రివైండ్ 2017: ఇంటర్నెట్‌లో ప్రజలు సెర్చ్ చేసిన 7 అంశాలు!

ఫొటో సోర్స్, Getty Images
2017లో ప్రజలు అత్యధికంగా ఇంటర్నెట్‌లో దేని గురించి సెర్చ్ చేశారు. ఏ ఏ విషయాలపై ఆసక్తి చూపించారు.
గూగుల్ గణాంకాలను బీబీసీ పరిశీలించింది. ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన 7 అంశాలను గుర్తించింది.
గూగుల్‌లో సెర్చ్ చేసిన అంశాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది ఎలా సాగిందనేది మనకు తెలుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
1. మేఘన్ మార్కెల్: జనం అత్యధికంగా సెర్చ్ చేసిన నటి
టీవీ సీరియల్ పాత్రలతో ప్రజాదరణ పొందిన అమెరికా నటి మేఘన్ మార్కెల్ పేరు ఈ ఏడాది ప్రపంచమంతా మార్మోగింది. అత్యధికంగా సెర్చ్ చేసిన నటి పేరు ఆమెదే.
ఆమెకు బ్రిటిష్ యువరాజు హ్యారీతో వివాహం జరుగుతోందన్న ప్రకటన ఈ సంచలనానికి కారణం.
అమెరికా టీవీ కార్యక్రమం ‘సూట్స్’లో న్యాయవాది సహాయకురాలు పాత్ర ‘రాచెల్ జేన్’గా మాత్రమే ఆమె తెలుసు.
ఆమె బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ హ్యారీతో డేటింగ్, నవంబర్‌లో నిశ్చితార్థంతో మేఘల్ మార్కెల్ పేరు ప్రపంచమంతా తెలిసిపోయింది.
’ఐక్యారాజ్యసమితి మహిళలు’తో కలిసి ఆమె చేస్తున్న మానవతా కృషి, ఆమె మిశ్రమ జాతి మూలాలు, ఆమె విడాకులు తదితర చాలా విషయాలూ క్రమ క్రమంగా తెలిశాయి.
ప్రిన్స్ హ్యారీతో మేఘన్ నిశ్చితార్థం ప్రకటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఓ ద్విజాతి మహిళ బ్రిటిష్ రాచ కుటుంబంలో చేరుతుండటం చాలా మందిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

ఫొటో సోర్స్, EPA
మేఘల్ మార్కెల్ ద్విజాతి మూలాలు, ఆమె పెరిగిన ప్రాంతం తదితర అంశాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు.
ఆమె తండ్రి శ్వేతజాతీయుడు కాగా.. తల్లి ఆఫ్రికన్-అమెరికన్. ఆమె పెరిగిన ప్రాంతం ముఠాల కుమ్ములాటలకు, జాతి విద్వేషాల ఉద్రిక్తతలకు ఆలవాలంగా చెప్తారు.
ఒక వార్తాపత్రిక అయితే ‘‘నేరుగా కాంప్టన్ నుంచి వచ్చారు’’ అని కూడా పేర్కొంది.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెలెస్ కౌంటీలో గల కాంప్టన్ నగరానికి కార్మిక తరగతి కుటుంబంగా పేరు. నిజానికి ఆమె లాస్ ఏంజెలెస్ నగరంలో మధ్యతరగతి ప్రాంతంలో పెరిగారు.
ఈ కథనాలు ఎంత తీవ్రంగా సాగాయంటే.. మీడియా ఆమెను ‘‘దుర్భాషలు, వేధింపుల వెల్లువలో’’ ముంచుతోందని మండిపడుతూ ప్రిన్స్ హ్యారీ ఏకంగా ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. ఇలాంటి ప్రకటన మునుపెన్నడూ వెలువడలేదు.
ఇదంతా పక్కనపెడితే.. లింగ సమానత్వం కోసం సడలని సంకల్పం ప్రదర్శించే మహిళగా మేఘన్ పేరుగాంచారు.
