'తల్లిదండ్రులను, పిల్లలను వేరు చేసే ట్రంప్ వలస విధానం తప్పు'

మెలానియా

ఫొటో సోర్స్, Reuters

మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే తల్లిదండ్రులను, వారి పిల్లలను వేరు చేసే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానంపై ఆయన భార్య, దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ స్పందించారు.

''మన దేశం అన్ని చట్టాలను పాటించాల్సిన అవసరముంది. అదే సమయంలో మనసుతో ఆలోచించి పాలన సాగించాల్సిన అవసరం కూడా ఉంది'' అని మెలానియా వ్యాఖ్యానించారు. కుటుంబాలకు చిన్నారులు దూరం కావడాన్ని తాను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. విజయవంతం కాగల వలస సంస్కరణ కోసం ఇరు పక్షాలు (రిపబ్లికన్లు, డెమోక్రాట్లు) కలసికట్టుగా పనిచేయాలని ఆమె కోరారు.

అక్రమ వలసలను ఏ మాత్రం సహించేది లేదనే ట్రంప్ కఠిన విధానం ఇప్పటికే వివాదాస్పదం అయ్యింది. ట్రంప్ విధానం కారణంగా ఇటీవల ఆరు వారాల వ్యవధిలో దాదాపు రెండు వేల కుటుంబాల్లోనివారు ఒకరికొకరు దూరమయ్యారు.

ఏప్రిల్ 19, మే 31 మధ్య 1,940 మంది వయోజనులను నిర్బంధంలోకి తీసుకోగా, 1,995 మంది మైనర్లు వారికి దూరమయ్యారని అమెరికా అంతర్గత భద్రత విభాగం గణాంకాలు చెబుతున్నాయి.

ఏడుస్తున్న చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

విమర్శిస్తున్న హక్కుల సంఘాలు

సరిహద్దులు దాటి మెక్సికోలోంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వయోజనులను అధికారులు అదుపులోకి తీసుకొని, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు చర్యలు చేపడుతున్నారు. వారి పిల్లలను నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో వందల మంది మైనర్లు తల్లిదండ్రులకు దూరమవుతున్నారు.

మెక్సికో నుంచి ఇలా వచ్చే వలసదారుల్లో అమెరికాలో ఆశ్రయం కోరి వచ్చేవారే ఎక్కువ మంది ఉన్నారు.

తల్లిదండ్రులను, పిల్లలను వేరు చేయడానికి కారణమవుతున్న ట్రంప్ విధానాన్ని హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇలాంటి విధానం ముందెన్నడూ లేదని విమర్శిస్తున్నాయి.

ట్రంప్

ఫొటో సోర్స్, AFP/Getty Images

డెమోక్రాట్లపై ట్రంప్ ఆరోపణ

మెక్సికో నుంచి వలసల విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడానికి డెమోక్రాట్లు తెచ్చిన చట్టమే కారణమని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. అయితే ఏ చట్టాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారనేది స్పష్టం కాలేదు.

ఈ చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు రిపబ్లికన్లతో కలిసి పనిచేయాలని డెమోక్రాట్లకు పిలుపునిస్తూ ట్రంప్ శనివారం ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ విధానాన్ని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ మేలో ప్రకటించారని, దీని అమలును ఆపడానికి అమెరికా పార్లమెంటు అయిన కాంగ్రెస్ చర్య చేపట్టాల్సిన అవసరం లేదని విమర్శకులు చెబుతున్నారు.

చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు

ఈ విధానంపై పాలక రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేయడం కొత్తేమీ కాదని, ఎప్పుడూ ఉన్నదేనని ఈ విధానాన్ని సమర్థించే నాయకులు పేర్కొంటున్నారు.

పసికందులను, శిశువులను కూడా నిర్బంధంలో ఉంచుతుండటంతో కొన్ని శిబిరాలు, వసతి గృహాల్లో ఉండటానికి స్థలం సరిపోవడం లేదు.

కాంగ్రెస్‌లో సభ్యులైన డెమోక్రాట్లు పలువురు ఆదివారం పితృ దినోత్సవం(ఫాదర్స్ డే) సందర్భంగా న్యూజెర్సీలో ఉన్న 'ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ)' నిర్బంధ కేంద్రానికి ఆకస్మికంగా వచ్చి, పిల్లలకు దూరమైన తల్లిదండ్రులను తమకు చూపించాలని అధికారులను పట్టుబట్టారు.

నిరసన

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన

టెక్సాస్ ఎడారిలో ఏర్పాట్లు

మరింత మంది మైనర్లను ఉంచేందుకు వీలుగా టెక్సాస్ ఎడారి ప్రాంతంలో శిబిరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. అక్కడ తరచూ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుతుంటుంది.

అధికారుల ప్రకటనపై టెక్సాస్ రాష్ట్ర సెనేట్‌లో సభ్యుడైన జోస్ రోడ్రిగ్యూయెజ్ స్పందిస్తూ- ఈ ఆలోచన అమానవీయమైనదని, దారుణమైనదని ఖండించారు. మనుషుల పట్ల నైతిక బాధ్యతగల వారందరూ ఈ చర్యను ఖండించాలని చెప్పారు.

టెక్సాస్‌లోని సరిహద్దు పట్టణం టోర్నిలోలో వందల మంది చిన్నారులను ఉంచిన ఒక శిబిరం వద్ద ఈ విధానం వ్యతిరేకులు ఆదివారం ప్రదర్శన చేపట్టారు.

చాలా సందర్భాల్లో, అరెస్టయిన తల్లిదండ్రులు విడుదలైన తర్వాత వారు, శిబిరాల్లోని వారి పిల్లలు తిరిగి కలుసుకొంటుంటారు. కొన్ని సందర్భాల్లో నెలలపాటు ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వస్తోంది.

అక్రమ వలసల కేసుల్లో నిర్బంధాల కారణంగా కుటుంబ సభ్యులు ఒకరికొకరు దూరమైన సందర్భాలు గత అధ్యక్షుల హయాంలోనూ ఉన్నాయని, అప్పట్లో ఈ సంఖ్య చాలా చిన్నగా ఉండేదని, ట్రంప్ హయాంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉందని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

కుటుంబాల్లోని వారు ఇలా ఒకరికొకరు దూరం కావడాన్ని నివారించాలని అమెరికాను ఐక్యరాజ్యసమితి కోరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)