#FIFA2018: అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి అసలేమైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెన్ సదర్లాండ్, ఫెర్నాండో డ్యుర్టె
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఐదు సార్లు ప్రపంచ ప్లేయర్‌గా నిలిచిన లియోనెల్ మెస్సీ ఈ ఏడాది గత రెండు మ్యాచుల్లో ఒక్క గోల్ కూడా కొట్టలేక పోయాడు. కనీసం తోటి ఆటగాళ్లకు మద్దతు కూడా ఇవ్వలేకపోయాడు. నిజానికి తాజా ప్రపంచ కప్‌లో ఐస్‌లాండ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఒక పెనాల్టీ కూడా మిస్ చేశాడు.
మెస్సీ విఫలమవడంతో 2002 తర్వాత ఈ దక్షిణ అమెరికా టీమ్ రెండోసారి గ్రూప్ దశను చేరలేకపోయే ప్రమాదం కనిపిస్తోంది. అర్జెంటీనా 2002లో తొలిసారి ఈ టోర్నమెంటులో గ్రూప్ దశను చేరలేకపోయింది.
30 ఏళ్ల వయసులో ఉన్న మెస్సీకి కనీసం మరో ప్రపంచ కప్ ఆడే అవకాశం ఉంది. కానీ అర్జెంటీనాకు అతిపెద్ద టైటిల్ తెచ్చిపెట్టడానికి రష్యాలో జరుగుతున్న 2018 ప్రపంచకప్ అతడికి ఆఖరి అవకాశం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటివరకూ మెస్సీ సాధించిన ఘనత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జట్టుకు స్వర్ణపతకం తెచ్చిపెట్టడమే.
బార్సిలోనాలో కూడా మెస్సీ సీజన్ అంత గొప్పగా లేదు. డొమెస్టిక్ లీగ్‌ను రెండుసార్లు గెలుచుకున్నా, యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్‌లో వరసగా మూడో సీజన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడంలో కాటలాన్స్ విఫలమైంది. అదే సమయంలో రియల్ మాడ్రిడ్ అమెరికా ఖండంలో ఆధిపత్యం చెలాయించడాన్ని చూడాల్సివచ్చింది.
ఈ సీజన్‌లో మెస్సీ ఎందుకు రాణించలేకపోతున్నాడు అనడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో కొన్ని..

ఫొటో సోర్స్, Getty Images
1)శారీరక అలసట
2017/2018 యూరోపియన్ సీజన్‌లో మెస్సీ మొత్తం 54 మ్యాచ్‌లు ఆడాడు. 2014/2015 నుంచి అతడు ఆడిన వాటిలో ఇవి చాలా ఎక్కువ. గత ఐదేళ్లలో అతడు ఆడిన అత్యధిక మ్యాచ్‌లు కూడా. ట్రాన్స్‌ఫర్ మార్కెట్ సైట్ గణాంకాల ప్రకారం మెస్సీ మొత్తం 4,468 నిమిషాలపాటు ఆడాడు. సగటున ఒక్కో గోల్ కోసం 99 నిమిషాలు ఆడాడు. బార్సిలోనాలో 45 గోల్స్ వేసిన మెస్సీ, 18 అసిస్ట్స్ చేసి తన సీజన్ ముగించాడు.
2) బాధిస్తున్న గాయం
2018 ఏప్రిల్‌లో జాతీయ జట్టు నుంచి అందిన సమాచారం ప్రకారం.. కుడి కాలి తొడలో గాయం మెస్సీని బాధిస్తోందని అర్జెంటీనా వార్తా పత్రిక క్లారిన్ తెలిపింది. అతడి స్ప్రింట్, వేగం అందుకునే సామర్థ్యాలపై అది ప్రభావం చూపుతోందని చెప్పింది. ఇటలీ, స్పెయిన్‌తో జట్టుకు అతి కీలకమైన పోటీల్లో కూడా ఆడకుండా అతడు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ సమస్య బహిర్గతం అయ్యింది. తర్వాత స్పెయిన్ చేతిలో తన జట్టు 6-1 తేడాతో ఓడిపోవడాన్ని మెస్సీ కళ్లారా చూశాడు.

