హైదరాబాద్: ఇవాంకా ట్రంప్ రాకకూ, బిచ్చగాళ్ల ‘ఏరివేత’కూ ఏంటి సంబంధం?

- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ న్యూస్ తెలుగు
హైదరాబాద్‌లో బిచ్చగాళ్లు మాయమవుతున్నారు! తెలంగాణ ప్రభుత్వం బిచ్చగాళ్ల ఏరివేతను ప్రారంభించింది.
తెలంగాణ జైళ్ల శాఖ, హైదరాబాద్ నగర పోలీసులు, స్వచ్ఛంద సంస్థలూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అయితే ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఇలా చేస్తున్నారని స్థానిక మీడియా కథనాలు రాస్తే, జైళ్ల శాఖ మాత్రం ఆ వాదనను తప్పుపడుతోంది.
మరోవైపు.. తాము భిక్షాటన చేయకపోయినా బలవంతంగా ఆశ్రమాలకు తరలిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్, తెలంగాణల్లో ఎక్కడా బిచ్చగాళ్లు కనిపించకుండా చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టు తెలంగాణ జైళ్ల శాఖ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో భిక్షాటనను నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలు కూడా జారీ చేశారు.
నగరం రోడ్లపై కనిపించే బిచ్చగాళ్ళను చంచల్‌గూడ జైలు పక్కన ఏర్పాటు చేసిన ‘ఆనందాశ్రమం’ అనే చోట ఉంచుతున్నారు. మహిళలను మాత్రం చర్లపల్లి జైలు వద్దే ఉంచుతున్నారు. 'అమ్మానాన్న అనాథాశ్రమం' అనే స్వచ్చంధ సంస్థ ఇందులో భాగమయింది.

ఫొటో సోర్స్, Getty Images
చర్లపల్లి జైలులో మొత్తం 126 మంది బిచ్చగత్తెలను ఉంచారు. వారిలో 108 మందిని తర్వాత వదిలేయగా ప్రస్తుతం 18 మంది ఉన్నారు.
ఇక పురుష యాచకులను చంచల్‌గూడ జైలులో ఉంచుతున్నారు. ప్రస్తుతం ఈ జైలులో 251 మంది బిచ్చగాళ్లను అదుపులోకి తీసుకొని వారిలో 180 మందిని వదిలేశారు. ప్రస్తుతం 71 మంది వారి అదుపులో ఉన్నారు.
అటువంటి వారి తరఫున ఎవరైనా వస్తే వారి నుంచి పూచీకత్తు తీసుకుని, మరోసారి భిక్షాటనకు పంపబోమని హామీపత్రం రాయించుకుని వదిలిపెడుతున్నారు. తమ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి ఫోటో తీసుకుంటున్నారు ఆనందాశ్రమం సిబ్బంది.
ఇక్కడ ఉంటున్న వారికి భోజనం, వారు వేసుకోవడానికి బట్టలు, చెప్పులు అందిస్తున్నారు. వినోదం కోసం టీవీ కూడా ఏర్పాటు చేశారు.
జైలు నుంచి కాస్త వేరుగా ఉండి, ఒకప్పుడు బాల నేరస్తుల కోసం వాడిన బ్యారక్‌లను నవీకరించి ఆనందాశ్రమం అని పేరు పెట్టారు. జైలు ఖైదీలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే విభాగానికి ఈ బాధ్యత అప్పగించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవాంకా పర్యటనే కారణమా?
ఈ నవంబర్ 28వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సు జరగబోతోంది. దానికి అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ వస్తున్నారు.
ఆ సదస్సు, ఇవాంకా ట్రంప్ పర్యటన నేపథ్యంలోనే నగరంలో బిచ్చగాళ్లను తరలిస్తున్నట్టు స్థానిక మీడియా వార్తలు ప్రచురించింది.
2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ నగరంలో పర్యటించినప్పుడు కూడా ఇలానే బిచ్చగాళ్ళను తరలించారు.
అయితే ప్రస్తుతం బిచ్చగాళ్లను తరలించడానికీ, ఇవాంకా ట్రంప్ పర్యటనకూ సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు.
