చిన్నపిల్లలకు గ్రోత్ హార్మోన్లు.. బ్రోకర్ల దారుణాలు

ఫొటో సోర్స్, Getty Images
అమ్మాయిలు వేగంగా పెద్దమనుషులైతే, వాళ్లను త్వరగా వ్యభిచారంలోకి లాగొచ్చని బ్రోకర్లు భావిస్తున్నారు. అందుకే తమ శరీరం త్వరగా ఎదగడానికి గ్రోత్ హార్మోన్లను ఇస్తున్నట్లు కొందరు అక్రమ రవాణా బాధిత యువతులు చెబుతున్నారు.
నేపాల్‌కు చెందిన ఓ అమ్మాయిని వ్యభిచారంలోకి లాగేందుకు ఎనిమిదేళ్ల వయసులో అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చారు. ఆ అమ్మాయి బీబీసీతో మాట్లాడుతూ, ‘‘నాకు రోజూ రెండుసార్లు ఎర్ర రంగులో ఉండే మందులు ఇచ్చేవారు. అవి నా ఒంటికి పడేవి కాదు. వేసుకున్న వెంటనే వాంతి చేసుకునేదాన్ని.
నేను ఆ మందులు వేసుకోనని చెబితే ఊరుకునేవాళ్లు కాదు. తిట్టీ, కొట్టీ, బలవంతంగా ఆ మందులు వేసేవాళ్లు. వాటి వల్ల నేను త్వరగా ఎదుగుతాననీ, అప్పుడు నేను ఇంటికి వెళ్లిపోవచ్చనీ చెప్పేవాళ్లు’’ అంటూ ఆ అమ్మాయి తన గురించి చెప్పింది.
నేపాల్‌కు చెందిన ఆ అమ్మాయిది చాలా పెద్ద కుటుంబం. ఆమె తల్లిదండ్రులకు ఎనిమిది మంది పిల్లలు. ఆ కుటుంబ నిస్సహాయతను గమినించిన ఓ మహిళ, ఈ అమ్మాయిని తనతో పంపిస్తే మంచి చదువు చెప్పిస్తానని తల్లిదండ్రుల్ని ఒప్పించింది.



ఫొటో సోర్స్, Getty Images
ఆ మహిళ కొన్నాళ్లు ఆ అమ్మాయిని నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉంచింది. ఆ తరవాత ఆమెను భారత్‌లో ఉంటోన్న ఓ నేపాలీ కుటుంబం దగ్గరికి తీసుకొచ్చింది. అక్కడ ఆ అమ్మాయిని పనిమనిషిలా వాడుకున్నారు. రెండేళ్ల తరవాత మళ్లీ ఆ అమ్మాయిని భారత్‌లోని మరో నగరానికి తీసుకొచ్చారు.
‘‘అక్కడ కూడా రెండేళ్లపాటు ఓ నేపాలీ కుటుంబంతోనే ఉన్నా. ఆ ఇంట్లోనే నన్ను ఆ మందులు వేసుకోమని ఒత్తిడి చేశారు. కొన్నాళ్లకు నన్నో చెడ్డ ఇంటికి(వేశ్యా గృహానికి) పంపించారు. అక్కడ అందరికంటే నేనే చిన్నపిల్లని.
నేను ఆ ఇంటికి వెళ్లనని గొడవచేసేదాన్ని. కానీ కొట్టి మరీ బలవంతంగా నన్నక్కడికి పంపేవారు. నన్ను కొనడానికి ఖర్చు చేసిన డబ్బులు తిరిగి రావాలంటే నేనా పని చేయాల్సిందే అనేవారు. నా అదృష్టం కొద్దీ ఓ రోజు అక్కడ పోలీసులు రెయిడ్ చేశారు. దాంతో ఆర్నెల్ల తరవాత ఆ నరకం నుంచి బయటపడ్డా’’ అంటూ ఆ అమ్మాయి తన అనుభవాల్ని పంచుకుంది.
మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేసే సంఘాలు, పోలీసు బలగాలు ఎక్కువగా భారత్-నేపాల్ సరిహద్దు దగ్గర నిఘా పెట్టాయి. దాంతో బ్రోకర్లు చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘మైటీ నేపాల్’ సంస్థ డైరెక్టర్ బిశ్వోరామ్ ఖడ్కా అంటున్నారు.
‘యుక్త వయసులో ఉన్న అమ్మాయిలతో కలిసి సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తే పోలీసులు వెంటనే అనుమానించి ప్రశ్నిస్తున్నారు. అదే చిన్న పిల్లలైతే ఎవరికీ ఏ అనుమానం రాదు. ఒక వేళ వచ్చినా ఆ అమ్మాయి తమ కూతురేనని చెప్పి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు’ అంటారు ఖడ్కా.
