తమ రహస్యాలను దొంగిలించిందంటూ ఉబర్‌పై కోర్టుకెక్కిన గూగుల్

ఉబర్ వేమో
    • రచయిత, డవే లీ
    • హోదా, ఉత్తర అమెరికా టెక్నాలజీ రిపోర్టర్

డ్రైవర్ రహిత కార్లను రోడ్లపైకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న దిగ్గజ సంస్థలు గూగుల్, ఉబర్‌ల మధ్య గొడవ కోర్టుకు చేరింది.

క్యాబ్ సర్వీసుల బుకింగ్ సంస్థ ఊబర్‌ మీద స్వయం చోదిత కార్లను రూపొందిస్తున్న గూగుల్ అనుబంధ సంస్థ 'వేమో' కోర్టులో దావా వేసింది.

తమ లైడార్( లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సాంకేతికతకు సంబంధించిన రహస్యాలను ఉబర్ చోరీ చేసిందని వేమో ఆరోపణలు చేస్తోంది.

స్వయం చోదిత కార్లు చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేందుకు లైడార్ సాంకేతికత ఉపయోగపడుతుంది.

అయితే ఆ ఆరోపణలను ఉబర్ ఖండిస్తోంది.

టెక్ దిగ్గజాల మధ్య న్యాయపరమైన వివాదాలు రావడం సాధారణమైన విషయమే. కానీ, ఇలా బహిరంగంగా పోట్లాడుకుంటూ కోర్టు మెట్లెక్కడం మాత్రం చాలా అరుదు.

ఈ వివాదం ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో ఉంది. మూడు నాలుగు వారాల పాటు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి.

గూగుల్ మాజీ ఉద్యోగి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ వివాదానికి కేంద్ర బిందువు ఆంథోనీ లెవన్‌డోస్కీ

'14, 000 రహస్య పత్రాలు చోరీ'

ఈ వివాదానికి కేంద్ర బిందువు ఆంథోనీ లెవన్‌డోస్కీ అనే వ్యక్తి. గతంలో ఆయన గూగుల్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల పరిశోధనలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

అయితే, 2016లో ఉద్యోగం మానేసి బయటకు వెళ్లేటప్పుడు తమ లైడార్ సాంకేతికతకు సంబంధించిన దాదాపు 14,000 రహస్య పత్రాలను అతడు తీసుకెళ్లాడని 'వయ్‌మో' ఆరోపించింది.

తర్వాత అతడు సొంతంగా 'ఒట్టో' పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఏడాదిలోపే దాన్ని సుమారు రూ. 4,360 కోట్లకు(680 మిలియన్ డాలర్లు) ఉబర్ కొనుగోలు చేసింది.

తమ సాంకేతికతను చోరీ చేసేందుకే ఈ వ్యవహారమంతా నడిపారని 'వేమో' అంటోంది. లెవన్‌డోస్కీ గూగుల్‌ను వీడకముందు నుంచే అతనితో ఉబర్ సీఈవో ట్రావిన్స్ కలనిక్ మాట్లాడారని ఆరోపిస్తోంది.

అయితే, పత్రాల చోరీ చేయడమే కాదు, ఆ సాంకేతికను ఉబర్ వినియోగించిందన్న విషయాన్ని కూడా రుజువు చేయాల్సి ఉంటుంది.

గూగుల్ స్వయం చోదిత కారు

ఫొటో సోర్స్, Justin Sullivan/gettyimages

ఫొటో క్యాప్షన్, తమ సాంకేతికతను ఉబర్ చోరీ చేసిందంటూ గూగుల్ స్వయం చోదిత కార్ల తయారీ సంస్థ వేమో ఆరోపిస్తోంది

ఏమిటా రహస్యాలు?

తొలుత దావా వేసినప్పుడు 121 రహస్యాలతో పాటుగా పేటెంట్లను ఉబర్ చోరీ చేసిందని 'వేమో' పేర్కొంది. తర్వాత ఆ సంఖ్యను ఎనిమిదికి తగ్గించింది.

పిటిషన్ దారు తన ఆరోపణలు అసంబద్ధమైనవని తెలిసి ఆ ఆరోపణలను వెనక్కి తీసుకుందని ఉబర్ వ్యాఖ్యానించింది.

అయితే, కేసు విచారణ త్వరగా పూర్తవ్వాలన్న ఆలోచనతోనే కొన్ని ఆరోపణలను వెనక్కి తీసుకున్నామని 'వేమో' తెలిపింది.

ఈ వివాదంలో ఉబర్ దోషిగా తేలితే 'వేమో'కి భారీగా పరిహారం చెల్లించాల్సి రావచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ కోసం పోటీపడుతున్నఊబర్ ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)