"ఇవాంకా వస్తున్నారు కాబట్టే ఇదంతా చేస్తున్నారా?" అన్న ప్రశ్నకు "భారత్ ఒక సార్వభౌమ దేశం. ఎవరినీ మెప్పించాల్సిన అవసరం భారతదేశానికి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు" అని చెప్పారు తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ వినయ్‌కుమార్‌సింగ్.
బిచ్చగాళ్లను నియంత్రించడం జైళ్ల శాఖ వల్ల మాత్రమే అవుతుందని చెప్పే వి.కె.సింగ్.. తానే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాననీ, అసలు తెలంగాణ మొత్తం ఇలా చేయబోతున్నామనీ, ముందుగా హైదరాబాద్‌లో చేస్తున్నామనీ తెలిపారు.
"పని చేయగల సామర్థ్యం ఉన్న వారికి పని చూపిస్తాం. కుటుంబం ఉన్న వారిని వారి కుటుంబాలకు అప్పగిస్తాం. వారు మళ్ళీ రోడ్లపైకి వస్తే మాత్రం కేసు నమోదు చేస్తాం. మేం ఎంత మందినైనా, ఎంత కాలమైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాం" అన్నారు సింగ్.
"సదస్సులు, వ్యక్తుల పర్యటనతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. త్వరలో తెలంగాణ అంతటా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. జైళ్ల శాఖ స్వచ్ఛందంగా చేస్తోన్న ఈ కార్యక్రమాన్ని కొందరి పర్యటనలతో ముడిపెట్టడం సరికాదు" అని వి.కె. సింగ్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ రాష్ట్రంలో భిక్షాటన నిషేధంపై 1977 సంవత్సరంలో చట్టం రూపొందించారు. ఆ చట్టం అమలు చేయాలని 2010లో హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కూడా రోడ్లపై భిక్షాటన నేరం. జువైనల్ న్యాయ చట్టం 2000 కూడా పిల్లల చేత భిక్షాటన చేయించడం నేరం అంటోంది.
2016 జూన్‌లో కూడా హైదరాబాద్ నగర పాలక సంస్థ ఇటువంటి ప్రయత్నం చేసింది. మేయర్ బొంతు రామ్మోహన్ అప్పట్లో ఈ అంశంపై సదస్సులు నిర్వహించారు. నగరం మొత్తం బ్యానర్లు పెట్టారు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. మళ్లీ ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది.
"బిచ్చగాళ్లను అదుపు చేయడంలో మునిసిపల్ సంస్థలకు పెద్దగా అనుభవం ఉండదు. ఎప్పటి నుంచో హైదరాబాద్‌ను ఈ సమస్య వేధిస్తోంది. దీనికి మేం పరిష్కారం చూపిస్తాం అని ముందుకు వచ్చాం. స్వచ్ఛంద సంస్థలతో కలసి ఆ పని మా భుజాన వేసుకున్నాం. స్వచ్చంద సంస్థలు, పోలీసులు, మునిసిపల్ సిబ్బంది బిచ్చగాళ్లను తీసుకువచ్చి మాకు అప్పగిస్తారు. వారి బాగోగులు మేము చూస్తాం" అంటున్నారు వికె సింగ్.

ఎవరు నిజమైన బిచ్చగాళ్లు?
బిచ్చగాళ్లను అదుపు చేసే ప్రక్రియలో మరో వివాదం ఉంది. తాము భిక్షాటన చేయకపోయినా, బలవంతంగా తమను తీసుకువచ్చారని కొందరు బీబీసీతో చెప్పారు.