’ఐక్యరాజ్యసమితి మహిళలు’కు ఆమె ప్రచారకర్త. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు మెరుగైన విద్య, ఆహారం, ఆరోగ్యం కోసం ఉద్యమిస్తున్న ‘వరల్డ్ విజన్ కెనడా’ సంస్థకు ఆమె గ్లోబల్ అంబాసిడర్ కూడా.
ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు 2018 మే 19న వివాహం చేసుకోబోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. హార్వే వైన్‌స్టీన్: అత్యధిక శోధనల్లో నాలుగో స్థానం
2017 అక్టోబర్ 5న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన ఒక కథనం.. అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హాలీవుడ్ మొగల్ హార్వే వైన్‌స్టీన్ దశాబ్దాలుగా డజన్ల మంది మహిళలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడిన తీరును ఆ కథనం బయటపెట్టింది.
హాలీవుడ్ సినీ తారలు ఆష్లే జూడ్, రోస్ మెక్‌గోవన్ సహా 15 మంది మహిళల పేర్లను ఈ కథనంలో ప్రస్తావించింది. ఈ కథనం ప్రచురితమైన తర్వాత ఇంకా చాలా మంది మహిళలు గొంతువిప్పారు. వైన్‌స్టీన్ తమను లైంగికంగా ఎలా వేధించిందీ వివరించటం మొదలైంది.
వైన్‌స్టీన్ చేతుల్లో అత్యాచారం సహా లైంగిక వేధింపులకు గురయ్యామంటూ తాము ఎదుర్కొన్న ఘటనలను వివరిస్తున్న మహిళల జాబితా అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. అందులో అగ్రస్థాయి తారలు కూడా చేరారు. ఏంజెలినా జోలీ, మిరా సార్వినో, గ్వెనెత్ పాల్త్రో, కారా డెలివింగ్న్, లుపిటా న్యాంగో, సల్మా హాయెక్.. తదితరులు వారిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తొలి కథనం వెలువడన మూడు రోజుల తర్వాత ఆయనను ఆయన సొంత సంస్థ వైన్‌స్టీన్ కంపెనీ పాలకవర్గం నుంచి తొలగించారు. ఆస్కార్ అవార్డుల సంస్థ కూడా ఆయనను బహిష్కరించింది.
వైన్‌స్టీన్ పతనంతో.. హాలీవుడ్, రాజకీయాలు, పెద్ద సంస్థల్లో ఇంకా చాలా మంది తమ అధికార బలాన్ని ఉపయోగించుకుని తమ చుట్టూ ఉన్న మహిళలను - కొన్ని ఉదంతాల్లో పురుషులను కూడా - లైంగికంగా వేధించిన, దాడి చేసిన ఉదంతాలు బయటకు వస్తున్నాయి.
నటుడు కెవిన్ స్పేసీ, కమెడియన్ లూయీ సీకే, అమెరికా సెనెటర్ ఎ.ఎల్. ఫ్రాంకెన్, డైరెక్టర్ బ్రెట్ రాట్నర్, టీవీ యాంకర్లు చార్లీ రోజ్, మ్యాట్ లాయర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
దీని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా #MeToo ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది. వేలాది మంది మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ సోషల్ మీడియా వేదికలను ముంచెత్తారు. అమెరికాలోనూ ప్రపంచమంతటా లైంగిక దాడులు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో దీనిద్వారా తెలిసింది.
హాలీవుడ్‌లో ఇంతకాలం దాగిన దారుణ సత్యం బయటపడిపోయింది.

3. ఉత్తర కొరియా: ప్రపంచ వార్తల శోధనలో నాలుగో స్థానం
ఆధునిక ఇంగ్లిష్‌లో ‘‘డోటార్డ్’’ పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కిమ్ జోంగ్-ఉన్? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ‘‘మెంటల్లీ డిరేంజ్డ్ డోటార్డ్’’ అని అభివర్ణించిన కిమ్ వాక్యం చాలా ప్రాచుర్యం పొందింది.
