లబ్..డబ్బు: దొంగతనాలు , ఫ్రాడ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి?

మీరందరు రాత్రియంబవళ్ళు కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన డబ్బు మన వాల్లెట్లు, బ్యాంకులలో ఉంచుకున్నా దొంగల భయం మనకి తెలియకుండానే మనతో పాటు ఉంటుంది.
అయితే ఇప్పుడు ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ ఎక్కువవడంతో హమ్మయ్య ఊహాజనిత ప్రపంచం అదే వర్చువల్ వరల్డ్‌లోకూడా మన డబ్బు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటోంది కాబట్టి దొంగల భయం ఉండదనుకుంటే పొరపాటే..!
టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంటే , దొంగలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. భద్రత విషయంలో మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆ ఎలక్ట్రానిక్ ధనాన్ని తస్కరించేందుకు దొంగలు రెండడుగులు ముందుకేస్తున్నారు.
ఇటువంటి బ్యాంకు ఫ్రాడ్లు, మోసాల నుంచి ఎలా మనల్ని మనంకాపాడుకోవచ్చు చూద్దాం... ఈ వారం ‘లబ్.. డబ్బు’లో..!
మన దేశంలో గత ఏడాది బ్యాంకింగ్ ఫ్రాడ్లకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యాయి తెలుసా?
దాదాపు 25,800. నిజం ఈ ఫ్రాడ్లు ఏటీఎం, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్.. ఇలా రకరకాల రూపాలలో జరిగాయి. అసలు ఇవి ఎలా జరుగుతాయో ఒకసారి చూద్దాం.
నకిలీ వెబ్ సైట్లు...
మోసగాళ్లు చాలాసార్లు అసలైన వెబ్‌సైట్లకు, డొమైన్‌లకు నకిలీలు తయారు చేస్తారు. అవిచూడటానికి అచ్చం అసలైన వెబ్‌సైట్ల లాగానే కనిపిస్తాయి. కస్టమర్ ఒక్కసారి ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తమ డీటెయిల్స్ ఇలా అక్కడ పెట్టారో లేదో మోసగాళ్లు అలా డబ్బు తీసుకుని ఉడాయిస్తారు.
ఏటీఎం ఫ్రాడ్
ఇక ఏటీఎంలలో ఫోర్జరీల గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ ముఖ్యంగా రెండు రకాల ఫ్రాడ్లు మనం చూస్తుంటాం. ఒకటి మన ఏటీఎం కార్డు దొంగిలించడం లేదా ఫేక్ ఫోన్ కాల్స్ చేసి పిన్‌తో సహా మన ఏటీఎం డీటెయిల్స్ తీసుకోవడం.
ఏటీఎం మోసాలలో సాంకేతిక మార్గం
ఇక ఏటీఎం మోసాలలో రెండో మార్గం కొద్దిగా సాంకేతికంగా జరిగేది. దీనికోసం స్కిమ్మర్, డ్రై గ్లూ లేదా వెబ్ కెమెరా లాంటివి వాడుతారు. మన ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేసే చోట కనిపించకుండా ఈ స్కిమ్మర్ అనే యంత్రాన్ని అమరుస్తారు. మనం కార్డును అక్కడ ఇన్సర్ట్ చేసిన వెంటనే మన కార్డుకు సంబంధించిన మాగ్నెటిక్ డేటా మొత్తం ఈ స్కిమ్మర్‌లో నిక్షిప్తమైపోతుంది. ఆ డీటెయిల్స్‌తో మోసగాళ్లు నకిలీ కార్డు తయారు చేయగలరు.

మీ పేరు మీద నకిలీ సిమ్ కార్డ్
సిమ్ స్వైప్ మోసం- ఇందులో మోసగాళ్లు మన నకిలీ గుర్తింపు పాత్రలతో మన మొబైల్ ఆపరేటర్ దగ్గరకు వెళ్లి, మన పేరు మీద ఒక డూప్లికేట్ సిమ్ కార్డ్ తీసుకుంటారు. అప్పుడు మన ఫోనుకు వచ్చే వన్ టైం పాస్‌వర్డ్ , ఓటీపీ తీసుకుని ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ చేసి మన బ్యాంకు అకౌంట్లు గుల్లచేస్తారు.
