్స్ కొండ మీదకి దూసుకొచ్చింది. అది 'బైక్‌ అంబులెన్స్‌'.

ఆ అంబులెన్స్‌లో ఆమెను జాగ్రత్తగా ఎక్కించుకొని కొండ కిందికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. సోంపేట పొలిమేరల్లో ఆమె ఆ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. అందులోనే ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.

బైక్ అంబులెన్స్
ఫొటో క్యాప్షన్, బైక్‌ ఆంబులెన్స్‌లోనే పండంటి బిడ్డను ప్రసవించిన ప్రమీల పాయికోని

ఒక బైక్ అంబులెన్స్ తమ ఊర్లోని తల్లీబిడ్డల ప్రాణాలను ఎలా కాపాడిందో.. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పొంకాల గ్రామస్తులు వివరించారు.

వైద్యుడు అందుబాటులో లేని ప్రాంతాల్లో.. అంబులెన్సుల వంటి వాహనాలు వెళ్లటానికి రహదారులు లేని చోట.. ఈ బైక్ అంబులెన్సులు ఇప్పుడు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి.

కొండాకోనల మధ్యనున్న మారుమూల గ్రామాల్లో సరైన రహదారులు లేని చోట నివసిస్తున్న ప్రజలకు.. ఆపత్కాలంలో వైద్య చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రులకు చేర్చడానికి ఆంధ్రప్రదేశ్‌‌లో 'బైక్‌ అంబులెన్స్‌'లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా ఇలాంటిదే 'ప్రాజెక్ట్‌ రెక్కలు' అనే పథకం అమలవుతోంది.

బైక్ అంబులెన్స్

బైక్‌ అంబులెన్స్‌లు ఎక్కడ తిరుగుతున్నాయి?

''ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ఐటీడీఏ గిరిజన ప్రాంతాలలో గత మార్చి నెల నుండి 122 బైక్‌ అంబులెన్స్‌లు తిరగడం ప్రారంభమైంది. సీతంపేటలో 15, పార్వతీపురంలో 24, పాడేరులో 42, రంపచోడవరంలో21, చింటూరులో 6, కె.ఆర్‌పురంలో 8, శ్రీశైలంలో 6 బైక్‌ అంబులెన్స్‌లు ప్రస్తుతం తిరుగుతున్నాయి'' అని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

‘‘శ్రీకాకుళంలో 15 వాహనాలు మార్చి నెల నుండి తిరుగుతున్నాయి. ఇప్పటివరకు 389 కేసులకు సాయం అందించాయి. అయితే ఈ కొత్త అంబులెన్స్‌ల గురించి చాలామందికి తెలియదు. అందుకే డ్రైవర్‌ ఫోన్‌ నంబర్‌తో సహా పోస్టర్లు, కరపత్రాలుతో ప్రచారం చేయబోతున్నాం'' అని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు.

  • ఒక్క బైక్‌ అంబులెన్స్‌ నిర్వహణకు వాహన డ్రైవర్‌, వేతనంతో పాటు మందులకు రోజుకు రూ. 2,100 ఖర్చు అవుతుంది.
  • ఈ ద్విచక్ర వాహనాల్లో 12 రకాల వైద్యపరికరాలు, 5 రకాల అత్యవసర మందులు, ప్రథమ చికిత్సకు అవసరమైన సరంజామా ఉంటాయి.
  • 108 నంబర్‌‌కి కాల్‌ చేస్తే అంబులెన్స్‌ వెళ్లలేని చోటుకు బైక్‌ అంబులెన్స్‌ వచ్చి రోగిని తీసుకుని అంబులెన్స్‌ ఉన్న పాయింట్‌ దగ్గరకు చేరుస్తుంది.
  • ఈ వాహనాలు నడిపే డ్రైవర్లకు 108 అత్యవసర సర్వీసుల సెంటర్లలో శిక్షణ ఇచ్చిన తరువాతే ఫీల్డ్‌కి పంపుతున్నారు.
బైక్ అంబులెన్స్

''ఇప్పటివరకు బైక్‌ అంబులెన్స్‌ల ద్వారా 1,637 మంది రోగులు సకాలంలో ఆసుపత్రులకు చేరారు. ఎక్కువ కేసులు గర్భిణిలకు సంబంధించినవే. గత మార్చి నుంచి ఇప్పటి వరకు బైక్‌లు 28,061 కిలోమీటర్లు ప్రయాణించాయి’’ అని ఆరోగ్య ఆంధ్ర ప్రతినిధి అంకిత పురోహిత్‌ వివరించారు.

