అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు భాష ఎప్పటిది.. ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?

ఫొటో సోర్స్, facebook/Suresh Kolichala
ద్రవిడ భాషా కుటుంబం 4,500 సంవత్సరాల క్రితమే మనుగడలో ఉందా? అంటే అవుననే అంటోంది ఓ అధ్యయనం.
ఆ అధ్యయన వివరాలనువార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దాని ప్రకారం
అంతర్జాతీయ పరిశోధకుల బృందం ద్రవిడ భాషా కుటుంబ చరిత్రపై ఓ అధ్యయనం చేసింది..
ఆ బృందంలో.. జర్మనీకి చెందిన ‘మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ’, భారత్‌లోని ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’కు చెందిన పరిశోధకులు ఉన్నారు.
ఈ పరిశోధనా పత్రాన్ని ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్’ పత్రికలో ప్రచురించారు.
ద్రవిడ, ఇండో-యూరోపియన్, సినో-టిబెటన్.. ఇలా ఆరు భాషా కుటుంబాలకు చెందిన 600 భాషలకు దక్షిణాసియా పుట్టినిల్లు అని చెప్పవచ్చు.
ద్రవిడ భాషా కుటుంబంలో మొత్తం 80 రకాల భాషలు (భాషలు, యాసలు కలిపి) ఉన్నాయి. దక్షిణ భారతం, మధ్య భారతం, పొరుగు దేశాల్లో ప్రజలు ఈ భాషలు మాట్లాడుతారు.
ద్రవిడ కుటుంబంలోని ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలు అత్యంత ప్రాచీన సాహిత్య సంపదను కూడా కలిగివున్నాయి.
సంస్కృతం లాగే తమిళ భాష కూడా పురాతనమైనది. తమిళ భాషా సంప్రదాయంలో ప్రాచీన కాలంలోని శాసనాలు, సాహిత్యానికి, వర్తమాన తమిళ భాషకూ సామీప్యత ఎక్కువ.
''యూరప్ ఆసియా సరిహద్దు ప్రాంతాల్లో ద్రవిడ భాష మూలాలను, చరిత్రను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇతర భాషా కుటుంబాలను కూడా ఈ ద్రవిడ భాషలు ఎంతగానో ప్రభావితం చేశాయి'' ఈ అధ్యయనంలో పాల్గొన్న, జర్మనీకి చెందిన పరిశోధకుడు తెలిపారు.
ద్రవిడ భాష ఎక్కడ పుట్టింది.. ఎట్లా విస్తరించింది అన్న అంశాల్లో ఇంకా కచ్చితత్వం రాలేదు. కానీ.. ద్రవిడులు భారత ఉపఖండ మూలవాసులేనని, 3,500 సంవత్సరాలకు పూర్వం ఇక్కడికొచ్చిన ఇండో-ఆర్యన్ల కంటే ముందే ఇక్కడ ఉన్నారన్న వాదనతో చాలామంది పరిశోధకులు ఏకాభిప్రాయాన్ని కలిగివున్నారు.

ఫొటో సోర్స్, Srikar Kashyap
గతంలో.. ద్రవిడ భాషల ప్రభావం పాశ్చాత్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేదని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు.
ద్రవిడ భాషలు ఎప్పుడు, ఎక్కడ అభివృద్ధి చెందాయి? అన్న ప్రశ్నలను శోధించడానికి.. 20 రకాల ద్రవిడ భాషల మధ్య ఉన్న ప్రాచీన సంబంధాలపై పరిశోధనలు జరిపారు. ద్రవిడ కుటుంబానికి చెందినవిగా భావిస్తున్న భాషలు మాట్లాడే స్థానికుల నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు.
ద్రవిడ భాషలు 4,000 - 4,500 సంవత్సరాలు ప్రాచీనమైనవని చెబుతున్న అధ్యయనకారులు.. అత్యాధునిక గణాంక పద్దతులను వాడారు. గతంలో జరిగిన అధ్యయనాలకంటే.. ఈ అధ్యయనం మరింత పురోగతి సాధించిందని చెప్పవచ్చు.
ద్రవిడులు ఉత్తర భారతం, మధ్య భారతం, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు విస్తరించిన కాలాన్ని, ద్రవిడుల సంస్కృతి అభివృద్ధిని చెందిన కాలాన్ని.. పురాతత్వ శాస్త్రవేత్తలు గతంలో అంచనా వేశారు.
వారు చెబుతున్న కాలంతో తాజా అధ్యయనం చెబుతోన్న కాలం సరిపోలుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ఆ సబ్బులతో మగవాళ్లలో వక్షోజాలు పెరుగుతాయా?
- ఆ దేశంలో తెలుగుకున్న క్రేజ్ అంతా, ఇంతా కాదు!
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








