ప్యారడైజ్ పేపర్స్: ఆపిల్ రహస్య పన్ను విధానం బహిర్గతం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్యారడైజ్ పేపర్స్ రిపోర్టింగ్ టీం
- హోదా, బీబీసీ పనోరమా
ప్రపంచంలోనే అత్యధిక లాభాలు గడిస్తోన్న ఆపిల్ కంపెనీ బిలియన్ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఎలాంటి రహస్య విధానాలను అనుసరించిందో ప్యారడైజ్ పేపర్లు బహిర్గతం చేశాయి.
వివాదాస్పద ఐరిష్ పన్ను విధానాలు అవలంబిస్తూ ఆపిల్ ఏ విధంగా పన్నులు ఎగ్గొట్టిందీ ఆ తర్వాత 2013 నుంచి ఆ విధానం నుంచి ఎలా తప్పుకుంది తెలిపాయి.
టాక్స్ చెల్లించని దాదాపు 252 బిలియన్ డాలర్ల ఆఫ్‌షోర్ కంపెనీల సంపదను జెర్సీ ద్వీపానికి ఎలా తరలించిందో వివరించాయి.
అయితే, తమ కొత్త విధానంతో పన్నులు ఏమీ తగ్గలేదని ఆపిల్ చెప్పింది. మూడేళ్లుగా ఏటా 35 బిలియన్ డాలర్లు కార్పొరేషన్ టాక్స్ చెల్లిస్తూ ప్రపంచంలో అత్యధికంగా పన్నుచెల్లిస్తున్న కంపెనీగా ఆపిల్ నిలిచిందని తెలిపింది. ఏ దేశంలోనూ పన్నులు తగ్గించుకునే విధానాలు అవలంబించలేదని, ఆయా దేశాల చట్టాలను అనుసరించే ప్రవర్తించామని పేర్కొంది.
ఐర్లాండ్ నుంచి ఏలాంటి పెట్టుబడులను తరలించలేదని తన తదుపరి ప్రకటనలో నొక్కిచెప్పింది.
ఆఫ్ షోర్ కంపెనీలకు సంబంధించి వెలుగు చూసిన అతిపెద్ద ఆర్థిక పత్రాలు బహిర్గత సమాచారాన్ని ప్యారడైజ్ పేపర్‌గా పిలుస్తున్నారు.
2014 వరకు అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లలో పన్నుచట్టాలలోని లొసుగులను ఈ సాంకేతిక సంస్థ తమకు అనుకూలంగా వాడుకున్న విధానాన్ని'డబుల్ ఐరిష్'గా పిలుస్తున్నారు.
అమెరికా బయట అమ్మకాలు కొనసాగించేందుకు ఈ విధానం ఆపిల్‌కు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆపిల్‌కు వస్తోన్న ఆదాయంలో 55 శాతం.. పన్నువిధానాలు వర్తించని, అసలు పన్నే చెల్లించని ఐరిష్ అనుబంధ కంపెనీల నుంచి వచ్చింది.
ఐరిష్ కార్పొరేషన్‌కు చెల్లించే 12.5 శాతం పన్ను లేదా అమెరికాకు చెల్లించే 35 శాతం పన్నుకు బదులుగా అపిల్... తన పన్ను ఎగవేత నిర్మాణంతో అమెరికా బయట ఆర్జించిన లాభాలపై పన్నురేట్లను తగ్గించుకునేలా సహాయపడింది. ఆ మేరకు ఆపిల్ కంపెనీ తన విదేశీ అమ్మకాల లాభాలలో 5 శాతం కంటే ఎక్కువ పన్నును చాలా అరుదుగా విదేశీ పన్నులుగా చెల్లించేది. ఇది ఒక్కోసారి 2 శాతం కంటే తక్కువకు పడిపోయింది.
ఆపిల్‌కు చెందిన ఐరిష్ కంపెనీల టాక్స్ రేటును యూరోపియన్ యూనియన్ ఏడాదికి కేవలం 0.005 శాతంగా లెక్కగట్టింది.