ఎక్కువగా పేద పిల్లల్నే బ్రోకర్లు లక్ష్యంగా చేసుకుంటారనీ, పిల్లలకు మంచి చదువు చెప్పిస్తామని నమ్మించి తల్లిదండ్రుల్ని బుట్టలో వేసుకుంటారానీ ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వేగంగా ఎదగడం కోసం అమ్మాయిలకు హార్మోన్లు ఎక్కించిన ఘటనలు తన దృష్టికీ వచ్చాయని సునీత దనువార్ చెబుతున్నారు. అక్రమ రవాణా బాధిత యువతుల కోసం ఆమె ‘శక్తి సమూహ’ పేరుతో ఓ సంస్థను నడుపుతున్నారు.
‘నాకు తెలిసిన ఓ అమ్మాయిని తొమ్మిదేళ్ల వయసులో తీసుకెళ్లిపోయారు. రెండు నెలల తరవాత ఆమె తిరిగొచ్చింది. కానీ ఆమె శరీరాకృతి పూర్తిగా మారిపోయింది. చూడ్డానికి చాలా పెద్ద అమ్మాయిలా కనిపించింది కానీ గొంతు మాత్రం చిన్న పిల్ల మాదిరిగానే ఉంది’ అని ఆమె చెప్పారు. సాధారణంగా 9-12ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకే ఈ గ్రోత్ హార్మోన్స్ నిండిన మందుల్ని ఇస్తారని ఆమె చెబుతున్నారు.
‘ఈ మందుల వల్ల చిన్న పిల్లల శరీరాకృతి కూడా యుక్త వయసులో ఉన్న అమ్మాయిల తరహాలో మారిపోతుంది. దీనివల్ల వారికి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వారి ఎముకలు, గర్భాశయంలో సమస్యలు ఎదురవుతాయి’ అని డాక్టర్.అరుణా ఉప్రేటి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఓసారి ఓ కాన్ఫెరెన్స్‌లో పాల్గొనడానికి భారత్‌కు వచ్చా. అక్కడొక అమ్మాయి చూడ్డానికి చిన్నగా ఉంది కానీ, ఆమె వక్షోజాలు మాత్రం చాలా పెద్దగా కనిపించాయి. తనను చిన్న వయసులోనే తీసుకెళ్లి గ్రోత్ హార్మోన్లు ఇచ్చారు. ఆ అమ్మాయి పెద్దగా కనిపించే వరకూ మందులిచ్చి, ఆ తరవాత వ్యభిచారంలోకి దింపారు’ అని అరుణ చెప్పారు.
నేపాల్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా అయ్యే అమ్మాయిల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. నేపాల్ పోలీసు శాఖ గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో వారికందిన ఫిర్యాదుల సంఖ్య 181 నుంచి 268కి చేరింది. వీటిలో 80శాతం ఫిర్యాదులను మహిళలే చేశారు.
ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు, ఐరోపా, అమెరికా దేశాల్లో శాశ్వత పని లాంటి ఆశలు చూపి నేపాల్ యువతులకు అక్రమ రవాణాదార్లు ఎరవేస్తున్నారని నేపాల్ పోలీస్ శాఖ అధికార ప్రతినిధి శైలేష్ థాపా క్షేత్రి చెప్పారు. కానీ ఇలా అమ్మాయిలకు గ్రోత్ హార్మోన్లు ఇస్తున్నట్లు తమకెలాంటి ఫిర్యాదులు అందలేదని ఆయన అన్నారు.
కేవలం చట్టాలతో ఈ సమస్య దూరం కాదనీ, సరైన అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తేనే అమ్మాయిలు ఈ ఉచ్చు నుంచి బయటపడే అవకాశం ఉందన్నది కొందరు స్వచ్ఛంద కార్యకర్తల అభిప్రాయం.
ఇవి కూడా చదవండి
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
- వండర్ గర్ల్ హిమాదాస్ పోలీసు స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది
- ‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
- బీదర్‌లో హైదరాబాదీ హత్య: ‘అనుమానం వస్తే ఇంత దారుణంగా కొట్టి చంపేస్తారా?’ BBC Special రిపోర్ట్
- క్యాన్సర్‌తో చనిపోయే ముందు స్వీయ సంస్మరణ రాసిన బాలుడు.. ప్రపంచాన్ని కదిలించిన మాటలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








