#FIFA2018: పీలేకి ఆ పేరు ఎలా వచ్చింది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వరల్డ్ కప్ ఫుట్‌బాల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు బ్రెజిల్.
ప్రస్తుత సమయంలో తిరుగులేని ఫార్వర్డ్ అయిన, షుమార్ నేమార్ నాయకత్వంలో గత ప్రపంచ కప్ పరాజయాన్ని మర్చిపోయి బ్రెజిల్ జట్టు ముందుగు సాగాల్సి ఉంటుంది.
2014లో తన సొంత మైదానంలో అంచనాలను అందుకోలేక పోయిన బ్రెజిల్ పేలవమైన ప్రదర్శనతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
కానీ ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ఇదే.
ఐదు సార్లు బ్రెజిల్ ప్రపంచ కప్ విజేతగా నిలవడంలో ఎక్కువ భాగస్వామ్యం ఉన్న ఆటగాడు ఒకే ఒక్కడు.
అతనే ఎడ్సన్. ప్రపంచమంతా అతడిని పీలే అని పిలుచుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పీలే చరిష్మా
ఫుట్‌బాల్ మాంత్రికుడుగా పిలిచే పీలే చరిష్మా ఎలాంటిదంటే.. వేరే ఏ ఫుట్‌బాల్ ఆటగాడూ ఇప్పటివరకూ కనీసం అతడి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాడు.
పీలే జట్టులో ఉన్నప్పుడు బ్రెజిల్ 1958, 1962, 1970లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలుచుకుంది. మూడు వరల్డ్ కప్‌లు సాధించిన పీలే ప్రపంచంలో ఆ ఘనత దక్కించుకున్న ఏకైక ఆటగాడుగా నిలిచాడు.
అంతే కాదు, అత్యంత చిన్న వయసులో ప్రపంచ కప్‌లో గోల్ వేసిన ఆటగాడు, హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన ఆటగాడు, ఫైనల్స్ ఆడిన ఆటగాడు పీలే ఒక్కడే. తను సెట్ చేసిన రికార్డ్ 60 ఏళ్ల తర్వాత కూడా అతడి పేరుపైనే ఉంది.
బ్రెజిల్‌లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు పాపులారిటీ తీసుకొచ్చిన పీలే చేసిన అద్భుతాల్లాగే, అతడి పేరు గురించి కూడా ఆసక్తికరమైన కథ ఉంది.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పీలే పేరుతో ఫేమస్ అయినా ఇతడికి అసలు ఆ పేరే లేదు, పీలే అతడి ముద్దు పేరు కూడా కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి మనిషికీ రెండు ముద్దు పేర్లు
బ్రెజిల్‌లోని చిన్న పట్టణం మినాస్ గెరాయిస్‌లో 1940 అక్టోబర్ 23న పీలే పుట్టాడు. అతడి తండ్రి ఒక క్లబ్ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాడు. తల్లి గృహిణి.
అమ్మనాన్నలు తమ బిడ్డకు 'ఎడ్సన్' అనే పేరు పెట్టారు.
ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటో కూడా పీలే తన జ్ఞాపకాలు "వై సోకర్ మేటర్స్"లో చెప్పాడు. "నేను ఎప్పుడైతే పుట్టానో, సరిగ్గా అప్పుడే మా పట్టణంలోకి విద్యుత్ బల్బు వచ్చింది.
బల్బు వెలుగు చూసి మా అమ్మనాన్నలు ఆశ్చర్యపోయారు. బల్బు తయారు చేసిన థామస్ అల్వా ఎడిసన్‌పై గౌరవంతో నాకు ఎడిసన్ అనే పేరు పెట్టారు. కానీ పొరపాటున వాళ్లు స్పెలింగ్‌లో ఐ అక్షరం పెట్టలేకపోయారు".
అలా పీలే పేరు ఎడ్సన్ అయ్యింది. పూర్తి పేరు ఎడ్సన్ ఎరెంట్స్ నాసిమెంటో. బ్రెజిల్ ఇలా పేర్లను చాలా పొడవుగా పెట్టుకుంటారు. దాంతో కొంతమంది ముద్దు పేర్లతో అందరికీ తెలిసేవారు.
బ్రెజిల్‌లో ఒక అంచనా ప్రకారం ప్రతి మనిషికీ ఒకటి రెండు ముద్దు పేర్లు ఉంటాయి. ఇంట్లో అందరూ వాళ్లను ఆ పేర్లతోనే పిలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫుట్‌బాలర్ కావాలని కలలు కన్న కొడుకు
ఎడ్సన్ అంటే పీలేకి కూడా "డికో" అనే ముద్దు పేరు పెట్టారు. అమ్మనాన్నలు, తోబుట్టువులు, స్నేహితులు అందరూ అతడిని డికో అనే పిలిచేవారు.
డికో వాళ్ల నాన్న స్వయంగా ఫుట్‌బాల్ ఆడేవాడు. కానీ 25 ఏళ్ల వయసుకే గాయపడడంతో ఆయన ఫుట్‌బాల్ కెరియర్ క్లబ్ స్థాయి నుంచి ముందుకు వెళ్లలేకపోయింది. అందుకే ఆయన తన కొడుకును ఫుట్‌బాలర్ చేయాలని కలలు కన్నాడు.
అతడి కుటుంబం ఇప్పుడు సావొపోలో బావురూ పట్టణంలో ఉండాలని అనుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
బాల్యంలో లభించిన ట్రైనింగ్‌తో ఆడే పీలే గురించి పట్టణంలోని ప్రతి వీధిలో చర్చించుకునేవారు. కానీ అతడికి వనరుల కొరత బాగా ఉండేది.
పీలే ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలను బంతిలా చేసుకుని దానితో ఫుట్‌బాల్ ఆడేవాడు.
