జశోదాబెన్: ‘మోదీతో నాకు పెళ్లైంది, అబద్ధాలు ప్రచారం చేయకండి’

మోదీ పెళ్లి జశోదాబేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భార్య జశోదాబేన్
    • రచయిత, జయదీప్ వసంత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ఒక మహిళ అయ్యుండి కూడా ఆనందీ బెన్ అలాంటి ప్రకటన చేశారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది. మోదీతో నాకు పెళ్లైనా జనం ఇలా మాట్లాడ్డం వింటుంటే చాలా బాధగా ఉంది.’’

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ అన్న మాటలివి. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.

మోదీ 'అవివాహితుడు' అంటూ ఆనందీబెన్ చేసిన వ్యాఖ్యలపై, జశోదాబెన్ విచారం వ్యక్తం చేశారు.

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్, ఒక కార్యక్రమంలో "నరేంద్రభాయి మోదీ పెళ్లి చేసుకోలేదు, అయినా, ఆయన మహిళలు, పిల్లల బాధను అర్థం చేసుకోగలరు" అన్నారు.

మోదీ పెళ్లి జశోదాబేన్

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, మధ్య ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మోదీ అవివాతుడు అన్నారు

ఆనందీబెన్ చేసిన ఆ వ్యాఖ్యలపై, జశోదాబెన్, ఆమె కుటుంబ సభ్యులు చాలా కలత చెందుతున్నారు.

"నరేంద్ర మోదీకి పెళ్లైందని అందరికీ తెలుసు, అయినా జనం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు" అని జశోదాబెన్ అన్నారు.

ఆనందీబెన్ మాటలు పూర్తిగా అవాస్తవం అని జశోదాబెన్, ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

"రాజకీయాల కోసం నరేంద్రమోదీ, జశోదాబెన్ గురించి అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదు" అని జశోదాబెన్ సోదరుడు అశోక్ మోదీ బీబీసీ గుజరాతీకి చెప్పారు.

మోదీ పెళ్లి జశోదాబేన్

ఫొటో సోర్స్, DEEPA/EPA

ఫొటో క్యాప్షన్, జశోదాబెన్, నరేంద్ర మోదీ

ప్రధాని వివాహంపై వివాదం ఎందుకు?

నరేంద్ర మోదీ 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన వైవాహిక స్థితి గురించి ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు.

2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు తన అధికారిక అఫిడవిట్‌లో తనకు వివాహం అయ్యిందని మోదీ మొదటిసారి అంగీకరించారు.

ఆయన నామినేషన్ పత్రాల్లో, జశోదాబెన్‌ను తన భార్యగా పేర్కొన్నారు. అయితే, పాన్‌కార్డ్, ఆస్తులకు సంబంధించిన ఇతర పత్రాల్లో మాత్రం ఆమె గురించి ఎలాంటి వివరాలూ ఆయన ఇవ్వలేదు.

మోదీ పెళ్లి జశోదాబేన్
ఫొటో క్యాప్షన్, ‘నరేంద్ర మోదీకి 17 ఏళ్ల వయసులోనే జశోదాబెన్‌తో పెళ్లి చేశారు’

ఆ తర్వాత ప్రధాని మోదీ సోదరుడు సోమాభాయ్ దామోదర్ దాస్ మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పెళ్లైన కొన్ని రోజులకే నరేంద్ర మోదీ, జశోదాబెన్ విడిపోయారని అందులో తెలిపారు.

"మేం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులానికి చెందిన వాళ్లం. మా కులంలో బాల్య వివాహం ఆచారం ఉండేది. అందుకే నరేంద్ర మోదీకి 17 ఏళ్ల వయసులోనే జశోదాబెన్‌తో పెళ్లి చేశారు.

పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే, మోదీ, జశోదాబేన్ తమ వివాహ బంధాన్ని ఎప్పుడూ తెంచుకోలేదు" అని దామోదర్‌దాస్ తెలిపారు

మోదీ పెళ్లి జశోదాబేన్

ఫొటో సోర్స్, MANJUL

సుప్రీంకోర్ట్ తీర్పు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో అడిగిన వివరాలను సమర్పించాలని 2013లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది.

ఏదైనా కాలమ్ ఖాళీగా వదిలేస్తే, వారి నామినేషన్ పత్రాలు రద్దు చేసే అవకాశం ఉందని చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గురించి తెలుసుకోడానికి ఓటర్లకు పూర్తి హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నామినేషన్ పత్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా కాలమ్ ఖాళీగా వదలడానికి బదులు, అభ్యర్థులు అందులో 'నో' లేదా 'నాట్ అప్లికబుల్' అని రాయాలని చెప్పింది.

నరేంద్ర మోదీతో వివాహం జరిగినప్పుడు జశోదాబెన్ వయసు 15 ఏళ్లు ఉంటుందని చెబుతున్నారు.

మోదీ పెళ్లి జశోదాబేన్

ఫొటో సోర్స్, HTTP://NIC.IN/

విమర్శకులు మాత్రం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదని, అందుకే అందులో చేరిన తర్వాత మోదీ, జశోదాబెన్‌ను వదిలేశారని చెబుతున్నారు.

ఇంతకాలం అయినా మోదీ జశోదాబెన్‌ను తన భార్యగా స్వీకరించకపోవడం, మహిళల పట్ల ఆయనకు ఉన్న ఉదాసీన వైఖరిని సూచిస్తోందని విమర్శకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)