జిన్‌పింగ్: ఇక జీవితాంతం చైనా అధ్యక్షుడు!

ఫొటో సోర్స్, Getty Images
షీ జిన్‌పింగ్ జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేస్తూ చైనా కాంగ్రెస్ అధ్యక్ష కాలపరిమితి నిబంధనను రద్దు చేసింది.
చైనా నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశాలలో ఈ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపారు.
దీనిని కేవలం నామమాత్రపు చర్య అని భావిస్తున్నారు. మొత్తం 2,964 ఓట్లలో ఇద్దరు దీనిని వ్యతిరేకించగా, మరో ముగ్గురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. జిన్‌పింగ్ వాస్తవానికి 2023లో పదవి నుంచి దిగిపోవాల్సి ఉంది.
చైనాలో 1990ల నుంచి ఎవరైనా కేవలం రెండు పర్యాయాలే అధ్యక్షుడిగా ఉండాలనే నిబంధన ఉంది.
మావో జెడాంగ్‌లా మరో నేత ఎవరూ ఎదగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నారు. దీనివల్ల వ్యక్తిపూజకు దూరంగా సమష్టి నాయకత్వం ఎదుగుతుందని భావించారు.

ఫొటో సోర్స్, EPA
గత అక్టోబర్‌లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లోనే జిన్‌పింగ్ తన వారసుణ్ని ప్రకటించే సంప్రదాయాన్ని తోసిపుచ్చారు.
గత నెల చివరిలో, రాజ్యాంగం నుంచి పార్టీ అధ్యక్షుడి కాలపరిమితిని రద్దు చేసే ప్రతిపాదన చేశారు.
కాగితంపై చైనా కాంగ్రెస్ అత్యంత శక్తివంతమైన శాసనధికార సంస్థ అయినా, అది చెప్పిందే చేస్తుందనే అపవాదు ఉంది.
అసమ్మతి
జిన్‌పింగ్‌కు అసమ్మతి లేకుండా పోలేదు.
సోషల్ మీడియాలో విమర్శకులు జిన్ పింగ్‌ను 'విన్నీ ది పూహ్' క్యారెక్టర్‌తో పోల్చేవారు. అందువల్ల దానిపై చర్చను బ్లాక్ చేసే ప్రయత్నాలు జరిగాయి.
మాజీ ప్రభుత్వ పత్రిక ఎడిటర్, ప్రభుత్వ విమర్శకుడు లి డాటోంగ్ - అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల పదవులపై కాల పరిమితి ఎత్తేయడం వల్ల గొడవలు తలెత్తుతాయంటూ ఒక బహిరంగ లేఖ రాశారు.
అయితే ప్రభుత్వ మీడియా మాత్రం ఈ మార్పులు తప్పక అవసరమని పేర్కొంటోంది.

ఫొటో సోర్స్, WEIBO/AFP
జిన్‌పింగ్ ఆలోచనావిధానం
చైనా జాతీయ కాంగ్రెస్‌లో ఈ క్రింది అంశాలను కూడా ఆమోదించే అవకాశం ఉంది:
- వచ్చే ఐదేళ్ల కోసం చైనా ప్రభుత్వ అధికారులను ఎన్నుకుంటారు.
- కొత్త అవినీతి నిరోధక సంస్థపై చట్టాన్ని ఆమోదిస్తారు.
- ''జిన్‌పింగ్ ఆలోచనా విధానం''ను రాజ్యాంగంలో చేరుస్తారు.
కమ్యూనిస్టు పార్టీ గత ఏడాది అక్టోబర్‌లో ఈ ఆలోచనా విధానాన్ని ఆమోదించింది.

ఫొటో సోర్స్, EPA
చదివి తీరాల్సిందే
ఆధునిక చైనాలో నూతన అధ్యాయంగా పేర్కొంటున్న జిన్‌పింగ్ ఆలోచనా విధానాన్ని స్కూల్ పిల్లలు, కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ ఫ్యాక్టరీలలోని సిబ్బంది అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
2012లో అధ్యక్ష పదవిని చేపట్టిన జిన్‌పింగ్, అతి వేగంగా శక్తివంతమైన నేతగా ఎదిగారు. చైనా సూపర్ పవర్‌గా మారడానికి దోహదపడ్డారు.
ఆయన హయాంలో అవినీతికి పాల్పడిన వేలాదిమంది పార్టీ సభ్యులను శిక్షించారు. దీంతో ఆయన పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది.
అదే సమయంలో చైనాలో ప్రభుత్వ నిఘా, సెన్సార్‌షిప్ పెరిగిపోయింది. అంతేకాకుండా జిన్‌పింగ్ తన రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికే ఈ ప్రక్షాళనను ఉపయోగించుకున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