‘‘మా ఇళ్ల మధ్యకు అంబులెన్స్‌లు రావడానికి సరైన దారి లేదు. రోగమెచ్చినా, పాములు కాటేసినా, ఆసుపత్రికి మంచాల మీద మోసుకు వెళ్లాల్సి వచ్చేది. ఈ చిన్న అంబులెన్స్‌లు వచ్చాక కొన్ని ప్రాణాలు దక్కుతున్నాయి'' అని చెప్తున్నారు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామస్తులు.

అయితే.. కొన్ని కొండ ప్రాంతాల్లో సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ లేక పోవడం వల్ల ఈ సౌకర్యం పొందలేక పోతున్నామంటున్నారు కొందరు గిరిజనులు.

బైక్ అంబులెన్స్

ఈ ఆలోచన ఎవరిది?

''మారుమూల కుగ్రామాల్లో ఆనారోగ్యంతో ఉన్న వారిని కాపాడడానికి బైక్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యది. ఆమె చొరవతోనే గిరిజన ప్రాంతాల్లో ఈ సేవలు మొదలయ్యాయి’’ అని తెలిపారు ప్రకాశం జిల్లా డీఎంహెచ్‌ ఒ.రాజ్యలక్ష్మి.

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో 8,137 కుగ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల్లో 122 బైక్‌ అంబులెన్స్‌లు అందరికీ సేవలు అందించడం ఆసాధ్యం. వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

''అసలు రహదారులు సరిగా లేక మామూలు అంబులెన్స్‌లు కూడా సకాలంలో రాలేకపోతున్నాయి. ముందు ప్రభుత్వం ఉన్న రోడ్లకు రిపేర్లు చేసి బాగు చేయాల్సిన అవసరం ఉంది. అపుడే మారుమూల ప్రాంతంలోని ప్రజలకు మేలు కలుగుతుంది. 1,239 ఆవాసాలున్న గిరిజన ప్రాంతాల్లో 15 బైక్‌లు ఎంతమందిని కాపాడుతాయి? వీటిని పెంచాల్సిన అవసరం ఉంది'' అంటారు శ్రీకాకుళం జిల్లా, కవిటి గ్రామానికి చెందిన డాక్టర్‌ పూడి రామారావు.

బైక్ అంబులెన్స్

తెలంగాణలో ''ప్రాజెక్టు రెక్కలు''

మారుమూల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించే 'ప్రాజెక్టు రెక్కలు' పథకాన్ని తెలంగాణలో తొలిసారిగా గత సంవత్సరం వికారాబాద్‌ జిల్లాలో ప్రారంభించారు.

మోటార్‌‌సైకిల్‌ నడపటం వచ్చిన పది మంది ఏఎన్‌ఎంలకు మొదటిగా వాహనాలు అందించారు. ఆ వాహనాల మీద ఏఎన్‌ఎంలు సులభంగా మారుమూల గ్రామీణులకు వైద్య సేవలు అందించడం సులభమైంది.

దీంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ వున్న 101 మంది ఏఎన్‌ఎంలకు మోటర్‌ బైక్‌లు అందించారు. వీటిలో వాక్సినేషన్‌ కిట్, ఇతర సామాగ్రి పెట్టుకునే సదుపాయం కూడా కల్పించారు.

బైక్ అంబులెన్స్
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో ప్రాజెక్టు రెక్కలు ప్రాజెక్టులో బైక్‌లు పొందిన ఏఎన్‌ఎం లు రోజాకుమారి, షబానా

‘‘మారుమూల గ్రామాలకు ఒకప్పుడు షేర్‌ ఆటోల్లో పోవాల్సి వచ్చేది. చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఇవన్నీ గమనించిన అప్పటి కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ మాకు బైక్‌లు ఏర్పాటు చేశారు’’ అని చెప్పారు వికారాబాద్‌ ఏఎన్‌ఎం రోజాకుమారి.

‘‘కలెక్టర్‌ నిధుల నుంచి వాహనానికి పది వేల రూపాయలు, ప్రజారోగ్య శాఖ మరో పది వేల రూపాయలు అందించారు. వాహనాలు సరఫరా చేసిన సంస్థ అసలు ధరలో ఐదు వేల రూపాయలు తగ్గించింది. దీంతో మాకు వాహనం ధరలో పాతిక వేల రూపాయల వరకూ తగ్గింది. మిగతా మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వడంతో బైక్‌లు చాలా తక్కువ ధరకే సమకూరాయి'' అని మరో ఏఎన్ఎం షబానా వివరించారు.

వికారాబాద్‌ జిల్లాలో విజయవంతైన ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)