ఐన్‌స్టీన్‌లో జాత్యహంకార కోణం

ఫొటో సోర్స్, Getty Images
విఖ్యాత శాస్ర్తవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు విద్వేష భావజాలం ఉండేదా? ఆసియా, మధ్య ప్రాచ్య దేశాల ప్రజలంటే ఆయనకు చిన్నచూపు ఉండేదా?
ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్తున్నాయి ఆయన డైరీలు. 1922 అక్టోబరు నుంచి 1923 మార్చి మధ్య ఆసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో పర్యటించిన ఆయన అక్కడి అనుభవాలను తన డైరీల్లో రాసుకున్నారు.
అందులో ఆయన అందరికీ వర్తించేలా, సాధారణీకరిస్తూ కొన్ని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. చైనీయులను శ్రమజీవులు, మురికి మనుషులుగా అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP/Getty
'వారు పరమ మురికిలో, దుర్గంధంలో ఉంటారు’
'ది ట్రావెల్ డైరీస్ ఆఫ్ అల్బర్ట్ ఐన్‌స్టీన్: ది ఫార్ ఈస్ట్, పాలస్తీనా, స్పెయిన్, 1922-1923' పేరిట ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రెస్ వీటిని ఇంగ్లిష్‌లో ప్రచురించింది.
1922 నుంచి 1923 మధ్య ఐన్‌స్టీన్ స్పెయిన్ నుంచి మొదలుపెట్టి మధ్య ప్రాచ్య దేశాలు, సిలోన్(ప్రస్తుత శ్రీలంక), చైనా, జపాన్‌లోనూ పర్యటించారు.
కొలంబోలో ఆయన ఉన్నప్పుడు అక్కడి ప్రజల గురించి ''వారు పరమ మురికిలో ఉంటారు.. దుర్గంధం మధ్యే ఉంటారు. వాళ్లకు పని తక్కువ, అవసరాలూ తక్కువే'' రాసుకున్నారు.
ఇక చైనా వెళ్లాక అక్కడి పిల్లలను చూసి.. వారు ఏమాత్రం స్ఫూర్తిలేనివారని, వారికి ఏదీ ఒక పట్టాన అర్ధం కాదని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
మారిన మనిషి
సైన్సులో అపార ప్రజ్ఞావంతుడు, మానవతావాదిగా పేరున్న ఐన్‌స్టీన్ 1933లో జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు.
పెన్సిల్వేనియాలోని లింకన్ యూనివర్సిటీలో 1946లో ఆయన తన ఉపన్యాసంలో 'శ్వేత జాతీయులకున్న రోగం జాతి వివక్ష' అని పేర్కొన్నారు.
అలాంటిది ఆయన రాసుకున్న డైరీల ఆధారంగా ప్రచురించిన పుస్తకం ఇప్పుడు ఆయనలోని వివక్ష కోణాన్ని బయటకు తీయడం చర్చనీయంగా మారింది.
అయితే, ఈ డైరీల కాలానికి ఆయనకు ఉన్న అభిప్రాయాలు అనంతర కాలంలో మారి ఆయన్ను మానవతావాదిగా మార్చాయన్న అభిప్రాయమూ ఉంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








