#గ్రౌండ్‌రిపోర్ట్: ఉద్దానం - ఎవరికీ అంతుబట్టని కిడ్నీ వ్యథలు
- రచయిత, శ్యాంమోహన్
- హోదా, బీబీసీ కోసం
''ఇంత కాలం మీరంతా ఏటై పోనారు? అల్లా సికాకుళం సివర, వజ్రపు కొత్తూరు నుంచీ ఇచ్చాపురం దాకా జనాలు సచ్చిపోతన్నా, ఎందుకో ఎవుడూ సరిగా సెప్పడు... వేలాది జనాలు పేనాలు ఒగ్గీసినారు.. ఇదింకా ఆగనేదు...''
ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని సముద్రపు ఒడ్డునున్న కళింగపట్నంలో మహిళల ఆవేదన. తరచుగా మీడియావాళ్లు ఈ గ్రామాన్ని సందర్శిస్తుండటంతో వారి స్పందన ఇది.
ఉద్దానం అంటే ఉద్యానవనం!
పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం ఒక వైపున సముద్ర తీరం, మరో పక్క కొబ్బరి, జీడి మామిడి, పనస, మామిడి తోటలు, మరో వైపున నాగావళి, వంశధార, మహేంద్రతనయ వంటి జీవ నదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉండటంతో ఈ ప్రాంతానికి ఉద్దానం అనే పేరొచ్చింది.
అయితే ఆకుపచ్చని ఉద్దానం, ఇప్పుడు కిడ్నీ వ్యాధులతో వణికిపోతోంది. అంతుపట్టని సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు.
ఈ ప్రాంతంలోని సోంపేట, కవిటి, కుసుంపురం, కుత్తుమ, కళింగ పట్నం సహా ఏ గ్రామానికి వెళ్లినా, ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలలో ఇప్పటివరకు 15,623 మంది ఇలా తీవ్రమైన కిడ్నీ జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 13,093 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

ఫొటో సోర్స్, BBC/shyam mohan
కదిలిస్తే కన్నీళ్లే...
''అయిదేళ్లుగా నేను, నా భర్త సీతారాం కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నాం. ఏడాది క్రితం ఆ జబ్బు ముదిరి ఆయన మాకు దూరమయ్యాడు. ఇపుడు నా కొడుకే కూలీ పనులు చేస్తూ నన్ను పోషిస్తున్నాడు. మందులకు నెలకు రూ. రెండు వేలకు పైగా ఖర్చవుతుంది. వాటికోసం అప్పులు చేయాల్సి వస్తోంది'' అంటూ దీనంగా చెప్పారు కుసుంపురం గ్రామానికి చెందిన బత్తిన మాలక్ష్మి.
''ఏడాది నుంచి ఈ రోగంతో కుదేలయిపోతున్నాను. కొడుకు తప్ప మాకు ఏ దిక్కూ లేదు. సముద్రంపై వేటకు వెళ్లి నాలుగు డబ్బులు తెచ్చేవాడు. ఈ మధ్య యాక్సిడెంట్‌లో చేయి కోల్పోయి వాడు మూలనపడ్డాడు. ఇపుడు మందులు కొనుక్కునే స్తోమత లేదు, ఎవరూ ఆదుకునే దిక్కులేదు'' అంటూ కళింగపట్నంకు చెందిన శివకోటి దానమ్మ విలపించారు.

ఫొటో సోర్స్, BBC/Shyam mohan
ఇదే గ్రామానికి చెందిన ఈగ కోమలమ్మ మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కూలీనాలీ చేసుకొని బతుకుతూ, సగం ఆదాయం డాక్టర్ల చుట్టూ తిరగడానికే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
డాక్టర్లు బలవర్ధకమైన ఆహారం, క్రమం తప్పకుండా మందులు వాడమన్నారు. కానీ ఆర్థిక స్తోమతలేక డబ్బులున్నపుడే మందులు వాడుతున్నారు కోమలమ్మ.
సోంపేటలో కర్రి గణపతి, కాసమ్మ, కవిటిలో అర్జి శశి, తెప్పల తులసమ్మ, కంచిలిలో నారాయణ... ఇలా ఎవరిని కదిలించినా హృదయాన్ని పిండేసే దీన గాథలే వినిపిస్తాయి.
పేదరికం కారణంగా కొందరు ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ గుర్తించినప్పటికీ నాటు వైద్యుల వద్దకు వెళ్లి, తాత్కాలికంగా నొప్పి నివారణకు మందులు వేసుకోవడంతో ఈ జబ్బు మరింత తీవ్రమైపోతోంది.
ఆ సమస్య ఏమిటో.. అది ఎందుకొచ్చిందో వీళ్లకే కాదు, పరిశోధకులకు, ప్రభుత్వాలకు కూడా అంతుపట్టడం లేదు.

