కార్గిల్ జవాను తనయుడు: తండ్రి బాటనే.. తండ్రి పని చేసిన బెటాలియన్‌లోనే

హితేశ్

ఫొటో సోర్స్, Prasant kumar

    • రచయిత, ప్రీత్ గరాల
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తాను పని చేసిన ఆర్మీ బెటాలియన్‌లోనే తన కొడుకు కూడా చేరినపుడు ఆ తండ్రి ఆనందానికి హద్దే ఉండదు. కానీ, తన తనయుడు సాధించిన ఘనతను చూసుకొని మురిసిపోయే అదృష్టం లాన్స్ నాయక్ బచ్చన్ సింగ్‌కు దక్కలేదు.

ఎందుకంటే లాన్స్ నాయక్ బచ్చన్ సింగ్ కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించారు. అయితే ఇప్పుడు ఆయన కొడుకు సైన్యంలోకి ప్రవేశించి, తన తండ్రి పనిచేసిన బెటాలియన్‌లోనే లెఫ్టినెంట్‌గా చేరారు.

రాజపుతానా రైఫిల్స్ రెండో బెటాలియన్‌లో బచ్చన్ సింగ్ లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తించారు. కార్గిల్ యుద్ధం సమయంలో టొలోలింగ్ పర్వత శ్రేణుల్లో పనిచేశారు.

1999 జూన్ 12 న అక్కడే పోరాడుతూ చనిపోయారు. అప్పుడు ఆరేళ్ల వయసున్న అతని కుమారుడు హితేశ్ కుమార్ తాను కూడా తండ్రిలాగే సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు.

హితేశ్

ఫొటో సోర్స్, Hitesh kumar

19 ఏళ్ల వయసులో దెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో హితేశ్ శిక్షణ పొందారు.

ఆ తర్వాత తండ్రి పనిచేసిన రాజపుతానా రైఫిల్స్ బెటాలియన్‌లోనే లెఫ్టినెంట్‌గా చేరారు.

‘‘19 ఏళ్ల నుంచి నాది ఒక్కటే కల. అమ్మ కోరిక కూడా అదే. ఇప్పుడు మా ఆశయం నెరవేరింది. నా దేశానికి నిజాయితీగా సేవచేస్తా’’ అని హితేశ్ బీబీసీతో అన్నారు.

గత శనివారం పాసింగ్ ఔట్ పరేడ్ ముగిసిన వెంటనే, హితేశ్ కుటుంబం ముజఫర్ నగర్ (స్వగ్రామం) వెళ్లి తండ్రి విగ్రహానికి నివాళి అర్పించింది.

అమ్మ కష్టం, ఆమె ప్రార్థనల వల్లే తానీ లక్ష్యాన్ని చేరుకున్నానని హితేశ్ అన్నారు.

తన మేనమామ రుషిపాల్ సింగ్ కూడా తన తండ్రి పనిచేసిన బెటాలియన్‌లోనే పనిచేస్తున్నారని తెలిపారు.

హితేశ్

ఫొటో సోర్స్, Prasant Kumar

''శత్రువులు అప్పుడు కార్గిల్‌లోని టొలోలింగ్‌ను స్వాధీనం చేసుకోడానికి దాడికి దిగారు. ఆ పోరులో మేం 17 మంది సైనికులను కోల్పోయాం. బచ్చన్ సింగ్ తల నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయన బతికుంటే హితేష్‌ సాధించిన ఘనతకు గర్వించేవాడు'' అని రుషిపాల్ సింగ్ చెప్పారు.

"నాకున్న ఏకైక కల మా ఆయనలాగే మా అబ్బాయిని సైనికుడిగా చూడటం" అని హితేశ్ తల్లి కామేశ్ బాలా అన్నారు.

హితేశ్

ఫొటో సోర్స్, Prasant Kumar

''నాకింకా ఏ కోరికలు లేవు. వాళ్ల తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమైంది. హితేశ్ ఆర్మీలో చేరడం నాకు గర్వంగా ఉంది. నా చిన్న కొడుకు హేమంత్ కూడా ఆర్మీలో చేరాలని అనుకుంటున్నాడు'' అని బాలా తెలిపారు.

హితేశ్

ఫొటో సోర్స్, Prasant kumar

‘‘ఆ రోజు మేం అందరం మా తాతయ్య వాళ్ల ఇంట్లో ఉన్నాం. నేను హితేశ్‌తో ఆడుకుంటున్నా. అమ్మ ఇంటి పనుల్లో ఉంది. అకస్మాత్తుగా ఫోన్ మోగింది. మామయ్య రుషిపాల్ సింగ్ మాట్లాడారు. మా నాన్న చనిపోయారన్న విషయం ఆయనే చెప్పారు. మేం అంతా షాక్ అయ్యాం. కొన్నాళ్ల తర్వాత నాన్న మృతదేహం ఇంటికి వచ్చింది. మా పొలంలో ఆయన విగ్రహం నిర్మించాం’’ అని హితేశ్ సోదరుడు హేమంత్ బీబీసీతో చెప్పారు.

హితేశ్

ఫొటో సోర్స్, Getty Images

సైన్యంలో చేరడమంటేనే జీవితాన్ని పణంగా పెట్టడం, కానీ, నాన్న బాటలోనే మీరు ఎందుకు వెళ్లారు అని హితేశ్‌ను ప్రశ్నించగా, ‘‘స్కూల్‌లో ఎవరైనా నీ లక్ష్యం ఏంటని అడిగితే ఆర్మీలో చేరడం అని చెప్పేవాణ్ని. అందరూ వింతగా చూసేవారు. ఇప్పుడు పేరెంటల్ క్లయిమ్ రైట్ ( తండ్రి యుద్ధంలో మరణిస్తే అతని వారసుడికి అదే బెటాలియన్లో పనిచేసే అవకాశాన్ని కల్పించడాన్ని పేరెంటల్ క్లయిమ్ అంటారు) కింద మా నాన్న పనిచేసిన బెటాలియన్లోనే చేరాను.’’ అని హితేశ్ చెప్పారు.

1999లో టొలోలింగ్‌ను రాజపుతానా రైఫిల్స్ చేజిక్కించుకోవడంతో కార్గిల్ యుద్ధంలో భారత విజయానికి మార్గం సుగమమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)