2013లో అమెరికా సెనెట్‌లో ఆపిల్ కంపెనీ తీరుపై చర్చ రావడంతో ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ స్పందించారు. తమ పన్నుల విధానం సరైందేనని వాదించారు.
అమెరికా భారీ స్థాయిలో పన్ను రూపంలో ఆదాయాన్ని కోల్పోయిందని ఆగ్రహ వ్యక్తం చేసిన సెనటర్ కార్ల్ లెవిన్, టిమ్ కుక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మీరు బంగారు బాతును ఐర్లాండ్‌కు తరలించారు. అపిల్ కంపెనీ కిరీటంలోని కిలికితురాయిలాంటి మూడు సంస్థలను అక్కడి తీసుకెళ్లారు. అక్కడ పన్నుచెల్లించాల్సిన అవసరమే లేదు. ఇది సరైంది కాదు" అని పేర్కొన్నారు.
అయితే దీనికి టిమ్ కుక్ దీటుగానే సమాధానం ఇచ్చారు. '' మేం అన్ని పన్నులను పైసాతో సహా చెల్లించాం. పన్నులు ఎగ్గొట్టే కుయుక్తుల మీద మేం ఆధారపడలేదు. కరేబియన్ దీవులకు డబ్బులేమీ తరలించలేదు" అని చెప్పారు.
అపిల్‌బి పై యాపిల్ ప్రశ్నల వర్షం

ఆపిల్ అనుసరిస్తున్న ఐరిష్ విధానంపై దర్యాప్తు జరుపుతామని 2013లో యూరోపియన్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఆపిల్ తాను చెల్లించే పన్నులు తక్కువగా ఉండేందుకు సహాయపడే ఆఫ్ షోర్ కంపెనీల కోసం చూసింది. పన్నుల స్వర్గధామంగా ఉన్న ఐరిష్‌లో అనుబంధకంపెనీల ఏర్పాటుకు సిద్ధమైంది.
ఆఫ్ షోర్ కంపెనీల గురించి ఆపిల్ న్యాయ సలహాదారుడు 2014లో ప్రసిద్ధ ఆఫ్ షోర్ కంపెనీల న్యాయ సలహా సంస్థ అపిల్‌బికి ఓ ప్రశ్నావళిని పంపినట్లు ప్యారడైజ్ పేపర్ లీక్‌లో వెల్లడైంది.
బ్రిటిష్ వర్జిన్ ద్వీపాలు, బెర్ముడా, కెయిమన్ ద్వీపం, మారిషస్, జెర్సీ తదితర ద్వీపాలలో ఎక్కడ కంపెనీలు పెడితే ఎలాంటి ఉపయోగాలుంటాయని అపిల్‌బి ని ఆపిల్ న్యాయసలహాదారు అడిగినట్లు తేలింది.
పన్నుమినహాయింపునకు ఎలాంటి హామీ ఇస్తారు? అన్ని వ్యవహారాలను వాళ్లే చూసుకుంటారా? తదితర ప్రశ్నలు అడిగినట్లు లీక్ అయిన ప్యారడైజ్ పత్రాల్లో వెలుగు చూసింది.
ఒకవేళ అక్కడి ప్రభుత్వం మారితే ఎలాంటి సమాచారం బయటకు పొక్కుతుంది. అక్కడి చట్టం నుంచి ఎలా తప్పించుకోవచ్చు తదితర ప్రశ్నలు కూడా అడిగినట్లు బయటపడింది.
ఆధార పత్రాలు: ఆపిల్ ప్రశ్నలు
ఆపిల్ తన పెట్టుబడుల తరలింపు విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నట్లు లీకైన ఈమెయిల్స్ ద్వారా స్పష్టంమవుతోంది.
పన్నుమినహాయింపుల కోసం ఆపిల్ తన సంస్థనొకదాన్ని యూకే ఆధీనంలో ఉన్న జెర్సీ ద్వీపంలో స్థాపించింది. అక్కడ స్థాపించే విదేశీ కంపెనీలపై పన్నే లేదు.
