యాపిల్ పాత ఐఫోన్‌ల పనితీరును తగ్గిస్తోందంటూ ఆరోపణలు.. కేసులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రిస్ ఫాక్స్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
మీరు ఐఫోన్ వాడుతున్నారా? అది అప్పుడప్పుడు స్లో అవుతోందా? అయితే ఇది పూర్తిగా చదవండి.
ఎందుకంటే ఇదంతా యాపిల్ కంపెనీ కావాలనే చేస్తోందనేది ఆరోపణ.
బ్యాటరీ వల్ల ఫోనుకు హాని జరగకూడదనే ఇలా చేస్తున్నట్లు యాపిల్ చెబుతోంది.
కానీ కొందరు వినియోగదార్లు అమెరికా కోర్టులో యాపిల్‌పై దావా వేశారు. కావాలనే ఇలా చేస్తోందని చెబుతున్నారు.
ఇంతకూ అసలు ఏం జరిగింది? బ్యాటరీకి, ఫోను పనితీరుకు సంబంధం ఏమిటి?

ఫొటో సోర్స్, Sean Gallup/gettyimages
సమస్య ఏమిటి?
ఉదాహరణకు మీరు ఐఫోన్-6 ప్లస్ వాడుతున్నారనుకుందాం.
ఆ తరువాత కొంత కాలానికి ఫోను పనితీరు మందగించడం ప్రారంభిస్తుంది.
ఫోను స్పందించే వేగం తగ్గిపోతుంది.
కొన్ని అప్లికేషన్లు అనుకున్నంత వేగంగా పని చేయవు.
చాలా మంది ఐఫోన్ వినియోగదారులు ఇటువంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా గుర్తించారు?
పైన చెప్పినట్లు ఐఫోన్-6 ప్లస్ విషయానికి వద్దాం.
పాత బ్యాటరీ స్థానంలో కొత్తది వేయగానే అది మునుపటిలాగే సాఫీగా పని చేస్తుంది.
కొన్ని రోజుల తర్వాత మళ్లీ దాని పనితీరు నెమ్మదిస్తుంది.
మళ్లీ కొత్త బ్యాటరీ వేయగానే పనితీరు మెరుగుపడుతోంది.
ఈ విషయాన్ని చాలా మంది వినియోగదారులు సోషల్ న్యూస్ అగ్రిగేటర్ రెడిట్ వేదికగా పంచుకున్నారు.
కొత్త మోడళ్లు కొనుగోలు చేసేలా యాపిల్ కావాలనే ఇలా చేస్తోందని ఆరోపించారు.
టెక్నాలజీ వెబ్‌సైట్ గీక్‌బెంచ్, వివిధ ఐఓఎస్‌ల ఆధారంగా పని చేసే ఐఫోన్లను పరిశీలించింది.
కావాలనే ఐఫోన్ల పనితీరును యాపిల్ తగ్గిస్తున్నట్లు గుర్తించింది.