ట్రంప్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభలో తొలిసారి ప్రసంగిస్తూ.. కిమ్‌ను ’’రాకెట్ మ్యాన్’’ అని అభివర్ణిస్తూ.. ఉత్తర కొరియాను ‘‘నాశనం’’ చేస్తానని హెచ్చరించినపుడు ఆయన పై విధంగా స్పందించారు.
ఉత్తరకొరియా గతంలో కన్నా ఈ ఏడాది మరిన్ని క్షిపణి, అణు పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో.. ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

తాజాగా నవంబర్ 28వ తేదీన ఉత్తరకొరియా హ్యోసంగ్-15 ఖండాంతర క్షిపణిని పరీక్షించింది.
అది 4,475 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లిందని, 1,000 కిలోమీటర్ల దూరం వరకూ దాని పరిధి ఉంటుందని చెప్తున్నారు.
ఇది నిరూపణ కాలేదు. ఆ దేశం అటువంటి సాంకేతికతను సాధించగలగటం మీద నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఈ క్షిపణి గతంలో ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణులకన్నా ఎక్కువ ఎత్తుకు చేరటమే కాదు.. జపాన్ ప్రాధికార జలాల్లోకి వెళ్లి పడింది.
ఈ క్షిపణి పరీక్షను అంతర్జాతీయ సమాజం ఖండించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కూడా అత్యవసరంగా సమావేశమైంది. ఉత్తరకొరియాతో దౌత్య సంబంధాలు తెంచుకోవాలని అన్ని దేశాలకూ.. ప్రత్యేకించి ఆ దేశానికి చమురు సరఫరా చేసే చైనాకు అమెరికా పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
4. డెస్పాసిటో: అత్యధికంగా శోధించిన పాట
డెస్పాసిటో మొదట 2017 జనవరిలో విడుదలైనపుడు.. గణనీయమైన ఆదరణ లభించింది. అయితే మూడు నెలల తర్వాత జస్టిన్ బైబర్ ఆ పాటను రీమిక్స్ చేసి విడుదల చేయటంతో ఈ పాప్ సాంగ్ దూసుకుపోయి ప్రపంచ సంచలనంగా మారింది.
ఇందులో జస్టిన్ జోక్యం మీద ప్రశంసలూ, విమర్శలూ వచ్చాయి. కానీ.. అవేమీ పాట ప్రాచుర్యం మీద ప్రభావం చూపలేదు. ఈ పాటను దాదాపు పూర్తిగా స్పానిష్ భాషలో పాడినప్పటికీ ప్రపంచమంతా ఆదరణ లభించింది.
ఈ వీడియోను యూట్యూబ్‌లో 450 కోట్ల సార్లు చూశారు. ఇది ఆల్-టైమ్ రికార్డ్. మ్యూజిక్ వీడియో వేదిక ’వివో’లో కూడా ఇదే అత్యధిక వీక్షణలు గల వీడియో.
’లిరిక్స్‌ఫైండ్’లో 2017లో అత్యధికులు చూసిన లిరిక్స్ (పాట చరణాలు) కూడా ఇదేనని బిల్‌బోర్డ్.కామ్ పేర్కొంది.
రికార్డ్ ఆఫ్ ద ఇయర్, సాంగ్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీల్లో ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డులకు కూడా ఈ పాట నామినేట్ అయింది.

ఫొటో సోర్స్, Getty Images
5. బిట్‌కాయిన్: ప్రపంచ వార్తల శోధనలో రెండో స్థానం
ఈ ఏడాది బిట్‌కాయిన్ విలువ నాటకీయంగా పెరిగిపోయింది. సంవత్సరం మొదట్లో కేవలం 1,000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ ధర డిసెంబర్‌లో ఏకంగా 19,000 డాలర్లకు చేరింది. ఆ తర్వాత విలువ తగ్గినప్పటికీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగానే కొనసాగుతోంది.