ఫొటో సోర్స్, BBC/shyam mohan
సామాజిక కోణం
ఉద్దానం ప్రాంతంలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేవు.
డయాలసిస్ చేయించుకునే రోగికి మరొకరు తోడు ఉండాలి. రోజుకూలీతో పొట్ట నింపుకునే పేదలకి అది పెద్ద భారమే. ఈ కారణంగా డయాలసిస్ వాయిదా వేసుకునేవారు, మందుల ఖర్చు భరించలేక క్రమ పద్ధతిలో వాడనివారు అనేకమంది ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో తక్షణం వ్యాధి లక్షణాలు తగ్గితే చాలు అనుకుంటారు. పైపెచ్చు నాటు వైద్యులు మిడిమిడి జ్ఞానంతో ఇచ్చే మందులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ సంబంధాలపై 'ఉద్దానం సమస్య' ప్రభావం తీవ్రంగా ఉంది.
''కిడ్నీ సమస్య వెలుగులోకి వచ్చాక మా ప్రాంతపు వారితో చుట్టరికం కలుపుకోవడానికి వెనకాడుతున్నారు. కొబ్బరి, మామిడి పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు'' అని కుత్తుమ(కంచిలి మండలం) రైతులు చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/shyam mohan
ఒక్క గ్రామంలో 500 రోగులు
కవిటి మండలం, కుసుంపురం గ్రామం కొబ్బరి, జీడిమామిడి తోటలతో పచ్చగా ఉంటుంది. కానీ ఇక్కడి మనుషుల్లో 'జీవం' కనిపించదు.
ఈ గ్రామంలోకి అడుగు పెట్టిన మమ్మల్ని కిడ్నీబాధితులంతా చుట్టుముట్టారు.
''మా ఊరి జనాభా 4 వేలు. ఐదొందలకు పైగా కిడ్నీ రోగులున్నారు. అపుడపుడు అధికారులు వచ్చి మా వివరాలు అడిగి పోతుంటారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. అందరం ఉపాధి హామీ పనుల మీద ఆధారపడి బతుకుతున్నాం. కిడ్నీ సమస్యలున్న మాకు ఉపాధి కూలీ రెట్టింపు చేస్తే, మందులు కొనుక్కొని ప్రాణాలు నిలుపుకుంటాం'' అని అన్నారు డ్వాక్రా పొదుపు సంఘం నాయకురాలు సిందుల ఇంధిర.

ఫొటో సోర్స్, BBC/shyam mohan
సమస్యను గుర్తించిన డాక్టర్లు వీళ్లే
ఇక్కడి ప్రజలు విచిత్రమైన కిడ్నీ వ్యాధికి గురవుతున్నారని సోంపేటలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ వై. కృష్ణమూర్తి, డాక్డర్ శివాజీ 1993లోనే అనుమానం వ్యక్తం చేశారు.
''సాధారణంగా వచ్చే కిడ్నీ వ్యాధికి భిన్నంగా ఇక్కడి ప్రజలకు ఈ వ్యాధులు ఉండడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా బీపీ, షుగర్ వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ వ్యాధి వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో ఆ రెండూ లేనివారికి కూడా రావడం అంతుపట్టని విషయం. రోజూ మా ఆసుపత్రికి ఆరవై మందికి పైగా పేషెంట్లు వస్తారు. వారిలో కనీసం 3 నుంచి ఐదుగురు వరకు కిడ్నీ రోగులు ఉంటారు'' అని డాక్టర్ కృష్ణ మూర్తి చెప్పారు.
ఈ ప్రాంత ప్రజల్లో 37% మందికి కిడ్నీ వ్యాధి ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడా సంఖ్య 40 శాతానికి చేరిందని ఆయన వివరించారు.
సోంపేట పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమంలో డాక్టర్ కృష్ణ మూర్తి కీలక పాత్ర వహించారు.

