ప్రవాసులను అందరికన్నా ఎక్కువగా ఆదరించే దేశం ఇదే

ప్రవాసితులు, ఐస్‌ల్యాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొదటిసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ఐస్‌ల్యాండ్
    • రచయిత, వలేరియా పెరాసో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలో ప్రవాసులను ఆదరించే 139 దేశాల్లో ఐస్‌ల్యాండ్‌ది మొదటి స్థానం.

ఒకప్పుడు ఇతర ఐరోపా దేశాలకు దూరంగా, కేవలం ఐస్‌ల్యాండ్ జాతి ప్రజలు మాత్రమే ఉన్న ఈ దేశంలో గత దశాబ్ద కాలంగా వలసదారుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. మరి అక్కడ స్థిరపడిన వలస జీవుల జీవితం ఎలా ఉంది?

''ఐస్‌ల్యాండ్ ఫుట్‌బాల్ విషయంలో పిచ్చిదై పోయింది'' అంటారు ఎనిమిదేళ్ల క్రితం అర్జెంటీనా నుంచి వచ్చి ఐరోపాలోని ఈ చిన్న దేశంలో స్థిరపడిన అర్తురో సాంటోని.

అతను స్థానికులతో కలిసి మొదటిసారిగా ప్రపంచకప్‌లో ఆడుతున్న ఐస్‌ల్యాండ్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నాడు. ఆ మ్యాచ్ అర్జెంటీనాతో జరుగుతోంది.

''తమ దేశం, అర్జెంటీనాలాంటి 'పెద్ద దేశం'తో ఆడుతున్నందుకు వాళ్లకు చాలా గర్వంగా ఉంది. కానీ వాళ్లు ఎన్నడూ నాతో అమర్యాదగా ప్రవర్తించలేదు. అసలు వాళ్లు ఎన్నడూ విదేశీయులతో అమర్యాదగా ప్రవర్తించరు'' అని అతను తెలిపాడు.

సాంటోని అభిప్రాయం ఆశ్చర్యకరమేమీ కాదు. విదేశీయులు స్థిరపడడానికి అత్యంత స్నేహపూరితమైన వాతావరణం ఉండే దేశాల జాబితాలో ఐస్‌ల్యాండ్ మొదటి స్థానంలో ఉంది.

ప్రవాసితులు, ఐస్‌ల్యాండ్

ఫొటో సోర్స్, Getty/ CSM

ఫొటో క్యాప్షన్, 2010 నుంచి ఐస్‌ల్యాండ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది

ఉత్తర అట్లాంటిక్ దేశమైన ఐస్‌ల్యాండ్ ఒకప్పుడు ఎవరికీ పట్టని దేశం. 3.5 లక్షల మంది జనాభా ఉన్న ఆ దేశం, సామాజిక సంక్షేమం విషయంలో చాలా పేరొందింది.

2017 గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 10.6 శాతం మంది ఆ దేశానికి ప్రవాసులుగా వచ్చినవారే.

అదే రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ వలసదారుల సంఖ్య జనాభాలో కేవలం 2 శాతం మాత్రమే. అంటే అదిప్పుడు 430 శాతం పెరిగింది.

ప్రవాసితులు, ఐస్‌ల్యాండ్

ఫొటో సోర్స్, Christian Science Monitor

ఫొటో క్యాప్షన్, పర్యాటకులకు స్వర్గధామం లాంటి ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఐస్‌ల్యాండ్‌లో ఎన్నో ఉన్నాయి

అందరికీ సమానావకాశాలు

గత ఏడాది ఐస్‌ల్యాండ్‌కు ఎన్నడూ రానంత మంది కొత్తవాళ్లు వచ్చారు.

అలాంటి వారిలో పెరూ నుంచి వచ్చిన ఫెర్నాండో బాజన్ ఒకరు. అతనికి రెజావిక్ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ రేడియాలజిస్టుగా మంచి ఆఫర్ రావడంతో అతను ఐస్‌ల్యాండ్ వచ్చేశాడు.

''అందరికీ సమానావకాశాలు కల్పించే దేశాలలో ఇది ఒకటి కావడం వల్ల ఐస్‌ల్యాండ్‌ నన్ను ఆకర్షించింది'' అన్నారు బాజన్.

రెజావిక్ వీధులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజధాని రెజావిక్

అత్యంత పేద దేశం నుంచి అత్యంత ధనిక దేశం దిశగా..

