నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య: ‘‘తగ్గుతోంది, కానీ చేయాల్సింది చాలా ఉంది’’

ఫొటో సోర్స్, Naveen Kumar/BBC
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ప్రతిసారి హామీలు ఇస్తాయి. అయితే సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత ఇప్పుడెలా ఉంది.. పరిష్కారంలో పురోగతి లాంటి అంశాలను బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
"13 ఏళ్ల వయసున్నప్పుడు నా కాళ్లు వంకర కావడం మొదలైంది. మెల్లిగా నేను బలహీనపడ్డాను" అంటూ ఆరుపుళ్ళ సైదులనే 35 ఏళ్ల 'స్కెలెటిల్ ఫ్లోరోసిస్' బాధితుడు బీబీసీతో తన బాధను పంచుకొన్నారు.
నల్లగొండ జిల్లా నెరలపల్లి గ్రామానికి చెందిన సైదులుకు 2010లో అనితతో పెళ్లయింది. తమ ఇద్దరు పిల్లలతోపాటు సైదులుకు అన్నం పెట్టడం, స్నానం చేయించడం కూడా భార్య అనితే చేస్తారు.
హైదరాబాద్‌లో తన కాళ్లకు రీకన్‌స్ట్రక్షన్ చేయించుకున్న తర్వాత సైదులు నడవగలుగుతున్నారు. కానీ ఆరోగ్యకర జీవితానికి ఇంకా చాలా దూరంగా ఉన్నారు.
అనిత రోజూ కూలీకి వెళ్లి తెచ్చే 200-250 రూపాయలతోనే కుటుంబం బతకాలి. ఇలాంటి సమస్యలున్న సైదులు లాంటి ఎంతో మందికి పోషకాహారం అందడం చాలా పెద్ద సమస్య. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండే నల్లగొండ లాంటి ప్రాంతాల్లో పోషకాహార లోపం ఫ్లోరోసిస్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని 31 మండలాల్లో 30 మండలాలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నాయి. 11 మండలాల్లో సమస్య తీవ్రంగానూ, మిగిలిన 19 మండలాల్లో ఓ మోస్తరుగానూ ఉందని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
నల్లగొండ జిల్లాలో 1945లో తొలిసారిగా ఫ్లోరోసిస్ కేసును గుర్తించారు. అప్పట్నుంచి ఫ్లోరోసిస్ ఈ జిల్లాకు చారిత్రక సమస్యగా మిగిలిపోయింది. ఫ్లోరైడ్ కోరల్లో చిక్కుకుని ఈ ప్రాంతం విలవిల్లాడుతోంది.
జిల్లాలో గత మూడేళ్ల కాలంలో కొత్తగా స్కెలెటల్ ఫ్లోరోసిస్ కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Naveen Kumar/BBC
ఫ్లోరోసిస్ ఎందుకు వస్తుంది?
సుదీర్ఘ కాలం పాటు శరీరంలోకి ఫ్లోరైడ్ వెళ్లడం వల్ల ఫ్లోరోసిస్ సమస్య వస్తుంది. తాగునీరు, ఆహారం, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా ఇది శరీరంలోకి చేరుతుంది. తీవ్రస్థాయిలో ఫ్లోరైడ్ ఉన్న నీటిని నిరంతరం తాగుతూ ఉంటే డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలెటల్ ఫ్లోరోసిస్ సమస్యలు వస్తాయి. అంతేకాదు ఆ వ్యాధుల వల్ల ఎదుగుదల ఆగిపోతుంది. శాశ్వత దుష్ప్రభావాలు ఉంటాయి.
ఈ అంశంపై వైద్య నిపుణుడు డాక్టర్ రాజారెడ్డి బీబీసీతో మాట్లాడుతూ- "ఫ్లోరైడ్ అధిక శాతం ఉన్న నీరు తాగడం, పోషకాహారం లేకపోవడం సమస్య తీవ్రతకు కారణాలు. దీనివల్ల ముఖ్యంగా ఎముకలు ఎదగకపోవడం, వంకరగా పెరగడం, ఎముకల మధ్య కాల్షియం లవణాలు పేరుకుపోవడం వంటివి జరుగుతాయి. తర్వాతి దశలో వెన్నుపూస కుంచించుకుపోవడం వల్ల మంచానికే పరిమతమై, మరణం సంభవిస్తుంది'' అన్నారు.
ఆయన అపోలో ఆస్పత్రిలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్నారు. ఫ్లోరోసిస్ బాధితుల కోసం ఆయన కృషి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, NAveen Kumar/BBC
మంచి ఆహారం కంటే ఇతర ఖర్చులకే ప్రాధాన్యం
''నల్లగొండ వైపు ప్రయాణిస్తుంటే పత్తి చేలు బాగా కనిపిస్తాయి. అక్కడక్కడా వరిమళ్లు ఉంటాయి. పంట బాగా పండినప్పుడు కూడా రైతులు ఆ డబ్బును మంచి ఆహారం కంటే, ఇతర ఇంటి ఖర్చుల కోసమే వాడతారు'' అని పోషకాహార నిపుణులు సునీతా సాపూర్ తెలిపారు.