ఆపిల్ కంపెనీ ఐరిష్‌లో 2 డొల్ల కంపెనీలు స్థాపించినట్లు ప్యారడైజ్ పత్రాల ద్వారా వెలుగు చూసింది. ఆపిల్ ఆపరేషన్స్ ఇంటర్నేషనల్ (ఏవోఐ) 252 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉంది. ఆపిల్ సేల్స్ ఇంటర్నేషనల్ (ఏఎస్ఐ) కూడా ఆపిల్‌దే. 2015లో ప్రారంభమైన ఈ రెండు సంస్థలు అపిల్‌బి కేంద్రగానే 2016 వరకు పని చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ల పన్నులు ఎగ్గొట్టేందుకు ఆపిల్ ఈ విధానాన్ని కొనసాగించింది.
2017 ఆపిల్ అకౌంట్లను పరిశీలిస్తే 44.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెరికా బయట ఆ సంస్థ ఆర్జించినట్లు తెలిసింది. కానీ, అది వివిధ దేశాలకు చెల్లించిన పన్ను మాత్రం 1.65 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే 3.7 శాతం పన్ను మాత్రమే ఆపిల్ చెల్లించనట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ టాక్స్‌లో 6 శాతానికి లోపే ఉంది.
యాపిల్, ఐర్లాండ్ వర్సెస్ యూరోపియన్ యూనియన్

ఐర్లాండ్ ప్రభుత్వం ఆపిల్ కంపెనీకి అక్రమంగా పన్ను ప్రయోజనాన్నికలిగించిందని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. మూడేళ్లు దర్యాప్తు చేసిన అనంతరం 2016 ఆగస్టులో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆపిల్ కంపెనీ ఎగ్గొట్టిన పన్నును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని గడువు కూడా విధించింది. అయితే దీనిపై ఐర్లాండ్, ఆపిల్ కంపెనీలు అప్పీలుకు వెళ్లాయి.
యూరోపియన్ యూనియన్ తీర్పును టిమ్ కుక్ తప్పుపట్టారు. ఇక ఐర్లాండ్ కూడా తన స్వంతంత్ర పన్నుల విధానాన్ని యూరోపియన్ యూనియన్ ఆక్రమిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా తమ ప్రాంతంలో ఉన్న కంపెనీలు తరలివెళ్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
'డబుల్ ఐరిష్' విధానంలోని లొసుగులు మూసుకపోవడంతో ఐర్లాండ్ కూడా కొత్త పన్నులు విధానాన్ని తీసుకొచ్చింది. ఇది ఆపిల్ లాంటి కంపెనీలకు ప్రయోజనం చేకూర్చింది.
అయితే, ఐర్లాండ్ ఆర్థిక కార్యాలయం మాత్రం తమ నూతన పన్ను విధానాలు బహుళజాతి కంపెనీలకు ఎలాంటి అదనపు ప్రయోజనం కలిగించవని పేర్కొంది.
మరోవైపు, జెర్సీ ద్వీపానికి తరలించిన తన రెండు కంపెనీలపై సమాధానం ఇవ్వడానికి ఆపిల్ నిరాకరించింది.
"2015లో ఐర్లాండ్ పన్నుల విధానాన్ని మార్పు చేసినప్పుడు అక్కడ ఉన్న తమ కంపెనీలను తరలిస్తున్నట్లు ఐరిష్‌కు, యూరోపియన్ యూనియన్‌కు, అమెరికాలకు కూడా తెలిపాం" అని ఆపిల్ పేర్కొంది.
"మేం చేసుకున్న మార్పుల వల్ల ఏ దేశంలోనూ పన్నులు తగ్గలేదు. వాస్తవం ఏంటంటే ఐర్లాండ్‌లో మేం చెల్లించే పన్నుల మొత్తం భారీగా పెరిగింది. గత మూడేళ్లుగా అక్కడ 1.5 బిలియన్ డాలర్లు పన్నుగా చెల్లించాం" అని ఆపిల్ తెలిపింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