ఫొటో సోర్స్, JOSH EDELSON/gettyimages
యాపిల్ ఏమంటోంది?
ఐఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలు వాడుతున్నారు.
కాలం గడిచే కొద్దీ చలి వాతావరణంలో వీటి పని తీరు మందగిస్తుందని యాపిల్ చెబుతోంది.
పవర్‌ను ఎక్కువ సమయం పట్టి ఉంచే శక్తి వీటికి సన్నగిల్లుతుంది.
అందువల్ల ఐఫోన్ సాఫీగా పనిచేసేందుకు కావాల్సిన పవర్ లభించదు. ఫలితంగా ఫోను అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అవుతుంది.
ఇలాంటి సమయాల్లో ఫోను పనితీరు సాఫీగా ఉండేందుకు తాము ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేస్తున్నట్లు యాపిల్ వెల్లడించింది.
గత ఏడాది ఐఫోన్ 6, 6ఎస్, ఎస్ఈ వంటి మోడళ్లకు కొత్త ఐఓఎస్‌లను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది.
తాజాగా ఐఫోన్-7కు కూడా ఇటువంటి మార్పులు చేశామని, భవిష్యత్తులో ఈ ఫీచర్‌ను ఇతర ఉత్పత్తులకు విస్తరిస్తామని వివరించింది.
వినియోగదార్లకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
రహస్యంగా చేసిందా?
ఐఓఎస్‌లో మార్పుల గురించి వినియోగదార్లకు ముందుగా సమాచారం ఇవ్వలేదనేది ప్రధాన ఆరోపణ.
"వినియోగదారులుకు తెలియకుండా యాపిల్ రహస్యంగా చేసింది. ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి చర్యలు సంస్థపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి."
"చాలా కాలంగా యాపిల్ వినియోగదారుల అంచనాలను అందుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ అనవసరంగా పొరపాటు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంది " అని డెవలపర్, బ్లాగర్ నిక్ హీర్ అభిప్రాయపడ్డారు.
"వినియోగదారులు డబ్బులు చెల్లించి ఫోన్లు కొనుగోలు చేశారు. దాని పనితీరును తగ్గించేటప్పుడు వారికి సమాచారం ఇవ్వాలి. ఎందుకు ఆ పని చేస్తున్నారో కారణం చెప్పాలి. ఈ విషయంలో యాపిల్ మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సింది" అని టెక్ కన్సల్టెన్సీకి చెందిన క్రిస్ గ్రీన్ అన్నారు.
ఒకో కొత్త బ్యాటరీకి అమెరికాలో 79 డాలర్లు, బ్రిటన్‌లో 79 పౌండ్లు యాపిల్ వసూలు చేస్తోంది.

ఫొటో సోర్స్, IFixit
బ్యాటరీల పనితీరు ఎందుకు తగ్గుతోంది?
లిథియం బ్యాటరీల పనితీరు ఛార్జింగ్, డిస్‌ఛార్జింగ్‌లపై ఆధారపడి ఉంటుంది.
ఛార్జింగ్ పెట్టినప్పుడు అయాన్లు పాజిటివ్ ఎలక్ట్రోడ్ల నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్ల వైపు పయనిస్తాయి.
బ్యాటరీ డిస్‌ఛార్జ్ అయ్యేటప్పుడు అయాన్లు నెగిటివ్ ఎలక్ట్రోడ్ల నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్ల వైపు కదులుతాయి.
దీనివల్ల అయాన్లు ప్రయాణించే రసాయనిక ద్రావణం ఎలక్ట్రోలైట్ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది.
ఇది బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపుతుందని ఒక శాస్త్రవేత్త తెలిపారు.

ఫొటో సోర్స్, Drew Angerer/gettyimages
విశ్లేషణ: రోరీ సెల్లాన్-జోన్స్, టెక్నాలజీ కరస్పాండెంట్
మొబైల్ బ్యాటరీల పనితీరు తగ్గడమనేది సాధారణమే. కాలం గడిచే కొద్దీ లిథియం అయాన్ బ్యాటరీల శక్తి సన్నగిల్లుతుంది.
ఇతర కంపెనీల వినియోగదారులు కూడా ఇదేరకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు.
యాపిల్ విషయంలో ఇంత వివాదానికి దారి తీసిన కారణం ఒక్కటే. ఆ సంస్థ పారదర్శకత పాటించకపోవడమే.
గత ఏడాది ఆపరేటింగ్ సిస్టంలను యాపిల్ అప్‌గ్రేడ్ చేసింది. అయితే ఫోన్ల పనితీరు మందగిస్తోందనే ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి.
రెండు రోజుల క్రితం అసలు ఏం జరిగిందో ఒక డెవలపర్ ప్రపంచానికి తెలియజేశారు. దీంతో యాపిల్‌కు వివరణ ఇవ్వక తప్పలేదు.
ఒక సినీతారకు ఉన్న స్థాయిలో యాపిల్‌కు అభిమానులున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వీరి అభిమానాన్ని సంస్థ పొందుతూ వస్తోంది.
ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. యాపిల్ ఇంకాస్త నిజాయతీగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