నకిలీ కాల్స్ చేసి సీవీవీ, ఓటీపీ వివరాలు అడగడం
ఇవి మనలో చాలా మంది చూసుంటారు. ఫలానా బ్యాంకు నుంచి అని మనకు నకిలీ ఫోన్ కాల్స్ చేసో లేదా ఈమెయిల్ పంపించో మన కార్డ్ పైన ఉండే సీవీవీ వివరాలు, ఓటీపీ వివరాలు అడుగుతారు. వాళ్ళ బుట్టలో పడి మనం కనుక వారు అడిగిన డీటెయిల్స్ ఇచ్చామో.. ఇంక ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదనుకుంటా! ఒక్కటి గుర్తుంచుకోండి... ఏ బ్యాంకు కూడా ఈ వివరాలు అడగదు.
పబ్లిక్ వైఫైలతో జాగ్రత్త
ఏదైనా పబ్లిక్ ఏరియాలలో మనకి వైఫై కనెక్ట్ అవ్వగానే ఓహో వరల్డ్ కప్ కొట్టినంత సంబరపడిపోయి వెంటనే కనెక్ట్ చేసేసుకుని.. ఇంక డీటెయిల్స్ ఎందుకు లెండి! అవసరమున్నా లేకపోయినా రకరకాలుగా వాడేస్తాం. ఇంటర్నెట్ ఆన్ చేసి.. కొన్నిసార్లు కొంతమందైతే ఆర్ధిక లావాదేవీలు కూడా నిర్వహించేస్తారు.
ఆ ట్రాన్సక్షన్స్ ద్వారా మన సీక్రెట్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనమే పూలలో పెట్టి మరీ మోసగాళ్లకు ఇచ్చేస్తున్నట్టు. కక్కుర్తికి పోయి అలా పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు అన్‌సేఫ్ సర్ఫింగ్ చేయకండి.
ఇవి రకరకాల ఫ్రాడ్లు. మరి ఇటువంటి వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండటానికి ఏంచేయాలి? ఇపుడు ఆ వివరాలు చూద్దాం.
మీరు ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సక్షన్స్, ఆన్‌లైన్ షాపింగ్ వంటివి ఎక్కువగా చేసేవారైతే చాలా జాగ్రత్తగా ఇపుడు నేను చెప్పబోయేది వినాలి.

డొమైన్ పేరు పరిశీలించాలి
ఏదైనా సైట్‌లో మీరు లావాదేవీలు నిర్వహించాలనుకుంటే ఆ సైట్ డొమైన్ పేరు తప్పనిసరిగా చెక్ చేయండి. జాగ్రత్తగా ఆ సైట్ పేరు, స్పెల్లింగులు కూడా పరిశీలిస్తే మంచిది.
మీ బ్యాంక్, కార్డ్ వివరాలు గోప్యంగా ఉంచండి
మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలనో, లేదా కార్డ్ డీటెయిల్స్ కావాలనో రకరకాల కాల్స్ మనలో చాలా మందికి వచ్చే ఉంటాయి. నాకు కూడా చాలా వచ్చాయి. ఒక్కటి గుర్తుంచుకోండి.. నేనిందాక చెప్పినట్టు ఆర్‌బీఐ సహా భారతదేశంలో ఏ బ్యాంక్ కూడా ఈ వివరాలు కావాలని ఫోన్ కాల్స్ చేయదు.
ఏటీఎం మెషిన్‌ను పరిశీలించండి
ఏటీఎం కార్డ్‌ను మెషిన్‌లో పెట్టే ముందు ఒకసారి ఆ మెషిన్‌కు ఏవైనా అదనంగా స్కిమ్మర్ లాంటి డివైస్‌లు ఉన్నాయేమో చుడండి. అలాగే మెషిన్ కీ-పాడ్ మీద కూడా డ్రై గ్లూ, గమ్ లాంటి బంకపదార్థాలు ఉన్నాయేమో చుడండి. అదేవిధంగా గదిలో సీసీటీవీ కెమెరా కాకుండా ఇతర కెమెరాలు ఏవైనా ఉన్నాయేమో చుడండి. హడావిడిగా కాకుండా ఒక పది పదిహేను సెకన్లు ఇవి పరిశీలించేందుకు టైం తీసుకోవడంలో తప్పులేదు.