ఫొటో సోర్స్, Getty Images
3) అర్జెంటీనా జట్టుకు మంచిరోజులు కరువు
రష్యా 2018 ప్రపంచకప్ కోసం జరిగిన సౌత్ అమెరికన్ క్వాలిఫికేషన్ టోర్నమెంటులో అర్జెంటీనా ఆటతీరు ఘోరంగా ఉంది. లీగ్ ఫార్మాట్ టోర్నమెంటులో ఇది ఆఖరి రౌండ్‌లో చోటు దక్కించుకుంది. అది కూడా ఫలితాలు వెలువడ్డాక, ఇతర జట్ల స్కోర్లు తక్కువగా ఉండటం వల్ల. ఆ పోటీలో 7 గోల్స్ వేసిన మెస్సీ, అర్జెంటీనా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ జట్టు ప్రదర్శనపై అభిమానులు, మీడియా విరుచుకుపడకుండా ఆ గోల్స్ ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి.
గత ప్రపంచ కప్ పోటీల్లో అర్జెంటీనా ఫైనల్ చేరగలిగినా, అదనపు సమయంలో ఒక్క గోల్ చేసిన జర్మనీ చేతిలో ఓటమి మూటగట్టుకుంది. వరల్డ్ కప్ పోటీల్లో అర్జెంటీనా చివరిగా 1986లో గెలిచింది. 1993లో జరిగిన కోపా అమెరికా తర్వాత అర్జెంటీనా ఒక్క పెద్ద ట్రోఫీ కూడా గెలుచుకోలేదు. 2004, 2008లో వరసగా ఒలింపిక్ విజేతగా నిలిచినా అది ఆ గాయాలకు మందు వేయలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
4) దూసుకుపోతున్న రొనాల్డో
పోర్చుగల్ జట్టులోని ప్రత్యర్థి, దశాబ్దంగా అన్నింటిలో తనతో పోలుస్తూ వస్తున్న ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో సంచలన ఫామ్ కూడా మెస్సీ కష్టాలకు తోడైంది.
స్పెయిన్‌పై హాట్రిక్ గోల్స్ చేసిన రొనాల్డో 2018 ప్రపంచకప్‌లో తన జట్టుకు అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాడు. వీటిలో కొన్ని తరాల వరకూ గుర్తుండిపోయే ఒక ఫ్రీ కిక్ కూడా ఉంది. ఆ తర్వాత మొరాకోపై తలతో బుల్లెట్ వేగంతో ఒక గోల్ చేశాడు. ఆ మ్యాచ్ మొత్తానికీ నమోదైన గోల్ అదే.
ఈ టోర్నమెంటులో ఐస్‌లాండ్‌తో పెనాల్టీ మిస్ చేయడం మెస్సీకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలితే, మరోవైపు రొనాల్డో మాత్రం ఇప్పటికే దూసుకుపోతున్నాడు.
రెండేళ్ల క్రితం మెస్సీ చేయలేకపోయింది రొనాల్డో చేసి చూపించాడు. యూరో 2016 టోర్నమెంట్‌లో తన జట్టుకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టాడు.
రొనాల్డో మెరుపులు అంతటా కనిపించాయి. కానీ ఫైనల్లో 22 నిమిషాల తర్వాత అతడు గాయపడ్డాడు. కానీ ఆటగాడి నుంచి కోచ్ అవతారం ఎత్తాడు. మైదానం అంచుల్లో నిలబడి, తన జట్టుకు మార్గనిర్దేశం చేశాడు. అతడి నీడలో అసలు కోచ్ మసకబారిపోయాడు.
ఆ గాయమే సాకుగా లేకుంటే, మెస్సీ కూడా అలా ప్రేక్షకుడిలా మారిపోయే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి:
- #FIFA2018: మీరు తప్పక తెలుసుకోవాల్సిన 20 విషయాలు
- పంజాబ్ మత్తుకు.. ఫుట్‌బాల్ మందు
- 1 2 3 గో.. అంకెల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్
- #FIFA2018: దర్శకుడు, రాజకీయ నాయకుడు, దంతవైద్యుడున్న జట్టు ఇది
- ప్రవాసులను అందరికన్నా ఎక్కువగా ఆదరించే దేశం ఇదే
- #FIFA2018: ఫుట్‌బాల్ క్రీడాకారుల మూఢవిశ్వాసాలు, అలవాట్లు, ఆచారాలు
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- ఫుట్‌బాల్: మెస్సీని కలుసుకొనేందుకు రష్యాకు కేరళ యువకుడి సైకిల్ యాత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








