చైనా: బహిరంగంగా మరణ శిక్ష విధింపు.. ఆన్‌లైన్ వేదికల్లో విస్తృత చర్చ

ఫొటో సోర్స్, Beijing News
- రచయిత, కెరీ అలెన్
- హోదా, బీబీసీ మానిటరింగ్
చైనాలోని ఒక నగరంలో నేరస్థులకు బహిరంగంగా మరణ శిక్ష విధించడంపై చైనా సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.
లూఫెంగ్ అనే ఈ నగరం చైనా దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉంది. సింథటిక్ డ్రగ్స్ ఉత్పత్తికి లూఫెంగ్ కేంద్రంగా మారింది.
ఈ ముద్రను చెరిపేసుకొనే ప్రయత్నాల్లో భాగంగానే, నేరస్థులకు బహిరంగంగా శిక్ష విధించడం, మరణ శిక్ష పడ్డ ఖైదీలను పరేడ్ చేయించి మరీ శిక్ష అమలుపరచడం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
హత్య, దోపిడీ, మాదక ద్రవ్యాల కేసుల్లో 12 మందికి ఈ నెల 16న లూఫెంగ్‌లో బహిరంగంగా శిక్షలు విధించారు.
నేరం నిరూపితమైన ఈ 12 మందికి స్థానిక స్పోర్ట్స్ స్టేడియంలో శిక్షలు విధించనున్నారని, దీనిని ప్రత్యక్షంగా చూడాలని ప్రజలకు కోర్టు అంతకుముందు సూచించింది.
వీరిలో డ్రగ్స్ కేసుల్లో 10 మందికి మరణ శిక్ష పడింది. వీరికి శిక్ష వెంటనే అమలైందని చైనాలో ప్రముఖ మీడియా వెబ్‌సైట్ 'ద పేపర్' వెల్లడించింది. వీరిని శిక్ష విధించిన ప్రదేశం నుంచి పోలీసు వాహనంలో ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లి, తుపాకీతో కాల్చి, శిక్షను అమలు చేశారు.

ఫొటో సోర్స్, Beijing News
ప్రపంచంలోకెల్లా మరణ శిక్షలు అత్యధికంగా అమలయ్యే దేశం చైనానే. ఏటా ఎంత మందికి ఈ శిక్ష అమలవుతోందో చెప్పే అధికారిక గణాంకాలు లేవు. అయితే వీటి సంఖ్య వేలల్లో ఉంటుందని అంచనా.
చైనాలో ఇటీవలి కాలంలో బహిరంగంగా మరణ శిక్ష ప్రకటించడం అరుదు. అయితే దక్షిణ చైనా సముద్ర తీరాన ఉండే గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో ఈ ఘటనలు పెరుగుతున్నాయి.
ఈ విషయంలో లూఫెంగ్ జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా వార్తలకెక్కింది. లూఫెంగ్ ప్రాంతంలోని రెండు న్యాయస్థానాలు 18 మందికి బహిరంగంగా శిక్షలు ప్రకటించాయి.
వీరిలో ఎనిమిది మందికి విచారణ ముగిసిన వెంటనే మరణ దండన అమలైంది.
మాదక ద్రవ్యాల పట్ల తమ కఠిన వైఖరి చైనాలోని ఆన్‌లైన్ వేదికల్లో అందరి దృష్టికి వెళ్లేలా గ్వాంగ్‌డాంగ్ ప్రభుత్వం రెండు నెలలుగా బాగా ప్రయత్నిస్తోంది.
నవంబరులో లూఫెంగ్ సమీంలోని జీయాంగ్ నగరంలో బహిరంగంగా శిక్ష విధించడానికి సంబంధించిన ఫొటోలను గ్వాంగ్‌జౌ డైలీ ప్రచురించింది. ఈ కార్యక్రమానికి వెయ్యి మందికి పైగా ప్రజలు హాజరయ్యారని ఈ పత్రిక చెప్పింది.

ఫొటో సోర్స్, Science Faction
ఈ నెల 16న లూఫెంగ్‌లో బహిరంగంగా శిక్షల విధింపునకు సంబంధించి అధికారులు చైనాలోని ప్రముఖ మొబైల్ మెసెంజర్ 'విచాట్' ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు.
తీర్పు ప్రకటన ఫుటేజీ చైనాలోని మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ 'సీనా వీబో', యూట్యూబ్ తరహా వెబ్‌సైట్ 'మియావోపై'లలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది.
విచారణకు సంబంధించిన వీడియోను 'ద బీజింగ్ న్యూస్' పత్రిక శనివారం ఆన్‌లైన్‌లో ఉంచగా.. 30 లక్షల మందికి పైగా చూశారు.

ఫొటో సోర్స్, Reuters
'మనిషి ప్రాణానికి చైనా విలువ ఇవ్వడం లేదు'
శిక్ష విధింపు వీడియోపై మానవ హక్కుల కార్యకర్తలు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
మనిషి ప్రాణం, గౌరవం పట్ల తమకు ఏ మాత్రం పట్టింపు లేదని చైనా మరోసారి చాటుకుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన విలియం నీ 'ట్విటర్'లో మండిపడ్డారు.
మైక్రోబ్లాగింగ్ సైట్ 'సీనా వీబా'లో చాలా మంది యూజర్లు ఈ చర్యపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 1960లు, 1970ల నాటి చైనా సాంస్కృతిక విప్లవం మళ్లీ వచ్చినట్లు తమకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
మరణ శిక్షలు తేలిగ్గా ప్రకటించేస్తున్నారనే ఆందోళనను కొందరు యూజర్లు వ్యక్తపరిచారు. బహిరంగంగా మరణ శిక్ష ప్రకటించడం ఆక్షేపణీయమే అయినప్పటికీ, లూఫెంగ్ నగర ప్రతిష్ఠను కాపాడేందుకు ఈ చర్య తప్పదని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
మాదక ద్రవ్యాలు కెటామిన్, క్రిస్టల్ మెథమ్‌ఫెటామిన్ లూఫెంగ్‌లో ప్రధానంగా ఉత్పత్తి అవుతున్నాయి. డ్రగ్స్‌లో ఎక్కువ భాగం తూర్పు ఆసియా, ఆసియా పసిఫిక్ దేశాలకు రవాణా అవుతాయి.
లూఫెంగ్ ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు పోలీసులు 13 వేలకు పైగా డ్రగ్స్ కేసుల విచారణను పూర్తిచేశారని, పది టన్నుల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారని చైనా అధికార వార్తాసంస్థ 'జిన్హువా' వెల్లడించింది.
ఇతర కథనాలు:
- చైనాలో ఇంటర్నెట్పై కఠిన ఆంక్షలు
- శ్రీలంకలో భారత్, చైనా వ్యాపార యుద్ధం!
- ‘రామసేతు’పై మళ్లీ వివాదం!
- ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా ఫేస్‌బుక్
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా!
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
- ఆక్స్ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్ఫర్డ్ల్లో ఉచితంగా చదవాలనుందా!
- 2050 నాటికి అతి పెద్ద పది సవాళ్లివే!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








