‘ఇకో షో’లో యూట్యూబ్‌ను ఆపేసిన గూగుల్, మండిపడ్డ అమెజాన్

ఫొటో సోర్స్, Amazon
మంగళవారం నుంచి అమెజాన్ 'ఇకో షో'లో యూట్యూబ్ పనిచేయడంలేదు. దాంతో రెండు సంస్థలు పరస్పర విమర్శలకు దిగాయి.
ఎలాంటి వివరణ ఇవ్వకుండానే తమ 'ఇకో షో'లో యూట్యూబ్ ను గూగుల్ బ్లాక్ చేసిందంటూ అమెజాన్ ఆరోపించింది.
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే 'ఇకో షో'లో వినియోగదారులు అడిగే ప్రశ్నలకు వీడియోలు, అక్షరాల రూపంలో సమాధానాలు ఇస్తుంటారు. మంగళవారం నుంచి ఈ షో యూట్యూబ్ వీడియోలు రావడంలేదు.
గూగుల్ స్పందన
''ఇకో షోలో యూట్యూబ్ వినియోగానికి సంబంధించిన నిబంధనలను అమెజాన్ అతిక్రమించింది. అది వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనలేకపోతోంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం.
వినియోగదారులకు మెరుగైన అనుభూతి కలిగించే సేవలు అందించేందుకు అమెజాన్‌తో చాలా కాలంగా సంప్రదింపులు జరుపుతున్నాం. అందుకు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.'' అని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
'వినియోగదారులను బాధించింది': అమెజాన్
దీనికి జవాబుగా అమెజాన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ''ఇకో షోలో యూట్యూబ్ పనిచేయకుండా ఆపేసింది. దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వినియోగదారులకు ముందస్తు సమాచారమూ ఇవ్వలేదు.
ఈ నిర్ణయానికి ఎలాంటి సాంకేతిక కారణాలూ లేవు. ఇది రెండు సంస్థల వినియోగదారులనూ బాధించింది.'' అని అమెజాన్ వ్యాఖ్యానించింది.

వివాదాలు కొత్తేమీ కాదు!
- 2013లో విండోస్ ఫోన్ స్టోర్ నుంచి అనధికారిక యూట్యూబ్ యాప్‌ను తొలగించాలని మైక్రోసాఫ్ట్‌ను గూగుల్ ఆదేశించింది. మైక్రోసాఫ్ట్ యాప్ తమ నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారులు వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రకటనలను అడ్డుకునే వీలు కల్పిస్తోందని గూగుల్ ఆక్షేపించింది.
- 2016లో యాపిల్ టీవీ వీడియో స్ట్రీమింగ్ బాక్సుల అమ్మకాలను తాము నిలిపివేస్తున్నట్లు అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్రకటించారు. యాపిల్ డివైజ్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో సేవలు అందించేందుకు వీలుగా రెండు సంస్థల మధ్య అవగాహన కుదరకపోవడమే ఇందుకు కారణమన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)








