అభిప్రాయం: జగన్ ఎంపీల రాజీనామాల ఆమోదం - నష్టనివారణలో టీడీపీ

జగన్

ఫొటో సోర్స్, Facebook/YSRCP-NCBN

    • రచయిత, డానీ
    • హోదా, బీబీసీ కోసం

ఐదుగురు వైయస్సార్‌సీపీ ఎంపీలు సమర్పించిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడంతో ఇప్పటికే మంచి కాక మీదున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక తరహా హోదాను ఇవ్వనందుకు నిరసనగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఏప్రిల్ 6న రాజీనామాలను సమర్పించారు.

రెండు, మూడు విడుతల చర్చల తరువాత లోక్‌సభ స్పీకర్ బుధవారం వీటిని ఆమోదించారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Facebook/Narendra Modi

కొత్త సంకేతాలు?

రెండున్నర నెలలు తాత్సారం చేసి ఇప్పుడు రాజీనామాల్ని ఆమోదించడంతో రాష్ట్రంలోనే గాక జాతీయ రాజకీయాల్లోనూ అనేక కొత్త సంకేతాలు వెలువడినట్టు అయింది.

రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించినపుడు త్వరలోనే జమిలి ఎన్నికలు జరగనున్నట్టు కొన్ని సంకేతాలు వెలువడ్డాయి.

ఇప్పుడు ఎంపీల రాజీనామాల్ని ఆమోదించడాన్నిబట్టి కేంద్రం ముందస్తుగా లోక్‌సభ ఎన్నికలకు సిధ్ధం అవుతోందనే అభిప్రాయం కలుగుతోంది.

లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట కడప పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

2014 జూన్ 4న ఆరంభం అయిన పదహారవ లోక్‌సభ గడువు వచ్చే ఏడాది జూన్ 3న ముగుస్తుంది. ఖాళీ అయిన లోక్‌సభ స్థానాలను ఆరు నెలలలోపు ఉపఎన్నికల ద్వారా పూరించాలని ప్రజా ప్రాతినిధ్య చట్టం చెపుతోంది.

అయితే, చివరి సంవత్సరంలో సాధారణ ఎన్నికలకు ఏడాది గడువు కూడా లేనపుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాలకు ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు జరపాలనే నిబంధనను పాటించనూ వచ్చు, పాటించకపోనూ వచ్చు. లేదా ముందస్తు ఎన్నికలు నిర్వహించవచ్చు.

ఇప్పటికయితే ఉపఎన్నికలు జరిపే అవకాశాలు కనిపించడంలేదు.

రాజీనామాలు

ఫొటో సోర్స్, Facebook/YSRCP

ఒక చర్య... అనేక ప్రతిచర్యలు

ప్రకృతి శాస్త్రాల్లోలా రాజకీయాల్లో ఒక చర్యకు ఒక ప్రతిచర్య మాత్రమే వుండదు. అనేక ప్రతిచర్యలు వుంటాయి.

రాజీనామాలు ఆమోదం పొందడంతో తమ ఎంపీల పదవీ త్యాగానికి గుర్తింపు వచ్చిందని వైయస్సార్‍సీపీ అధినేత వైయస్ జగన్ అంటున్నారు.

రాజీనామాల ఆమోదం వార్త వచ్చాక వైయస్సార్‌సీపీ శిబిరంలో ఉత్సాహం పెరిగినట్టు కనిపిస్తున్నది. "ప్రత్యేక హోదా సాధన పోరాటంలో"అసలు హీరో జగనే అని ఇంకోసారి రుజువైందని ఆ పార్టీ పెద్దలు అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో అది తమకు కలిసివస్తుందనేది వాళ్ళ ఆనందం.

ఈ వ్యాసకర్త రెండు రోజులుగా ఒంగోలులోనే వున్నాడు. రాజీనామాల ఆమోదం మీద జనంలో పెద్దగా స్పందన కనిపించలేదు.

మరోవైపు, ఉపఎన్నికలు రాకుండా లెక్కలు కట్టి రాజీనామాల్ని ఆమోదింప చేసుకున్నారని అధికార తెలుగుదేశం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నది.

ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కరీముల్లా షా మాటల్లో చెప్పాలంటే ఉపఎన్నికలు వస్తే అన్నిచోట్లా విజయం తమదే అనే ధీమాతో టీడీపీ నేతలు వున్నారు.

పవన్ కళ్యాణ్

ఫొటో సోర్స్, JanaSena Party/Facebook

బీజేపీ దోస్తీ - లాభమా, నష్టమా?

బీజేపీతో జగన్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారన్న ప్రచారాన్ని టీడీపీ గత నాలుగు నెలలుగా వుధృతంగా సాగిస్తోంది.

ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినట్టుగానే, ఆ పార్టీతో సన్నిహితంగా వుంటున్న జగన్‌కు కూడా ఓటమి తప్పదని టీడీపీ సిధ్ధాంతకర్తలు విశ్లేషిస్తున్నారు.

అయితే జగన్ శిబిరం వాదన మరోలా వుంది. నంద్యాల ఉపఎన్నిక నాటికన్నా తమ పార్టీ ఇప్పుడు చాలా బలంగా వుందనీ, లోకసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే విజయం తమదే అవ్వడమేగాక పార్టీ శ్రేణుల్లో సాధారణ ఎన్నికలకు సిధ్ధం కావడానికి కొత్త ఉత్సాహం కూడా వస్తుందని వారంటున్నారు.