బిట్‌కాయిన్ విలువ అమాంతం పెరిగిపోవటంతో దీని మీద క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది. చాలా మంది దీనిని కొనేందుకు పోటీపడ్డారు. భారతదేశంలో ఒక జంట.. తమ పెళ్లికి సంప్రదాయ కానుకలకు బదులుగా బిట్‌కాయిన్లు ఇవ్వాలని కోరి మరీ ఇప్పించుకున్నారు.
బిట్‌కాయిన్ అనేది ప్రధానంగా ఆన్‌లైన్‌లో ఉండే కరెన్సీ. దీనిని వర్చువల్ టోకెన్లుగా భావించవచ్చు. వీటిని ప్రభుత్వాలు కానీ, సంప్రదాయ బ్యాంకులు కానీ ముద్రించవు. కాబట్టి పన్నులు, అప్పులు చెల్లించటానికి చట్టబద్ధంగా చెల్లుబాటుకావు. అయితే క్రిప్టోకరెన్సీని అంగీకరించే నిర్దిష్ట మార్కెట్లలో వీటిని ఉపయోగించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
6. స్ట్రేంజర్ థింగ్స్: అత్యధికంగా శోధించిన టీవీ కార్యక్రమం
ఈ టీవీ కార్యక్రమం సీజన్-2 (రెండో విడత) తొలి ప్రదర్శనకు ఇంటర్నెట్‌లో అనూహ్య ఆదరణ లభించింది. విడుదలైన 24 గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది వీక్షించిన షోగా రికార్డు సృష్టించింది.
1980ల నాటి ఒక కల్పిత ఇండియానా పట్టణంలో నడిచే ఈ షో కథ.. ఒక చిన్నారి అదృశ్యం, మరో చిన్నారి ఆగమనం - విశిష్ట శక్తులున్న ఎలెవన్ అనే బాలిక - చుట్టూ తిరుగుతుంది.
సైన్స్-ఫిక్షన్ హారర్ టీవీ షో.. ఈ ఏడాది ‘స్క్రీన్ యాక్టర్ అవార్డు’ల్లో విశిష్ట బృంద నటన అవార్డును గెలుచుకుంది. 18 ఎమ్మీ అవార్డులను కూడా అందుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
7. ఐఫోన్ X: అత్యధికంగా శోధించిన సాంకేతిక వినియోగ సాధనం
నవంబర్‌లో ఐఫోన్-X విడుదలైనపుడు.. దానిని కొనుగోలు చేయటానికి జనం చాంతాడంత క్యూల్లో నిల్చున్నారు.
ఈ ఫోన్ విడుదల మీద సింగపూర్ నుంచి లండన్ వరకూ, జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో చాలా ఆసక్తి వ్యక్తమైంది. యాపిల్ సంస్థ షేర్ల విలువ అనూహ్య స్థాయికి పెరిగింది.
నవంబర్‌లో బీబీసీ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. యాపిల్ అమ్మకాలు 12 శాతం పెరిగితే.. దాని షేర్ల విలువ 2 శాతం పైగా పెరిగింది. కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న ఈ సంస్థ విలువ ప్రస్తుతం 9000 కోట్ల డాలర్లుగా అంచనా. ఇది తొలి ట్రిలియన్ డాలర్ కంపెనీగా మారటానికి మరో అడుగు దూరంలోనే ఉంది.
తాజా ఐఫోన్ ఫేషియల్ ఐడీ ఫీచర్‌తో వచ్చింది. వినియోగదారులు తమ ఫోన్లను తమ ముఖాలను స్కాన్ చేయటం ద్వారా అన్‌లాక్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో హోమ్ బటన్ కూడా ఉండదు. హోమ్ బటన్ లేని తొలి ఐఫోన్ ఇదే.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








