గూగుల్‌లో మగవారిపై వివక్ష!

ఫొటో సోర్స్, Getty Images
సంప్రదాయ తెల్లజాతీయుల పట్ల గూగుల్ వివక్ష చూపిస్తోందని ఆ సంస్థకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు.
జేమ్స్ డమోర్, డెవిడ్ గుడెమన్ అనే ఇంజనీర్లు కాలిఫోర్నియాలోని శాంతా క్లారా ఉన్నత న్యాయస్థానంలో ఈ కేసు వేశారు.
గూగుల్‌లో వివక్షకు గురవుతున్న సంప్రదాయ రాజకీయ భావాలు ఉన్న వారు, పురుషులు, 'కొకేషన్ జాతి'కి తాము ప్రతినిధులమని వారు అన్నారు.
గతేడాది వివాదాస్పద మెమో కారణంగా జేమ్స్ డమోర్‌ను ఉద్యోగం నుంచి గూగుల్ తొలగించింది.
ఆడ-మగ శారీరక వ్యత్యాసాల వల్ల గూగుల్‌లో అత్యున్నత ఉద్యోగాల్లో కొందరు మహిళలు మాత్రమే ఉన్నారని జేమ్స్ తన మెమోలో వాదించారు.
అయితే, జేమ్స్ డమోర్ వేసిన పిటిషన్‌పై న్యాయ పోరాటం చేస్తామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
మగవాళ్ల కంటే మహిళలకు తక్కువ జీతాలు ఇస్తున్నారంటూ గతంలో ముగ్గురు మహిళా ఉద్యోగులు గూగుల్‌పై మరో కేసు వేశారు.
అయితే, ఈ కేసును గత నెలలో కోర్టు కొట్టేసింది.
కానీ కేసులో కొన్ని మార్పులు చేసి ఆ మహిళా ఉద్యోగులు మళ్లీ పిటిషన్ వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
గూగుల్‌లో ఉద్యోగులను వేధిస్తున్నారు:డమోర్
ఉద్యోగాల్లో మహిళలు, మైనార్టీలను భర్తీ చేసేందుకు గూగుల్ చట్టవిరుద్ధ నియామక ప్రక్రియ అనుసరిస్తోందని జేమ్స్ డమోర్, డెవిడ్ గుడెమన్ తమ పిటిషన్‌లో ఆరోపించారు.
సంప్రదాయ రాజకీయ భావాలు ఉన్న ఉద్యోగులను కాపాడటంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్న వారిని రక్షించడంలో గూగుల్ విఫలవుతోందని వారు విమర్శించారు.
అంతేకాదు, ఉద్యోగులను బహిరంగంగా వేధిస్తారని ఆ పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. 'సైద్ధాంతిక ఎకో చాంబర్' పేరుతో కక్షపూరితంగా ఇబ్బందులు పెడతారని అన్నారు.
సంస్థ నిర్ధేశించిన లక్ష్యాలను సాధించని మేనేజర్లను బహిరంగంగానే అవమానిస్తారని, సమావేశంలో కించపరిచేలా మాట్లాడతారని పిటిషన్‌లో ఆరోపించారు.
జేమ్స్ డమోర్ రాసిన మెమోతో కార్యాలయాల్లో మాట్లాడే స్వేచ్ఛపై సిలికాన్ వ్యాలీలో విస్తృత చర్చ జరుగుతోంది.
స్త్రీ-పురుషుల మధ్య జీవ సంబంధమైన వ్యత్యాసాలను ఎలా అర్ధం చేసుకుంటారన్న అంశంపై డమోర్ మెమోలో ఉన్న విషయాలు వివాదాస్పదం అయ్యాయి.
అయితే, తాను 'భిన్నత్వం-చేరికల సదస్సు'కు హాజరయ్యానని, దానిపై అభిప్రాయం అడిగితేనే తాను ఆ మెమో రాసినట్లు డమోర్ స్పష్టం చేశారు.
పైగా ఆ మెమో సంస్థ అంతర్గత విషయంగా మాత్రమే ఉంటుందని భావించినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ మెమో ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకం: గూగుల్
డమోర్ రాసిన మెమోలోని కొన్ని అంశాలు సంస్థ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు.
గూగుల్‌లో లింగ వివక్ష తీవ్రంగా ఉందన్నట్లు చిత్రీకరించేలా మెమో ఉందని చెప్పారు.
కానీ, తాను అలా రాసినందుకు గూగుల్‌లోని ఇతర ఉద్యోగులు తనకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారని డమోర్ అన్నారు.
'సంస్థలోని లోటుపాట్లను ధైర్యంగా వెల్లడించినందుకు వారు నాకు కృతజ్ఞతలు తెలిపారు' అని డమోర్ చెప్పారు.
గూగుల్‌లో ఉద్యోగుల పట్ల వివక్ష వివాదంపై అమెరికా కార్మిక విభాగం దర్యాప్తు చేస్తోంది.
మహిళలు-మగవారికి సమాన పనికి సమాన వేతనం గూగుల్ ఇస్తోందా లేదా అన్న విషయంపై ఆరా తీస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఇంటెల్, ఏఎమ్‌డీ, ఏఆర్ఎమ్ చిప్స్‌లో తీవ్రమైన లోపాలు
- 2017: ప్రజలు అత్యధికంగా సెర్చ్ చేసింది వీటికోసమే..
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- హిజ్రాల గురించి మీకేం తెలుసు?
- అధ్యక్షుడి మానసిక స్థితిపై ‘ఆందోళన’
- ఈ తారలు నల్లటి దుస్తుల్లో ఎందుకొచ్చారు?
- ‘ఎన్నికలు 2018 లోనే’
- 'ద ట్రిబ్యూన్ జర్నలిస్టుపై కేసు.. పత్రికా స్వేచ్ఛపై దాడి'
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