స్వేచ్ఛా విఫణి విధానాల కారణంగా గత అర్ధ శతాబ్ద కాలంలో ఐస్‌ల్యాండ్ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పెరుగుదల ఉంది.

ఒకప్పుడు ఐరోపాలోని అత్యంత పేద దేశం నుంచి ఐస్‌ల్యాండ్ అత్యంత ధనిక దేశంగా మారింది. దీని కారణంగా ప్రస్తుతం ఆ దేశం తీవ్రమైన కార్మిక కొరతను ఎదుర్కొంటోంది.

ఐస్‌ల్యాండ్‌ వ్యాపార సంస్థల సమాఖ్య బిజినెస్ ఐస్‌ల్యాండ్, ఏటా 2.5-3 శాతం పెరుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థలో ఏడాదికి సుమారు 3 వేల మంది కొత్త కార్మికులు అవసరమని అంచనా వేస్తోంది.

దేశ నిరుద్యోగ రేటు కేవలం 2.2 శాతం కన్నా కొద్దిగా తక్కువ కావడం వల్ల విదేశాల నుంచి కొత్తగా ఉద్యోగులు అవసరం అవుతారు.

రెజావిక్ వీధులు

ఫొటో సోర్స్, Andalu

ఫొటో క్యాప్షన్, రెజావిక్ వీధులు

ఐస్‌ల్యాండ్‌కు వలస వస్తున్న వారిలో పోలిష్ జాతీయులు ఎక్కువగా ఉంటున్నారు. 2017లో మొత్తం ప్రవాసం వచ్చిన వారిలో 38.3 శాతం వారే ఉన్నారు. ఆ తర్వాత లిథువేనియన్లు 5.2 శాతం కాగా, ఫిలిపినోలు 4.5 శాతం.

11 ఏళ్ల క్రితం ఐస్‌ల్యాండ్‌కు ప్రవాసం వచ్చిన తోమాస్జ్ చ్రాపెక్, తాము వచ్చిన కొన్ని రోజుల్లోనే అక్కడ పని దొరికిందని తెలిపారు.

అయితే 2008లో దేశంలోని మూడు అతి పెద్ద బ్యాంకులు దివాలా తీసినపుడు మాత్రం హఠాత్తుగా ఐస్‌ల్యాండ్‌కు ప్రవాసం వచ్చేవారి సంఖ్య తగ్గింది.

అయితే 2011 నాటికి వేగంగా కోలుకున్న ఐస్‌ల్యాండ్‌ జీడీపీ మరోసారి పెరిగింది. దీంతో తిరిగి 2012 నుంచి ప్రవాసం వచ్చే వారి సంఖ్య పెరిగింది.

ఇటీవల ఐస్‌ల్యాండ్‌కు పర్యాటకుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. 2010-2017 మధ్య కాలంలో ఐస్‌ల్యాండ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. దీంతో రెజావిక్‌లో హోటళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

తోమాస్జ్, ఇజబెలా
ఫొటో క్యాప్షన్, పోలెండ్ నుంచి వచ్చి ఐస్‌ల్యాండ్‌లో స్థిరపడిన తోమాస్జ్, ఇజబెలా

చదువు ఖర్చు ప్రభుత్వానిదే

ఐస్‌ల్యాండ్‌కు వలస రావడమంటే చాలా మందికి కేవలం ఒక మంచి ఉద్యోగం దొరకడం మాత్రమే కాదు. పిల్లల పెంపకం విషయంలో కూడా ఇదొక మంచి దేశమని చాలా మంది భావిస్తారు.

35 ఏళ్ల ఇజబెలాకు మూడేళ్ల కూతురు ఉంది. ఒంటరి తల్లులకు ప్రభుత్వం చాలా సాయం చేస్తుందని, పిల్లలకు చాలా అవకాశాలున్నాయని, చదువు కూడా చాలా బాగుంటుందని ఆమె తెలిపింది.

ఐస్‌ల్యాండ్‌లో ప్రాథమిక విద్య ఖర్చును చాలావరకు ప్రభుత్వమే భరిస్తుంది. చదువు విషయంలో ఐస్‌ల్యాండ్ ప్రపంచంలోని అత్యంత విద్యాధిక దేశాల జాబితాలో ఫిన్లాండ్, నార్వేల తర్వాత స్థానంలో ఉంది.