ఫొటో సోర్స్, BBC/shyam mohan
ఏడు మండలాలకు రెండే డయాలసిస్ కేంద్రాలు!
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఈ ప్రత్యేక వ్యాధికి 'క్రానిక్ కిడ్నీ డిసీజ్' అని పేరు పెట్టింది. ''ఉద్దానం నెఫ్రోపతి'' అని కూడా దీనిని పిలుస్తున్నారు.
ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో 13,093 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండగా.. కొత్తగా రోజుకు 9 నుంచి 12 కేసులు నమోదు అవుతున్నాయని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 5 ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఉద్దానం ప్రాంతం మొత్తంలో.. అంటే 7 మండలాలకు కలిపి 2 కేంద్రాలు ఉన్నాయి.
కిడ్నీ వ్యాధి స్క్రీనింగ్ కేంద్రాలు రెండు ఉన్నాయి.
361 మంది కిడ్నీ బాధితులు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకుంటున్నారు.
''మేం 2017లో లక్ష మందికి పరీక్షలు చేయగా 13,900 మందికి కిడ్నీ వ్యాధులున్నట్టు తేలింది. ప్రభుత్వ అసుపత్రుల్లో డయాల్సిస్ చేయించుకునే వారికి మాత్రమే రూ. 2,500 పెన్షన్ ఇస్తున్నాం. ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాలకు కలిపి రెండు డయాల్సిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఒకటి పలాసలో, రెండోది సోంపేటలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెండు, టెక్కలిలో మరోటి ఉన్నాయి. ఉద్దానం ప్రాంతానికి సమీపంలోనే టెక్కలి ఉంది. కాబట్టి బాధితులు అక్కడికి కూడా వెళ్లి డయాలసిస్ చేయించుకోవచ్చు'' అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డా.ఎస్.తిరుపతిరావు చెప్పారు.
పుష్కరాలకు ఖర్చు చేస్తారు కానీ ఇది పట్టదా?
''ఇరవై ఏళ్లుగా ఒకే ప్రాంతంలో విస్తరించిన కిడ్నీవ్యాధి, కేవలం వైద్యరంగ సమస్య మాత్రమే కాదు, ఇది ఆందోళనకరమైన సామాజిక సమస్య. పుష్కరాలకూ, ఇతర కార్యక్రమాలకూ కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒలింపిక్ విజేతలకు కోట్ల రూపాయలు నజరానాలు ఇస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకు వచ్చిన సమస్య పట్ల మాత్రం ఎందుకు ఇంత అలక్ష్యం?'' అని ప్రశ్నిస్తున్నారు తిరుపతిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు, డాక్టర్ పి. కృష్ణ ప్రశాంతి.
''న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చంఢీగడ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన అండ్ రీసెర్చ్ సంస్థల్లో 40 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధుల మీద విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సంస్థల సేవలను ఉద్దానంలో వినియోగించుకోవచ్చు'' అని కృష్ణ ప్రశాంతి అన్నారు.

ఫొటో సోర్స్, BBC/shyam mohan
మరో నాలుగు గ్రామాల్లోనూ ఆనవాళ్లు: పరిశోధకుడి హెచ్చరిక
వ్యవసాయంలో అధికంగా వినియోగిస్తున్న రసాయన ఎరువులే ఈ సమస్యకు కారణమవుతున్నాయంటున్నారు పర్యావరణ వేత్త, పరిశోధకుడు మనోజ్ నలనాగుల.
కిడ్నీ సమస్యలపై అయిదేళ్ల క్రితం పరిశోధన ప్రారంభించిన మనోజ్ కొన్ని కీలకాంశాలను వివరించారు.
''ఉద్దానంలో కిడ్నీసమస్యలకు కారణమని భావిస్తున్న భార లోహాలు, జెనిటిక్స్, సముద్రతీర ప్రాంతం వంటి అంశాలపై పరిశోధన చేశాను. కాంటూర్ మ్యాప్‌లో ఉద్దానం తరహా భౌతిక పరిస్థితులున్న ప్రాంతాలను పరిశీలిస్తుండగా, ఒక ఆశ్చర్యకరమైన విషయం నా దృష్టికి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పరిధిలోని రేగడి మండలంలో 90 గ్రామాలను పరిశీలించగా అందులో నాలుగు గ్రామాలు ఉద్దానం తరహాలో ఉండటం గమనించాను. అంబకండి, సోమరాజు పేట, చింతల పేట, అప్పల అగ్రహారం గ్రామాలను సందర్శించాను. ఈ ఊళ్లలో సుమారు ఆరు వేల మందిలో 1,300 మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/shyam mohan
ఎగువన వ్యవసాయం ... దిగువన గ్రామాలు
''ఈ 4 గ్రామాలు పుటాకారంలో ఉంటాయి. ఇక్కడి వ్యవసాయ భూములన్నీ ఎత్తు ప్రదేశాల్లో ఉంటే, ఇళ్లన్నీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. కొబ్బరి, జీడిమామిడి, మామిడి పంటలకు వినియోగిస్తున్న రసాయనాలు నేరుగా లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల బోరు బావుల్లోకి చేరుతున్నాయి. ఆ నీటిని వంటకు, తాగడానికి ప్రజలు వాడుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినడానికి ఇదే మూలం'' అనేది మనోజ్ విశ్లేషణ.
జియోగ్రాఫికల్ మ్యాప్స్‌కి అభివృద్ది రూపమే కాంటూర్ మ్యాప్స్. ఒక ప్రాంతానికి సంబంధించిన ఎత్తు, పల్లం, ఇతర వివరాల సమగ్ర సమాచారం ఈ మ్యాప్‌లు అందిస్తాయి.
మనోజ్ పరిశోధక పత్రాన్ని రీసెర్చ్ గేట్ అనే అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది.