"నేను ఉస్మానియా ఆసుపత్రిలో మందుల కోసం వెళ్లా. అక్కడ చీటీలు అయిపోవడంతో బయటకు వచ్చి రోడ్డు పక్కన టిఫిన్ తిని కాసేపు కూర్చున్నా. వెంటనే పోలీసులు వచ్చి బలవంతంగా నన్ను వ్యానులో ఎక్కించి స్టేషన్‌కి తీసుకెళ్లారు. నాకు కొత్త బట్టలు ఇస్తాం అని చెప్పి ఇక్కడకు తీసుకువచ్చారు. నాకు మీరిచ్చే బట్టలు అక్కర్లేదని చెప్పినా వారు వినలేదు. ముందు అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కి, అక్కడి నుంచి ఈ ఆశ్రమానికి తీసుకువచ్చారు. నేను ఎప్పుడూ బిచ్చమెత్తుకోలేదు. కార్పెంటర్ పని చేసుకుంటాను" అని బీబీసీకి చెప్పారు వేంకటేశులు అనే వ్యక్తి.
ఆనందాశ్రమంలో ఉన్నవారు ఇచ్చే వివరాల ఆధారంగా వారి సంబంధీకులకు ఫోన్ చేస్తున్నారు సిబ్బంది. వారిచ్చే పూచీకత్తుపై వదిలేస్తున్నారు. కానీ ఫోన్ నంబర్లు గుర్తులేని వారు, బయటి ఊర్ల నుంచి వచ్చిన వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.
"నాకు చదువురాదు. ఫోన్ నంబర్లు ఉన్న డైరీ నా దగ్గర లేదు. నేనిక్కడ ఉన్నట్టు మావాళ్లకు ఎలా తెలుస్తుంది?" అంటూ బాధపడ్డారు వేంకటేశులు.
"నేను సికిందరాబాద్ దగ్గర ఓ హోటల్లో పనిచేస్తా. నాంపల్లి స్టేషన్ దగ్గర మిత్రులను కలసి వస్తుంటే పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చారు" అని చెబుతున్నారు దాస్ అనే వ్యక్తి. ఇతను ఒడిశా నుంచి వచ్చారు.

మహారాష్ట్ర నుంచి వచ్చిన నౌరత్‌ది కూడా ఇదే కథ. తాను ఇక్కడ పనికోసం వచ్చాననీ, పని గురించి వెతుకుతుంటే పోలీసులు తీసుకువచ్చేశారని చెబుతున్నారు.
కొందరు తాము భిక్షాటన చేస్తున్న విషయాన్ని ఒప్పుకున్నారు. "నాకు ఆరోగ్యం దెబ్బతింది. అమ్మానాన్న చనిపోయారు. అన్నయ్య కొంత కాలం చూసుకున్నా ఆయనకూ భారం అయ్యాను. గతిలేక అడుక్కుంటున్నాను. నాకు ఎవరైనా పని చూపిస్తే సంతోషంగా చేసుకుంటాను" అని చెబుతున్నారు ఉదయ భాస్కర్. ఇతను ఇంగ్లిష్‌లో మాట్లాడటం చూసిన జైలు సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు.
నరసింగరావుది మరో కథ. "మా అమ్మ అగ్నిప్రమాదంలో చనిపోయింది. నాకు శరీరం కాలింది. మా నాన్నే నన్ను అడుక్కోమని చెప్పారు. నాకు మద్యం తాగడం అలవాటు. నా భోజనం, 'మందు'కు సరిపడా మాత్రమే అడుక్కుంటాను. ఇప్పుడు వీళ్లు ఇక్కడకు తీసుకువచ్చారు. ఏం చేయాలో తెలియడం లేదు" అని నరసింగరావు చెబుతున్నారు.

పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఏమంటున్నాయంటే..
"రోడ్డున పోయే వాళ్లను తీసుకువస్తే మాకేం వస్తుంది? వాళ్లు మాకు భారమే తప్ప లాభం కాదు కదా! ఒకవేళ వాళ్ళు నిజంగా బిచ్చగాళ్లు కాకపోతే వెంటనే వదిలేస్తాం" అన్నారు సింగ్.
గతంలో కూడా తమపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయని గుర్తు చేసుకుంటున్నారు అమ్మానాన్నా అనాథాశ్రమం నిర్వహకులు శంకర్. అందుకే బిచ్చగాళ్లను తరలించేప్పుడు వీడియోలు తీస్తున్నట్టు వివరించారు.