ఆమె నల్లగొండలో 'న్యూట్రిషన్ గార్డెన్' అనే ప్రాజెక్టు వ్యవహారాలు చూస్తున్నారు.
"నల్లగొండ వాణిజ్య పంటల ప్రాంతం. ఇక్కడ అంతర పంటలు కూడా ఉండవు. దీంతో ఆహారాన్ని తప్పనిసరిగా మార్కెట్ నుంచి కొనాల్సి వస్తుంది. సాధారణంగా పోషకాహారాన్ని ప్రత్యేకంగా కొనడానికి జనం ప్రాధాన్యం ఇవ్వరు. వారి పొలంలోనే పండించేట్లు చేస్తే పోషకాహార సమస్య కూడా తీరుతుంది" అని సునీత వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
చేపట్టిన చర్యలు ఏమిటి?
నల్లగొండలో 25 ఎకరాల్లో రూ.436 కోట్లతో కడుతున్న ప్లాంటు తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం అంటోంది.
ఈ ప్లాంటు నుంచీ 585 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు నీరు అందుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
నల్లగొండలో ఐక్యరాజ్యసమితి బాలల నిధి(యూనిసెఫ్) సమకూర్చిన నిధులతో 2013లో జిల్లా ఫ్లోరైడ్ మానిటరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు.
నిరుడు డిసెంబరుతో యూనిసెఫ్ నుంచి నిధుల ఏర్పాటు పూర్తయింది.
ఉద్యమకారులు ఏమంటున్నారు?
ఫ్లోరోసిస్ కేసులు తగ్గినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని నల్లగొండలోనే ఉంటూ ఫ్లోరైడ్ బాధితుల కోసం ఉద్యమించే కార్యకర్త సుభాష్ చెప్పారు.
"ఇప్పటికీ నీటి సరఫరా సరిగా లేదు. నీటి నిల్వకు చెరువులున్నాయి, శుద్ధి ప్లాంట్లున్నాయి కానీ అవి శాశ్వత పరిష్కారం కాదు. పరిశోధన కేంద్రం, ఫ్లోరైడ్ బాధితుల కోసం 300 పడకల ఆస్పత్రి ఏర్పాటు లాంటి పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది ప్రభుత్వం. కానీ వాటిని ఇంకా నెరవేర్చలేదు'' అంటూ ఆయన విచారం వ్యక్తంచేశారు.
"రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని జీవన్మరణ సమస్యగా చూడాలి తప్ప ఓటు బ్యాంకుగా కాదు. మేం అడిగేది ఒక్కటే- తాగడానికీ, వ్యవసాయానికీ నీరు" అని చెప్పుకొచ్చారు సుభాష్.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?
- 2017 డిసెంబరు నాటికి భారత్‌లో దాదాపు కోటి మంది ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాధితుల సంఖ్య దాదాపు 10 లక్షలు.
- 2014 నాటి లెక్కలతో పోలిస్తే 2017 నాటికి భారత్‌లో ఫ్లోరైడ్ బాధితుల సంఖ్య 17 లక్షలు తగ్గగా, తెలంగాణలో ఐదు లక్షలు తగ్గింది.
- దీర్ఘకాలిక ఫ్లోరోసిస్ తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లోనూ తీవ్రంగానే ఉంది.

ఫొటో సోర్స్, NAveen Kumar/BBC
- నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల సమస్య వచ్చింది. భారత ప్రమాణాల విభాగం(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) లెక్కల ప్రకారం లీటరు నీటిలో ఒక పీపీఎం(పార్ట్స్ పర్ మిలియన్) లేదా ఒక మిల్లీగ్రామ్ ఫ్లోరైడ్ ఉండవచ్చు. నల్లగొండ భూగర్భ జలాల్లో 10.97 పీపీఎం ఫ్లోరైడ్ ఉందని 2016 డిసెంబరు నాటి జిల్లా భూగర్భ జలాల నాణ్యత గణాంకాలు చెబుతున్నాయి.
- దేశవ్యాప్తంగా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 11వ పంచవర్ష ప్రణాళిక(2007-12)లో 'జాతీయ ఫ్లోరోసిస్ నివారణ, నియంత్రణ కార్యక్రమం(ఎన్‌పీపీసీఎఫ్)' చేపట్టింది.
- నీతి ఆయోగ్ సిఫార్సుతో దేశంలోని 12,014 ఫ్లోరైడ్ ప్రభావిత, 1,327 ఆర్సెనిక్ ప్రభావిత ఆవాసాలకు అవసరమైన మంచి నీటి శుద్ధి ప్లాంట్ల నిమిత్తం 2016 మార్చిలో రూ.800 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం నిరుడు డిసెంబరులో తెలిపింది.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









