లబ్..డబ్బు: జీవిత బీమా తీసుకునేటపుడు ఏ విషయాలు పరిశీలించాలి?

మీరు లీనమైపోయి సినిమా చూస్తున్నప్పుడు ఒక్క సారిగా షాక్ కలిగే ట్విస్ట్ వస్తే.. ఎలా ఉంటుంది..? ఆ ట్విస్ట్ ఎప్పుడు వస్తుందో మనం ఊహించలేము. మన నిజ జీవితం కూడా అంతే. ఎప్పుడు ఏం జరిగి జీవితాలు తలకిందులవుతాయో మనకి తెలియదు.
అయితే అలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కొంతవరకు సిద్ధంగా ఉండటానికి చక్కని మార్గం.. జీవిత బీమా.
మరి ఎన్ని రకాల బీమా పథకాలు ఉన్నాయి? ఏది ఎలా ఉపయోగపడుతుంది? ఇన్సూరెన్సు పాలసీ తీసుకునేటప్పుడు ఏ విషయాల మీద దృష్టిపెట్టాలి?
సాధారణ బీమా
బీమా రెండు రకాలు సాధారణ భీమా, జీవిత భీమా.
సాధారణ బీమా అదే జనరల్ ఇన్సూరెన్స్. అంటే ఒక సంవత్సరానికో కొన్నిసార్లు గరిష్ఠంగా ఐదేళ్ల వరకు తీసుకోవచ్చు.
ఇందులోనూ పలు రకాలున్నాయి.
మోటార్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, కమర్షియల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇంటికి బీమా, మరీన్ ఇన్సూరెన్స్.. ఇలా అనేక రకాలుంటాయి.
ఇపుడు జీవిత బీమా గురించి చూద్దాం. దీన్ని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు.
- సంపూర్ణ జీవిత బీమా
- ఎండోమెంట్
- టర్మ్ ప్లాన్
- మనీ బ్యాక్ ప్లాన్
- యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్)

బీమా ఇచ్చే భరోసా ఏంటి?
ఇపుడు బీమా పథకాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తికి అతను కట్టిన ప్రీమియంకు సరిపోయే పన్ను మినహాయింపులు లభిస్తాయి.
వర్తకుల వ్యాపార నిల్వలకు బీమా ఉంటే వారికి బ్యాంకు లోన్లు చాలా సులువుగా లభిస్తాయి.
బీమా ఒక రకమైన ధైర్యాన్నిస్తుంది. పొదుపును కూడా అలవాటు చేస్తాయి.
పాలసీలను క్షుణ్ణంగా పరిశీలించండి
పాలసీ తీసుకునే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. అది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందో విశ్లేషించుకోండి. నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదవండి.
పాలసీని ఏజెంట్ ద్వారా లేదంటే ఆన్లైన్‌లోనూ కొనుగోలు చేయచ్చు.
బీమా ఉపయోగకరంగా, లాభదాయకంగా ఉండాలి. ప్రీమియం ఎక్కువ ఉండకూడదు. అలా అని మరీ తక్కువ ప్రీమియం కూడా పనికిరాదు.

ప్రీమియంను పరిశీలించండి
పాలసీ ప్రీమియంను పరిశీలించండి. పాలసీ తీసుకునే సమయంలో ఎంత ఈఎంఐ కట్టాల్సి వస్తుంది? ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? పిల్లల చదువుకు సంబంధించిన బీమా, లేదా ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ ప్లాన్.. ఇలా ఏది తీసుకున్నా ప్రీమియం కవర్‌ను లాభదాయకంగా ఉండేట్టు చూసుకోవాలి.
క్రమం తప్పకుండా సమయానికి ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తూ ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా దీనిపై అవగాహన కల్పించండి.

క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో... అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ గడచిన సంవత్సరంలో ఎన్నిఇన్సూరెన్స్ క్లెయింలను సెటిల్ చేసింది? అన్నదే ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇది ఎంత ఎక్కువగా ఉంటె ఆ కంపెనీ అంత మెరుగైనదని అర్థం.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