ఒకసారి పక్కనే ఉన్న స్టేషన్లో ఆగిన గూడ్సు రైల్లో వస్తువులు దొంగిలించి, వాటిని అమ్మి బంతి కొనడానికి డబ్బులు పోగేసేవాడు.
9-10 ఏళ్ల వయసులో డికో తన స్నేహితుల కంటే వేగంగా కదిలేవాడు. అతడిని ఎవరూ పట్టుకోలేకపోయేవారు. దాంతో అతడికి "గాసోలినా" అనే పేరు పెట్టారు.
గాలి కంటే వేగంగా పరిగెత్తుతాడు కాబట్టే అతడికి ఆ పేరు పెట్టారు. ఆ పేరు తనకు బాగా నచ్చిందని ఒకసారి పీలే కూడా చెప్పాడు.

మరిన్ని ఫిఫా కథనాలు

కానీ అతడికి పీలే అనే పేరు ఎలా వచ్చింది. దాని గురించి ఎన్నో వాదనలు ఉన్నాయి. వీటిలో ఒక మాట మాత్రం గట్టిగా వినిపిస్తుంది. గెలిక్ భాషలో పీలే అంటే ఫుట్‌బాల్ అనే అర్థం ఉంది. కాబట్టే అతడికి పీలే అనే పేరు వచ్చిందని అంటారు.
కానీ ఆ వాదనలను నిజం అనుకోవడం లేదు. ఎందుకంటే గెలిక్ ఐర్లాండ్ చుట్టుపక్కల మాట్లాడే భాష. ఆ భాషలోని ఈ మాట, కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న బ్రెజిల్‌లోని బావురూ ఎలా చేరి ఉంటుంది. దీనికి ఎలాంటి ఆధారాలూ లభించలేదు.
పీలే అనే పదం హీబ్రూ భాషలో కూడా ఉంది. దానికి అద్భుతం అనే అర్థం ఉంది. కానీ నైజీరియాలోని ఒక మాట, ఆ సమయంలో బ్రెజిల్ చేరుంటుంది అనుకోవడం అసంభవం.
అలాంటప్పుడు పీలేకు ఆ పేరు ఎలా వచ్చింది అనేదే ప్రశ్న. ఆ సమయంలో బ్రెజిల్‌లో పోర్చుగల్ భాష వాడుకలో ఉండేది. ఆ భాషలో పీలే అనే మాటకు ఎలాంటి అర్థమూ లేదు.
కానీ, అతడికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, బ్రెజిల్‌లోని ప్రముఖ క్లబ్ అయిన శాంటోస్‌లో చేరేసరికే అతడని పీలే అనేవారు.
పీలే అనే పేరు వెనుక ఉన్న నిజం గురించి పీలే "వై సాకర్ మేటర్స్"లో చెప్పాడు. పీలే అనే పేరు ఎలా వచ్చిందో అంత కచ్చితంగా తెలీదని అన్నాడు. కానీ తన మామ జార్జ్ చెప్పిన దానిపై తనకు నమ్మకం ఉందన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
పీలే మామ జార్జ్ తనతోపాటే ఉండేవాడు. చాలా ఏళ్ల పాటు ఆయన చేసే ఉద్యోగం వల్లే పీలే కుటుంబం రోజు గడుస్తూ వచ్చింది.
జార్జ్ పీలే పేరు గురించి చెప్పాడు. "బావురూలోని ఒక స్థానిక క్లబ్ టీమ్‌లో ఒక గోల్ కీపర్‌కు 'బిలే' అనే పేరు ఉండేది. అదే క్లబ్‌లో పీలే నాన్న కూడా ఆడారు. 'బిలే' తన అద్భుతమైన గోల్ కీపింగ్‌తో పాపులర్ అయ్యాడు".
"మరోవైపు డికో చిన్నప్పుడు చాలా మ్యాచుల్లో గోల్ కీపర్ పాత్ర కూడా పోషించాల్సి వచ్చేది. ఎప్పుడైనా అద్భుతంగా గోల్ అడ్డుకున్నప్పుడు, జనమంతా అదిగో మరో 'బిలే' వచ్చాడు అని, లేదంటే చూడు, తను 'బిలే'లా ఫోజు కొడుతున్నాడు అనేవారు".
అలా చూస్తూ, చూస్తూనే అది పీలేగా మారిపోయింది. అలా జరుగుతుందని అసలు అనుకోలేదు. అయినా ఒకప్పుడు తనను పీలే అని పిలిచారని డికో మిగతావారితో గొడవపడేవాడు.
"అలా ఎందుకు పిలుస్తావ్. నా పేరు సరిగ్గా పలకడం రాదా" అని కోప్పడేవాడు.
అయితే, చుట్టుపక్కల వాళ్లకు అతడి పేరు పీలే అనే అనుకునేవారు. కానీ శాంటోస్ క్లబ్‌లో చేరిన తర్వాతే, అధికారికంగా అతడిని పీలే అని పిలవడం ప్రారంభమైంది.
పీలే పేరును ఒక బ్రాండ్‌గా మార్చడంలో శాంటోస్ నిర్వాహకులు కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు.
దీని గురించి ప్రస్తావించిన పీలే తన వై సాకర్ మేటర్స్ పుస్తకంలో రాశాడు. "పీలే అనే పేరు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయిపోయింది. ఎడ్సన్, బావురూ నుంచి వచ్చిన ఒక పేద బాలుడు. అతడికి తన ఇల్లు, కుటుంబం గుర్తుకొచ్చేది.
కానీ మరోవైపు పీలే టీనేజ్‌లోనే రైజింగ్ స్టార్ అయిపోయాడు. అతడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆటగాడు అవుతాడని ఆశలు పెట్టుకున్నారు" అని చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









