పక్షి వెన్నెముక, రెక్కల ఆధారంగా హైదరాబాద్ మెట్రో స్టేషన్ల నిర్మాణం
- రచయిత, సంగీతం ప్రభాకర్, నవీన్, రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
హైదరాబాద్‌కు మెట్రో రైలు మణిహారం కాబోతోంది.
మరికొద్ది గంటల్లో మెట్రో రైలు తొలి కూత వేయనుంది. ఇక నిత్యం నాగోల్-మియాపూర్ మార్గంలో చకచకా పరుగులు తీయనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించనున్నారు. ఇందుకు మియాపూర్ మెట్రో స్టేషన్ వేదిక కానుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో దాదాపు 68 లక్షల మంది నివసిస్తున్నారు. నేటికి ఆ సంఖ్య ఇంకా పెరిగి ఉంటుంది.
నిత్యం తాము ఎదుర్కొనే ప్రయాణ కష్టాలకు మెట్రో కొంత మేరకు ఉపశమనం కలిగిస్తుందని నగరవాసులు ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter/Hyderabad Metro Rail
పక్షి రెక్కలు చూసి
హైదరాబాద్ మెట్రోకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
ప్రపంచంలో ఇంత వరకు ప్రభుత్వ నిధులతోనే మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన తొలి ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రోనే.
అంతేకాదు మెట్రో నిర్మాణంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రీక్యాస్టింగ్ విధానాన్ని అవలంబించారు. అంటే ముందుగానే ఒక చోట గోడలు, పైకప్పులు వంటివి నిర్మించి వాటిని తీసుకొచ్చి జాయింట్ చేస్తారు.
హైదరాబాద్ మెట్రో స్టేషన్లను ఇలా ప్రీక్యాస్టింగ్ విధానంలోనే నిర్మించారు. .
పక్షిని స్ఫూర్తిగా తీసుకొని ఈ స్టేషన్లను నిర్మించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఎన్‌వీఎస్ రెడ్డి బీబీసీకి చెప్పారు. పక్షి వెన్నెముక, రెక్కల ఆధారంగా ఈ స్టేషన్లను డిజైన్ చేసినట్లు తెలిపారు.
"హైదరాబాద్ మెట్రో అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇంత వరకు ప్రపంచంలో ప్రభుత్వ-ప్రైవేటు విధానంలో ఇంత భారీ ప్రాజెక్ట్‌ను ఎవరూ చేపట్టలేదు. అందుకే చాలా మంది ఇది అసాధ్యమనుకున్నారు. కానీ మేం దీన్ని సుసాధ్యం చేసి చూపించాం" అని ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, Twitter/Hyderabad Metro Rail
ఏక ’స్తంభ’ స్టేషన్లు
సాధారణంగా నేల మీద కాకుండా ఎత్తులో నిర్మించే మెట్రో స్టేషన్‌కు ఆధారంగా మూడు వరుసల్లో స్తంభాలు (పిల్లర్లు) ఉంటాయి. అంటే స్టేషన్ మధ్యలో ఒక వరుస; ఎడమవైపు, కుడి వైపు రెండు వరుసల్లో స్తంభాలు ఉంటాయి.
కానీ హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు మాత్రం కేవలం మధ్యలోనే స్తంభాలు ఉంటాయి. అంటే ఒక్క వరుస మీదనే స్టేషన్ ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ప్రపంచంలో తొలిసారని ఎన్‌వీఎస్ రెడ్డి బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