అయితే, రాష్ట్ర రాజకీయాల్లో రెండు అంశాల ప్రభావాలు ఎవరికీ అంతు బట్టడంలేదు. మొదటిది, ప్రత్యేక హోదా. రెండోది, మోదీ పట్ల వ్యతిరేకత.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రత్యేక తరహా హోదా సంజీవని లాంటిదని జగన్ చేస్తున్న వాదన దిగువ శ్రేణుల్లోకి పెద్దగా ఇంకినట్టులేదు.

'హోదా'వల్ల వచ్చే ప్రయోజనాల గురించి విద్యావంతులు సైతం ఇదమిత్తంగా చెప్పలేక పోతున్నారు. ప్రత్యేక తరహా హోదా అనేది ఒక ఎమోషనల్ ఇష్యూగా రాజకీయ పార్టీలు మార్చాయన్నది నిజం.

అయితే, అది ఏప్రిల్ నాటి సంగతి. ఇప్పుడు ఆ అంశం చల్లారుతున్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఎంపీల రాజీనామాలను ఏప్రిల్ నెలలోనే ఆమోదింపచేసుకుని వుంటే వైయస్సార్‌సీపీకి ఇప్పటికన్నా ఎక్కువ మేలు జరిగివుండేది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్న సూచనలతో ఒక సంధిగ్ధ రాజకీయ వాతావరణం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణలు బలంగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కాపు సామాజికవర్గం నరేంద్ర మోదీ పట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నది. ఇది పవన్ కళ్యాణ్‌కు లాభమా, లేక నష్టమా అనేది ఇప్పుడే చెప్పలేం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, YS Jaganmohan Reddy/Facebook

లోక్‌సభ సభ్యత్వం వేరు.. రాజ్యసభ సభ్యత్వం వేరు

వైయస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఒక రాజకీయ నాటకంగా కొట్టి పడేస్తున్న టీడీపీ ప్రచారంలోనూ నిజాయితీ లేదు.

గతంలో ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం సరిగ్గా ఇలానే వ్యవహరించింది. 1984లో ఏర్పడిన ఎనిమిదవ లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వుంది.

బోఫోర్స్ ఫిరంగుల కొనుగోళ్లలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై ముడుపుల ఆరోపణలు వచ్చాయి. అప్పుడు టీడీపీ అధినేత ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్‌కు ఛైర్మన్‌గా వున్నారు.

రాజీవ్ గాంధీది అవినీతి పాలన అంటూ టీడీపీ లోక్‌సభ సభ్యులు 1989 మధ్యలో తమ పదవులకు రాజీనామాలు చేశారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అవకాశం లేకపోవడంతో ఉపఎన్నికలు జరపలేదు. అప్పట్లో చంద్రబాబు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వున్నారు. రాజీనామా చేసిన ఎంపీలతో వారే తిరుపతి నుండి రైలు యాత్ర జరిపారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

జగన్ లోక్‌సభ సభ్యుల చేత మాత్రమే రాజీనామాలు చేయించారనీ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని టీడీపీ కొత్త వాదనను ప్రవేశపెట్టింది. ఇదీ సమంజసమైనది కాదు.

లోక్‌సభకు మాత్రమే ఐదేళ్ల నిర్దిష్ట గడువు వుంటుందిగానీ రాజ్యసభకు అలాంటి గడువు వుండదు. రాజ్యసభ నిరంతరాయమైనది.

అంచేత, ఉద్యమాల్లో భాగంగా రాజీనామాలు చేసేవారు లోక్‌సభకే రాజీనామాలు చేస్తారుగానీ రాజ్యసభకు చేయరు. చేసినా అది ప్రభావం చూపదు.

తన లోక్‌సభ సభ్యుల చేత రాజీనామాలు చేయించడానికి కూడా సాహసించని చంద్రబాబు నాయుడు వైయస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయడంలో సహేతుకత లేదు.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook

భావోద్వేగ అంశాలదే పైచేయి?

వైయస్సార్‌సీపీ అభ్యర్థులుగా 2014 ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం టీడీపీ శిబిరంలో కొనసాగుతున్న ఎంపీలు ముగ్గురున్నారు.

అలా వుండడాన్ని మన ప్రజా ప్రాతినిధ్య చట్టాలు అనుమతిస్తున్నాయని గమనించాలి. ఎన్నికల మీద ప్రజలకుండే నమ్మకం, గౌరవాలని ఇలాంటి పరిణామాలు దెబ్బతీస్తాయి.

తాము చేసిన తప్పుల్నే మరొకరు చేస్తుంటే తప్పుపట్టడం, తాము చేయలేనిది ఇతరులు చేస్తుంటే సహించలేకపోవడం వర్తమాన రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సాగుతున్న రాజకీయ విషాదం ఏమంటే, భావోద్వేగ అంశాలు వెలుగులోకి వచ్చి ప్రజల జీవితాలని మెరుగుపరిచే అంశాలు మరుగున పడిపోతున్నాయి.

సాధారణంగా అలాంటి ఎత్తుగడల్ని అధికారపక్షాలు పాటిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం సైతం అవే తప్పులు చేయడం మరొక విచిత్రం.

(ఇవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)