ఫొటో సోర్స్, BBC/shyam mohan
భూ ఉపరితల జలాలే పరిష్కారం
ఈ కిడ్నీ సమస్యను అధిగమించాలంటే బయట ప్రాంతాల నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవటం ఒకటే మార్గమని 'ఉద్దానం ఫౌండేషన్' ప్రతినిది డా. పూడి రామారావు అంటున్నారు.
సమీపంలోనే వంశధార, మహేంద్రతనయ వంటి నదులు ఉన్నప్పటికీ ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా ఉద్దానం ప్రజలకు అందించడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోక పోవడం ఇక్కడి ప్రజలను నిరాశ పరుస్తోంది.
మొదలైన పరిశోధన
కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు విశాఖ విమ్స్ ఆసుపత్రిలో జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆధ్వర్యంలో పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు.
కిడ్నీ సమస్యలు పెరుగుదలకు కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలకు, ఉద్దానం ప్రాంతానికి గల తేడాలను పరిశీలిస్తామని పరిశోధకులు అంటున్నారు.
ముఖ్యంగా ఫ్లోరైడ్, జీడితోటలకు ఉపయోగించే రసాయనాలు సమీపంలోని నీటిలోకి చేరడం తదితర కారణాలతో కిడ్నీ వ్యాధుల సంఖ్య పెరుగుతున్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/shyam mohan
పరిష్కార మార్గాలు
ఈ సమస్య పరిష్కారానికి వైద్యులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్ధానిక సర్పంచ్‌లు, పాత్రికేయులు తమ సూచనలను పంచుకున్నారు. అవి..
- మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్టీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల పీజీ విద్యార్ధుల సేవలను ఆ ప్రాంతంలో వినియోగించుకోవాలి.
- వంశధార, మహేంద్రతనయ నదీ జలాలను పైపు లైన్ల ద్వారా ఉద్దానం ప్రాంత వాసులకు అందించాలి.
- రసాయనాలు లేని సేంద్రీయ పంటలను రైతులు పండించాలి.
- జంతువులలో కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయా?, ఆవులు, గేదెలు, వాటి పాలద్వారా సంక్రమిస్తున్న రోగాల గురించీ పరిశోధనలు చేయాలి. కోళ్ళు, చేపలు, మేకలు వాటి మాంసం మీద పరిశోధనలు జరగాలి.
- ఉద్దానం ప్రాంతంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి, నిపుణులను నియమించాలి. కోటి రూపాయల ఖర్చుతో పది డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయవచ్చని వైద్యులంటున్నారు.
- పౌష్టికాహార నిపుణుల పర్యవేక్షణలో ఉద్దానంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రత్యేక ఆహారం అందే ఏర్పాటు చేయాలి. కిడ్నీ రోగులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలి.
హార్వర్డ్ వైద్య బందం ఎక్కడ?
ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన మూత్రపిండాల వ్యాధి నిపుణుడు డాక్టర్ జోసెఫ్ బోన్ వెంట్రీ నాయకత్వంలో హార్వర్డ్ వైద్య బందం కిడ్నీ బాధితులతో, ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకుంది. ఉద్దానంలో పర్యటించిన ఈ బృందానికి ప్రభుత్వం నుండి సహకారం లేక పోవడం వల్ల వారి పరిశోధన అక్కడే ఆగి పోయిందని సోంపేట వైద్యులు బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
- తెలుగు భాష ఎప్పటిది? ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