పిల్లలకు ఐస్‌ల్యాండ్‌ అత్యంత సురక్షితమైన దేశమని స్పెయిన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన 29 ఏళ్ల అజహరా బెజరానో తెలిపారు.

ఇక్కడ నేరాల రేటు అతి తక్కువ.

అత్యున్నత ప్రమాణాలకు పేరొందిన ఐస్‌ల్యాండ్‌ విద్యావ్యవస్థ

ఫొటో సోర్స్, Christian Science Monitor

ఫొటో క్యాప్షన్, అత్యున్నత ప్రమాణాలకు పేరొందిన ఐస్‌ల్యాండ్‌ విద్యావ్యవస్థ

అయితే ఐస్‌ల్యాండ్ సమాజంలో కలిసిపోవడం మాత్రం అంత సులభం కాదని ప్రవాసులు అంటారు.

స్థానిక సమాజంలో కలిసి పోవాలంటే ఐస్‌ల్యాండిక్ భాష మాట్లాడడం చాలా ముఖ్యం. అయితే చాలా మంది వలసదారులకు ఇది చాలా కష్టమైన విషయం.

''తమ సంస్కృతిని ఎక్కడ కోల్పోతామో అని స్థానికులలో భయం. అందుకే ప్రవాసులు వేరే భాషలో మాట్లాడితే స్థానికులు చాలా ఆందోళన చెందుతారు'' అని తోమాస్జ్ చ్రాపెక్ తెలిపారు.

నివాస సమస్యలు ఎదుర్కొంటున్న ప్రవాసితులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నివాస సమస్యలు ఎదుర్కొంటున్న ప్రవాసులు

సాంస్కృతిక ఘెట్టోలు

అతి క్లిష్టమైన వ్యాకరణం, ఉచ్చారణ కలిగిన ఐస్‌ల్యాండిక్ భాష నేర్చుకోవడం చాలా కష్టమని వలసదారులు చెబుతారు.

''ఐస్‌ల్యాండ్ సమాజంలో భాగం కావడం చాలా కష్టం'' అని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఇక్కడికి ప్రవాసం వచ్చిన పోలిష్ అమెరికన్ మెకీగ్ చిమిలెవ్‌స్కీ అంటారు.

ఐస్‌ల్యాండ్ ప్రజలేమీ జాత్యహంకారులు కాకున్నా, వాళ్లు అంత తొందరగా ఇతరులతో కలిసిపోరు అనేది ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి అభిప్రాయం.

అంతే కాకుండా విదేశీయులను ఐస్‌ల్యాండ్ సమాజంలో భాగం చేయడానికి పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదని ప్రవాసులు అంటున్నారు. దీని వల్ల ఐస్‌ల్యాండ్‌లో సాంస్కృతిక ఘెట్టోలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.

విదేశాల నుంచి వచ్చినవారు ఐస్‌ల్యాండ్ సమాజంలో కలిసిపోవడం చాలా కష్టం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విదేశాల నుంచి వచ్చినవారు ఐస్‌ల్యాండ్ సమాజంలో కలిసిపోవడం చాలా కష్టం

మారుతున్న పరిస్థితులు

ఐస్‌ల్యాండ్‌కు వలస వస్తున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తన విధానాలలో మార్పులు చేస్తోంది.

దీనిలో భాగంగా ప్రభుత్వం ఒక బహుళ సాంస్కృతిక మండలిని ఏర్పాటు చేసింది. దీనిలో విదేశాలలో జన్మించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు నగర పాలకులకు ప్రవాసుల విషయంలో సలహాదారులుగా ఉంటారు.

క్యూబాకు తమీలా గామెజ్ అలాంటి వారిలో ఒకరు. తాము ప్రభుత్వానికి, ప్రవాసులకు మధ్య వారధిలాంటి వారమని గామెజ్ తెలిపారు.

ప్రవాసులు ఎదుర్కొనే సమస్యల్లో నివాస సదుపాయాలు, జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉండడం ప్రధానమైనవి.

ఐస్‌ల్యాండ్ వాణిజ్య సంస్థల అంచనా ప్రకారం, 2040 నాటికి దేశంలోని మొత్తం జనాభాలో 20 శాతం మంది వలసదారులే ఉంటారు.

''ఈ దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఐస్‌ల్యాండ్‌ను మా స్వదేశంగా చేసుకోవడానికి ఇది సరిపోదూ?'' అంటారు గామెజ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)