క్రిస్టియానో రొనాల్డో: పన్ను ఎగవేత కేసులో 150 కోట్ల జరిమానా కట్టేందుకు సిద్ధం

ఫొటో సోర్స్, Reuters
ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో పన్ను ఎగవేత కేసును సెటిల్ చేసుకోవటం కోసం 1.64 కోట్ల పౌండ్ల (1.88 కోట్ల యూరోలు - సుమారు 150 కోట్ల రూపాయలు) జరిమానా, రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష (శిక్షను సస్పెన్షన్‌లో ఉంచుతారు)కు అంగీకరించినట్లు చెప్తున్నారు.
రియల్ మాడ్రిడ్, పోర్చుగల్ జట్ల తరపున ఆడే రొనాల్డో (33) పన్ను అధికారులను 1.48 కోట్ల యూరోల (సుమారు 118 కోట్ల రూపాయలు) మేర మోసం చేసినట్లు గత ఏడాది ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆయన నిరాకరిస్తున్నారు.
2017 జూన్‌లో తాను 1.29 కోట్ల పౌండ్లు (సుమారు 118 కోట్ల రూపాయలు) చెల్లించటానికి సిద్ధంగా ఉన్నానని రొనాల్డో ముందుకొచ్చారని, అయితే ప్రభుత్వం దానిని తిరస్కరించిందని ఎల్ ముండో వార్తాపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
వరల్డ్ కప్ పోటీల్లో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించటానికి ముందు ఈ వార్త వెలువడింది.
ఫుట్‌బాల్ క్రీడాకారులు పన్ను ఎగవేయటం మీద స్పెయిన్ కోర్టులు ఇటీవల తీవ్ర చర్యలు చేపట్టాయి.
ప్రస్తుతం మౌఖికంగా జరిగిందని చెప్తున్న తాజా ఒప్పందం మేరకు రొనాల్డో జైలులో ఉండే అవకాశం లేదు. స్పెయిన్ చట్టం ప్రకారం.. మొదటి నేరానికి విధించే రెండేళ్ల జైలు శిక్షను.. జైలు నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేకుండా ప్రొబేషన్‌లో పూర్తి చేయవచ్చు.
ఇలాంటి ఒప్పందం ఏదైనా స్పెయిన్ పన్ను విభాగం ఆమోదించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, EPA
రొనాల్డో 2011 - 2014 మధ్య ఫొటోలు, వీడియోల హక్కులకు సంబంధించిన ఆదాయాన్ని దాచేయటానికి ప్రయత్నించారని పన్ను అధికారులు ఆరోపించారు.
ఈ ఆరోపణలను ఆయన తిరస్కరించారు. తాజా వార్తలపై ఆయన సంస్థ ఇంకా స్పందించలేదు.
అయితే.. ఈ వార్తలు వెలువడిన సమయం పలు సందేహాలను లేవనెత్తింది. రష్యాలోని సోచి నగరంలో ఫస్ట్ ఒలింపిక్ స్టేడియంలో స్పెయిన్‌తో జరిగిన పోటీలో పోర్చుగల్ తరఫున ఆయన బరిలోకి దిగటానికి కేవలం కొన్ని గంటల ముందు ఈ వార్త బయటకు వచ్చింది.
అతడి ప్రదర్శన మీద ఇది ప్రభావం చూపలేదు. ఆయన మూడు గోల్స్ సాధించారు. చివరిగా సాధించిన గోల్‌తో ఇరు జట్ల స్కోరు 3-3 తో సమమైంది.
స్పెయిన్ గతంలో ఫుట్‌బాల్ క్రీడాకారులకు పన్ను మినహాయింపు ఇచ్చింది. దానిని ‘‘బెక్‌హామ్ లా’’ అని వ్యవహరించేవారు. కానీ 2010లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవటంతో ఆ మినహాయింపును స్పెయిన్ రద్దు చేసింది.
రోనాల్డో తరహాలోనే బార్సిలోనా క్రీడాకారుడు లయనెల్ మెస్సీ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయనకు 21 నెలల జైలు శిక్ష విధిస్తూ 2017లో తీర్పు చెప్పారు. అయితే.. ఆయన జైలు శిక్షకు బదులుగా జరిమానా కట్టి బయటపడ్డారు.
ఇవి కూడా చూడండి:
- పంజాబ్ మత్తుకు.. ఫుట్‌బాల్ మందు
- సౌదీలో తొలిసారి: స్టేడియాల్లోకి మహిళలు
- #FIFA2018: 12 మైదానాలు, రూ.23వేల కోట్లు
- #FIFA2018: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ విజేత ఎవరో అంచనా వేయండి
- రాషిద్ ఖాన్: పాకిస్తాన్లో క్రికెట్ నేర్చుకున్నా.. భారతీయుల ద్వారా ప్రేమించటం నేర్చుకున్నా
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









