2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం: మోదీ కల నిజమయ్యేనా?

ఫొటో సోర్స్, PRAKASH SINGH
- రచయిత, సిరాజ్ హుసేన్
- హోదా, బీబీసీ కోసం
‘2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తాం’.. 2016లో యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఇది. ఆయన ఏ ముహూర్తాన ఈ మాట అన్నారో కానీ, ఆ తరవాత దేశంలో వ్యవసాయానికి సంబంధించిన చర్చంతా దాదాపు ఈ ప్రకటన చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది.
ప్రధాని ఆ మాట అన్న మరుసటిరోజున జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే హామీకి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తరవాత వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి డా.అశోక్ దల్వాయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ వ్యవసాయ విధానాలను విశ్లేషిస్తూ ఆ కమిటీ ఇప్పటిదాకా తొమ్మిది నివేదికలను విడుదల చేసింది. ఆచరణకు సాధ్యంకాని భవిష్యత్తు ప్రణాళికలను కూడా అందులో పొందుపరిచింది.
ప్రధాని చేసిన ప్రకటన కారణంగా రైతుల్లోనూ ప్రభుత్వంపై అంచనాలు పెరిగిపోయాయి. దాంతో వేరే అంశాలెన్ని తెరపైకి వచ్చినా ప్రధాని చేసిన ఆ వాగ్దానం నుంచి రైతుల దృష్టి మరలేట్లదు.
ఈ నేపథ్యంలో ప్రధాని చెప్పినట్లుగా అసలు 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు కావడం సాధ్యమేనా?.. అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఫొటో సోర్స్, Getty Images
2002-03, 2012-13 మధ్య కాలంలో రైతుల స్థితిగతులపై ‘నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) అధ్యయనం చేసింది. 2012-13లో దేశవ్యాప్తంగా 35వేల రైతు కుటుంబాల నుంచి సేకరించిన డేటా ప్రకారం రైతుల కనీస ఆదాయం 11.8శాతం మేర పెరిగిందనీ, దానర్థం ఆరేళ్లలో వాళ్ల ఆదాయం రెట్టింపయిందనీ ఆ సంస్థ లెక్కలు చెబుతున్నాయి.
కానీ కనీస ఆదాయానికీ, వాస్తవిక ఆదాయానికీ సంబంధం లేదనీ, అసలు ప్రభుత్వం రెట్టింపు చేయాలనుకుంటుంది కనీస ఆదాయాన్నా లేక వాస్తవిక ఆదాయాన్నా అనే దానిపై స్పష్టత కావాలనీ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
చివరికి దల్వాయ్ కమిటీ ఆ విషయంలో స్పష్టతనిచ్చింది. 2022నాటికి రైతుల వాస్తవిక తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది.
రైతుల ఆదాయం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది.
అందుకే రైతులకు తక్కువ ఆదాయం ఉన్న బిహార్, జార్ఖండ్, ఒడిశా లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఆదాయమున్న కేరళ, పంజాబ్, హరియాణా లాంటి రాష్ట్రాల్లో వారి ఆదాయాన్ని పెంచడం అంత సులువు కాదు.

ఫొటో సోర్స్, Getty Images
బిహార్‌లాంటి రాష్ట్రాల్లో రైతులకు కొన్ని పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించట్లేదు. 2015-16లో బిహార్ రైతులు 65లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే అందులో కేవలం 12.24 లక్షల టన్నులను మాత్రమే ప్రభుత్వం కనీస మద్దతు ధరను చెల్లించి సేకరించింది.
జార్ఖండ్‌లో 29లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే కేవలం 2.06లక్షల టన్నులను ప్రభుత్వం సేకరించింది.
అదే పంజాబ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 93.5లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అక్కడ మొత్తం ఉత్పత్తి 118.2లక్షల టన్నులు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా అదే బాటలో నడుస్తూ కనీస మద్దతు ధర చెల్లిస్తూ వరి, గోధుమ రైతుల నుంచి పంట కొనుగోలును పెంచితే వారి ఆదాయం 15-20శాతం మేర పెరిగే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయన్ని అందిస్తున్న పంట చెరకు. ఆ పంటను పండించే ప్రతి కుటుంబం సగటున రూ.89,430 విలువైన చెరకును ఉత్పత్తి చేస్తోందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డేటా చెబుతోంది. అదే మొక్కజొన్న రైతులు మాత్రం కేవలం రూ.9391 విలువైన పంటని మాత్రమే పండిస్తున్నారు.
కాబట్టి చెరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం దాదాపు అసాధ్యం. కానీ కనీస మద్దతు ధరతో పాటు కొన్ని రకాల ప్రోత్సాహకాల ద్వారా మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, పత్తి తదితర రైతులు ఆదాయాన్ని పెంచే వీలుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని ప్రతి ప్రాంతానికీ తమ తమ బలాలూ, బలహీనతలూ ఉన్నాయి. కాబట్టి ప్రధాని చేసిన రెట్టింపు ఆదాయ నినాదం వినడానికి బావున్నా, ఒకే విధమైన ప్రణాళికతో దేశ వ్యాప్తంగా దాన్ని సాధించడం సాధ్యం కాదు.
ఉదాహరణకు బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైతు బజార్ల పథకం లేదు. దాంతో రైతులు పంటను అమ్ముకునేందుకు మధ్యవర్తులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు ఆశించిన స్థాయిలో ఫలితాల్ని ఇవ్వట్లేదు. బిహార్‌లో అయితే రైతులకు ఎక్కడో దూరంగా ఉన్న మార్కెట్లలో తప్ప వేరే దగ్గర గోధుమలను అమ్మే అవకాశం లేదు. దాంతో చాలా తక్కువ ధరకు వారు పంటను అమ్మాల్సి వస్తోంది.
రైతులకు ఎంత పొలం ఉందనేదానిపై కూడా వాళ్ల ఆదాయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయ ఉపాధి ఉంటే తప్ప హెక్టారు కంటే తక్కువ పొలం ఉన్న రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అంత సులువు కాదు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్మాణ రంగ అభివృద్ధి కూడా మందగించడంతో వ్యవసాయ కూలీలు ప్రత్యామ్నాయ మార్గంలో డబ్బు సంపాదించి తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా లేదు.
వ్యవసాయంతో పాటు ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందితేనే వ్యవసాయంపై ఆధారపడ్డవారు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, హార్టికల్చర్, మత్స్య పరిశ్రమ తదితర రంగాలవైపు వెళ్లడం ద్వారా రైతులు తమ ఆదాయాన్ని మెరుగుపరచుకోవచ్చు. కానీ మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లను వడ్డించడాన్ని నిషేధించారు. ఆ ప్రభావం పరోక్షంగా పౌల్ట్రీ రైతులపై పడింది.
రాష్ట్రాల మధ్య పశువుల రవాణాను నియంత్రించడం కూడా రైతుల ఆదాయానికి గండి కొట్టింది.
ఇలాంటి ఎన్నో పరిణామాల కారణంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కష్టంగా కనిపిస్తున్నా, కనీసం పేద రాష్ట్రాల్లో రైతుల ఆదాయన్ని పెంచగలిగితే ప్రధాని కల కొంత వరకూ నెరవేరినట్లే అవుతుంది.
(రచయిత కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








