జపాన్ భూకంపం: ముగ్గురి మృతి, 200 మందికి పైగా గాయాలు

వీడియో క్యాప్షన్, వీడియో: ఒసాకా నగరాన్ని కుదిపేసిన భూకంప దృశ్యాలు

జపాన్, ఒసాకాలో తీవ్ర భూప్రకంపనలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. భూకంపంలో 200 మందికి పైగా గాయపడ్డారు.

భూకంపం వచ్చిన ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాలను కొన్ని గంటలపాటు మూసివేశారు. రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేశారు.

6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఆ ప్రాంతంలో ఉన్న అణు ప్లాంట్లు మామూలుగానే పనిచేశాయి.

ప్రపంచంలో 6.0 లేదా అంతకు మించి వచ్చే భూ ప్రకంపనల్లో 20 శాతం జపాన్‌లోనే సంభవిస్తాయి.

జపాన్ భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

జపాన్ భూకంపం

ఫొటో సోర్స్, Reuters

ఒసాకాలో సోమవారం స్థానిక కాలమానం ప్రకారం 8.00 గంటలకు కాస్త ముందు (జీఎంటీ 23:00 ఆదివారం) నగరానికి ఉత్తరంగా భూమి కంపించిందని వాతావరణ సంస్థ తెలిపింది.

ముగ్గురు మృతుల్లో ఒకరైన తొమ్మిదేళ్ల చిన్నారి, స్కూల్లో ఉన్నప్పుడు గోడ కూలడంతో చనిపోయింది.

మరో చోట గోడ కూలి ఒక వృద్ధుడు మరణించగా, భూకంపానికి ఇంట్లో ఉన్న పుస్తకాల ర్యాక్ పడడంతో మరో వ్యక్తి చనిపోయడని జాతీయ వార్తాసంస్థ ఎన్‌హెచ్‌కే తెలిపింది.

జపాన్ భూకంపం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సూపర్ మార్కెట్లలో భూకంపం ప్రభావం

భూకంపం వచ్చినపుడు చాలా మంది లిఫ్టుల్లో చిక్కుకుపోయారు. రోడ్లకు పగుళ్లు రాగా, చాలా చోట్ల పైపులు పగిలి నీళ్లు బయటకు చిమ్మాయి.

లక్షా 70 వేలకు పైగా ఇళ్లలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. లక్ష ఇళ్లకు ఈ సేవలను నిలిపివేశారు.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ స్థాయి భూ ప్రకంపనలు వచ్చినపుడు నిలబడడం కూడా కష్టమవుతుంది.

జపాన్ భూకంపం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గంటలపాటు నిలిచిపోయిన రైలు సేవలు

ఉదయం వేళల్లో హై స్పీడ్ షింకాసెన్, స్థానిక రైళ్ల సేవలు నిలిపివేశారు. క్యోటో, నారా, హ్యోగో, షిగా నగరాలపై కూడా భూకంపం ప్రభావం కనిపించింది.

రాబోవు రోజుల్లో మరోసారి భారీ ప్రకంపనలు రావచ్చని వాతావరణ సంస్థ హెచ్చరించింది.

జపాన్ భూకంపం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మార్గమధ్యలో ఆగిపోయిన రైళ్లు

కొన్నిరోజుల పాటు వర్షం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

భూకంపంతో ఒసాకా సమీపంలో పానసోనిక్, డైహట్సు లాంటి చాలా పారిశ్రామిక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పరిశ్రమల్లో ఉత్పత్తిని నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)