"పోలీసులు కూడా వివాదాల్లో చిక్కుకోకుండా వీడియో తీయాలని మేం సలహా ఇచ్చాం. భిక్షాటన ద్వారా వచ్చే ఆదాయానికి, దాని ద్వారా వివిధ అలవాట్లకు బానిసైన వారు ఇలాంటి ఆశ్రమాల్లో ఉండటానికి ఇష్టపడరు, అందుకే తాము బిచ్చగాళ్లం కాదని వాదిస్తారు. ఇలాంటి వాళ్ళను గుర్తించడం కాస్త కష్టమే’’ అంటారాయన.
2010 నుంచీ బిచ్చగాళ్ల కోసం ఆశ్రమం నడుపుతూ, ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌జీవోస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు శంకర్.
"నాలుగు సంవత్సరాల క్రితం సోమేశ్‌కుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు మేం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిశాం. అప్పటి నుంచి విడతల వారీగా పనిచేస్తున్నాం. 2016 జూన్‌లో మేయర్ రామ్మోహన్‌తో కలసి బిచ్చగాళ్లను ఆశ్రమాలకు తరలించే కార్యక్రమాలు చేశాం.
మళ్లీ మూడు నెలల కిందటి నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. ఎవరో వస్తారని మేం ఇదంతా చేయడం లేదు" అన్నారు శంకర్.

ఫొటో సోర్స్, Getty Images
ఆశ్చర్యపరిచే అంకెలు...
బిచ్చగాళ్ల విషయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు 2016 సంవత్సరంలో చేసిన సర్వేలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అందులో ఓ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ నగరంలో 12 వేల మంది బిచ్చగాళ్లున్నారు. వారిలో 90 శాతం మంది భిక్షాటనను వృత్తిగా ఎంచుకున్నవారే. వీరి రోజువారీ ఆదాయం రూ. 300 నుంచి రూ. 800 వరకు ఉంటుంది.
మరో సంస్థ చేసిన సర్వే ప్రకారం నగరంలో 25 వేల మంది బిచ్చగాళ్లు ఉన్నారు. వీరిలో దాదాపు 95 శాతం మంది భిక్షాటనను ఓ వృత్తిగా ఎంచుకున్నవారే. వీరిలో చాలా మంది నెలవారీ ఆదాయం రూ. 50 వేల కంటే ఎక్కువే.
ఏడాదికి హైదరాబాద్‌లో బిచ్చమెత్తుకునే వారి ఆదాయం రూ. 153 కోట్లు ఉంటుందని ఒక సంస్థ, రూ. 456 కోట్లని మరో సంస్థ అంచనా వేసింది.
పెద్దవారి కంటే పిల్లలకే ఇందులో ఎక్కువ ఆదాయం. రోడ్లపక్కన ఉన్న బిచ్చగాళ్లపై దాడులు చేసి వారి దగ్గరుండే డబ్బు దోచుకునే ముఠాలు కూడా నగరంలో ఉన్నాయి.
చాలా మంది బిచ్చగాళ్లకు భూములు, సొంత ఇళ్లు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా అందుకుంటున్నారు.
వీరిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి, కొందరు ఇతర జిల్లాల నుంచి వచ్చారు.
బిచ్చగాళ్ల ముఠా.. అక్రమ సరుకు రవాణా, డ్రగ్స్ నేరాల్లో భాగస్వాములవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
'ఇవాంకా పర్యటన కారణం కాదు'
ఇవాంకా పర్యటన నేపథ్యంలోనే నగరంలో బిచ్చగాళ్లను లేకుండా చేయడం కోసమే ఈ చర్యలు చేపట్టారని మీడియాలో వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ జైళ్ల శాఖ తాజాగా ఈ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఇవాంకా పర్యటన పూర్తయిన తర్వాత, డిసెంబర్ 1 నుంచి మళ్లీ బిచ్చగాళ్లను తరలించే పని మొదలు పెడతామని జైళ్లశాఖ ఎస్‌పీ సంపత్ తెలిపారు.
బిచ్చగాళ్లను పట్టిచ్చిన వారికి రూ. 500 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా డిసెంబర్ 25 నుంచి అమలులోకి తెస్తామని ఆయన చెప్పారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