సీవీవీ నొక్కితే స్క్రీన్ మీద చుక్కలే రావాలి
ఏదైనా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మన కార్డ్ వివరాలతో పాటు సీక్రెట్ సీవీవీ నంబర్ కూడా టైప్ చేయాల్సి వస్తుంది. అది టైప్ చేసేటప్పుడు గోప్యత ఉండడానికి స్క్రీన్ మీద చుక్కలే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఇలానే తయారు చేశారు. ఒకవేళ స్క్రీన్ మీద టైప్ చేసేటపుడు మీ సివీవీ నంబర్ కనిపిస్తే జాగ్రత్త పడడం మంచిది. వెబ్‌సైట్‌లలో పేమెంట్ లాంటివి చేసేటప్పుడు వర్చ్యువల్ కీ బోర్డు వాడితే మంచిది.

యాప్‌లతో జాగ్రత్త
మొబైల్ యాప్‌లు. ఈ మధ్యకాలంలో మన ఫోన్ యాప్ స్టోర్‌లో లేదా ప్లే స్టోర్‌లో వేలల్లో యాప్‌లు కనిపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని మన ఫోన్‌లలో భద్రపరచిన డేటా వరకు చేరుకోగలవు. అందుకే ఏది పడితే అది డౌన్‌లోడ్ చేయకుండా మనకి కావాల్సినవి, చూసి అన్ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుంటే మంచిది.
ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్టుల కోసం రిజిస్టర్ చేసుకోండి
మన అకౌంట్ ఉన్న ప్రతి బ్యాంక్ నుండి మాకు ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ అలర్టులు కావాలి అని రిజిస్టర్ చేసుకోండి. అలా చేసుకుంటే ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినపుడు మనకి వెంటనే ఫోన్‌లో మెసేజ్, ఈమెయిల్ రెండూ వస్తాయి. అలాగే మరొక సలహా.. ఏ వెబ్‌సైట్‌లో కూడా మన కార్డ్ డీటెయిల్స్ సేవ్ చేయొద్దు.
కార్డ్‌ను బ్లాక్ చేయండి
మీకు తెలియకుండా మీ కార్డ్ వాడినట్టు మీకు అనిపిస్తే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి మీ కార్డ్‌ను బ్లాక్ చేయాలని చెప్పండి. ఆ తరువాత వెంటనే లిఖిత పూర్వకంగా ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ముప్పయి రోజులలోగా బ్యాంక్ తప్పనిసరిగా స్పందించాలి. ఒకవేళ బ్యాంక్‌లు స్పందించకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయచ్చు. ఒకవేళ అక్కడ కూడా మీ ఫిర్యాదును పట్టించుకోకపోతే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరమ్‌లో లేదా కోర్టులో కేసు వేయచ్చు.
సో! ఇదీ బ్యాంకింగ్ ఫ్రాడ్‌ల కథ. వెళ్లే ముందర ఒక చిన్న మాట... మీకు మా లబ్-డబ్బు మీద ఏవైనా కామెంట్స్ కానీ, ఫీడ్ బ్యాక్ కానీ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. మాయూట్యూబ్ చానల్‌ను సబ్‌స్కైబ్ చేయండి. ఫేస్‌బుక్ పేజీని ఫాలో అవ్వండి.
ఇవి కూడా చదవండి:
- ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులు సంపాదించడం ఎలా?
- లబ్బు..డబ్బు: ఇదీ స్టాక్ మార్కెట్ కథ
- డార్క్ వెబ్: డ్రగ్స్, గన్స్.. అన్నీ డోర్ డెలివరీ!
- లక్కీమనీ కోసం తల్లిదండ్రులపైనే కేసు
- బిల్లింగ్ కౌంటర్లు లేని సూపర్ మార్కెట్.. ఇక భవిష్యత్ ఇదేనా?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- ‘క్యాష్ లెస్’ దొంగతనాలు: పర్సులు కొట్టేవారంతా ఇప్పుడు పక్షుల వెంటపడ్డారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









