హైపర్‌లూప్: ప్రయోగ పరీక్షలో గంటకు 457 కి.మీ. రికార్డు వేగంతో ప్రయాణం

ఫొటో సోర్స్, VIRGIN HYPERLOOP ONE
ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న అత్యంత వేగవంతమైన మెట్రో రైలు రవాణాను పోలిన వ్యవస్థ 'హైపర్‌లూప్'కు సంబంధించి ఒక రికార్డు నమోదైంది. హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడే ప్రయత్నాలను ప్రోత్సహించేందుకు స్పేస్‌ఎక్స్ ఏరోస్పేస్ సంస్థ ఒక పోటీని నిర్వహించగా, ఇందులో జర్మనీ విద్యార్థుల బృందం విజయం సాధించింది.
'వార్ హైపర్‌లూప్' అనే ఈ బృందం రూపొందించిన హైపర్‌లూప్ పాడ్‌ను 1.2 కిలోమీటర్ల పొడవైన ప్రయోగ ట్రాక్‌పై నడిపి చూడగా, ఇది గంటకు 457 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. 'టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిక్'కు చెందిన ఈ బృందానికి ఇది మూడో విజయం.
అమెరికాలోని కాలిఫోర్నియాలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగ క్షేత్రంలో జరిగిన ఈ పోటీలో ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థుల బృందాలు పాల్గొన్నాయి.

ఫొటో సోర్స్, WARR HYPERLOOP
జర్మనీ బృందంతో పోటీపడిన నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ బృందం గంటకు 141.6 కిలోమీటర్ల వేగాన్ని, స్విట్జర్లాండ్‌కు చెందిన 'ఈపీఎఫ్ లూప్' 88.5 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలిగాయి.
నిరుడు సెప్టెంబరులో జరిగిన పోటీలో 'వార్ హైపర్‌లూప్' గంటకు 323 కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని అందుకుంది.
ఇప్పుడు కాలిఫోర్నియాలో జరిగిన పోటీని స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు, టెస్లా సంస్థ సహ వ్యవస్థాపకుడు అయిన ఎలాన్ మస్క్ తిలకించారు. ఆయా బృందాల పాడ్‌ల ప్రయాణాన్ని ఆయన పరిశీలించారు. పోటీలో పాల్గొన్న పరిశోధక బృందాలతో మాట్లాడారు.
హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఆలోచన కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఎలాన్ మస్క్ 2012లో ఈ ప్రతిపాదనకు గట్టి మద్దతు పలికి, దీనిని తర్వాతి దశకు తీసుకెళ్లారు.

హైపర్‌లూప్ వ్యవస్థలో రవాణా పాడ్లు ప్రత్యేకంగా రూపొందించిన సొరంగం గుండా అత్యధిక వేగంతో దూసుకెళ్తాయి. ఈ పాడ్లు గంటకు వెయ్యి కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించగలవని ఎలాన్ మస్క్ అప్పట్లో చెప్పారు.
విమర్శకులు ఈ వ్యవస్థ నిర్మాణ వ్యయంపై ఆందోళనను, సాంకేతికంగా దీని నిర్వహణ సాధ్యసాధ్యాలపై సందేహాలను వ్యక్తంచేశారు.
అయస్కాంతాల సాయంతో పట్టాల మీద రైలును పైకెత్తి నిలపడం వల్ల రాపిడి తగ్గి వేగం పెరిగే మాగ్లెవ్ (మాగ్నెటిక్ లేవిటేషన్) రైళ్లు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఒకటి చైనాలోని షాంఘై నుంచి అక్కడి విమానాశ్రయానికి ప్రయాణికులను గంటకు 430 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్తోంది.
ఈ మాగ్లెవ్‌ను వాక్యూమ్ ట్యూబ్ (శూన్య గొట్టంలో) నడపటం ఇంకా అత్యాధునికమైన ప్రక్రియ. ఇదే హైపర్‌లూప్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రత్యేక సొరంగం ఒక భాగం. వాహనం ప్రయాణించేటప్పుడు గాలి కారణంగా ఎదురయ్యే నిరోధాన్ని, రాపిడిని తగ్గించేందుకు ఈ సొరంగంలో గాలి లేకుండా చేస్తారు.

ఫొటో సోర్స్, SPACEX
భారత్‌లో ప్రతిపాదనలు ఇవీ
భారత్‌లో ముంబయి-బెంగళూరు-చెన్నై నగరాల మధ్య 1,102 కిలోమీటర్ల హైపర్‌లూప్ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ప్రకారం ముంబయి నుంచి చెన్నైకి 63 నిమిషాల్లో చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి 334 కిలోమీటర్ల దూరంలోని చెన్నైకు 23 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ముంబయి-పుణె మధ్య కూడా ఈ వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలో ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ వన్ సంస్థ పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం, హైపర్‌లూప్ అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పొర్టేషన్ టెక్నాలజీస్(హెచ్‌టీటీ) మధ్య నిరుడు సెప్టెంబర్‌లో అవగాహన ఒప్పందం జరిగింది.
ఇవి కూడా చదవండి:
- హైపర్‌లూప్: భవిష్యత్తా? భ్రమా?
- విచిత్ర భారతం: ఎలా వస్తాయండీ.. ఇలాంటి ఐడియాలు!
- శానిటరీ న్యాప్కిన్లపై జీఎస్టీ రద్దు వెనకున్నది ఈ అమ్మాయే
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- సముద్రం అడుగున కంప్యూటర్లను పెట్టిన మైక్రోసాఫ్ట్
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- భారత మహిళలు గృహహింసను ఎందుకు భరిస్తారు?
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
- BBC EXCLUSIVE: ‘రాహుల్ గాంధీ పరిణతి చెందారు’
- కేరళ: 'కూర్చునే హక్కు' సాధించుకున్న సేల్స్ గర్ల్స్
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








