#FIFA2018: క్రికెట్‌లో ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ ఫుట్‌బాల్‌లో ఎందుకు వెనకబడింది?

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శరత్ బెహరా, శివ ఉళగనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

760 కోట్లు.. ప్రస్తుత ప్రపంచ జనాభా.

736.. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనడానికి ఎంపికైన మొత్తం ఆటగాళ్లు.

అంటే ప్రతి 1.032కోట్ల మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం దొరికింది. అయితే ఆ 736మందిలో ఒక్క భారతీయుడు కూడా లేడు.

ప్రపంచంలో కోట్లాది మంది ఫుట్‌బాల్ ఆడతారు. వాళ్లలో కొన్ని వందల మంది ప్రొఫెషనల్స్‌గా మారతారు. కానీ ఏ కొద్దిమందో అత్యత్తుమ ఆటగాళ్లుగా ఎదుగుతారు.

ఆ కొద్ది మందిలో ఒక్కరిగా మారాలంటే చాలా విషయాల్లో నైపుణ్యం సాధించాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. దానికి అత్యుత్తమ శిక్షణ, సదుపాయాలు, సాధన తోడవ్వాలి.

భారత్‌తో పోలిస్తే అనేక యూరోపియన్, లాటిన్ అమెరికా దేశాలు ఈ ఐదు అంశాల్లో చాలా ముందున్నాయి. దేశంలో ఫుట్‌బాల్ అమితంగా ఇష్టపడే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నా, ప్రపంచ స్థాయితో పోలిస్తే ఈ ఐదు అంశాల్లో వాళ్లు చాలా వెనకబడి ఉన్నారు.

కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మారుతోంది. గత నాలుగేళ్లలో పురుషుల సీనియర్ ఫుట్‌బాల్ జట్టు ర్యాంకు 170 నుంచి 97కి చేరింది. గతేడాది భారత్ విజయవంతంగా అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించింది. ఐఎస్ఎల్, ఐ-లీగ్, యూత్ లీగ్ లాంటి వివిధ లీగ్‌లు కూడా దేశంలో ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నాయి. ఫిఫా కూడా భారత్‌లో ఫుట్‌బాల్‌ విస్తరించేందుకు నిధులు సమకూరుస్తోంది.

దేశంలో ప్రస్తుతం ఫుట్‌బాల్ అత్యుత్తమ దశలో ఉందనీ, ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా మారాలనుకునేవారికి ఇదే సరైన సమయమనీ నిపుణులు అంటున్నారు. కానీ అదంత ఆషామాషీ విషయం కాదు. ప్రొఫెషనల్‌గా ఎదగాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతూనే, సాంకేతిక, వ్యూహాత్మక నైపుణ్యాలను సాధించాలి.

ఫుట్‌బాల్
ఫొటో క్యాప్షన్, వివిధ క్రీడల్లో ఆటగాళ్లు పరుగుపెట్టే సగటు దూరం

శారీరకంగా ఏం కావాలి?

ఫుట్‌బాల్‌లో క్షణక్షణానికీ ఆటగాడి కదలికలు మారిపోతుంటాయి. అత్యంత వేగంగా పరుగెడుతూనే మరుక్షణంలో వేగాన్ని తగ్గించాలి. ఒక దశలో ప్రయాణిస్తున్న బంతిని అప్పటికప్పుడు మరో దిశకు మార్చాలి. ఇవన్నీ చేయాలంటే ఫిట్‌నెస్ అత్యుత్తమ స్థాయిలో ఉండాలి. శరీర శక్తి, స్టామినా, కాళ్లలో బలం, ఫుట్ వర్క్, వేగం లాంటి అనేక అంశాల్లో మెరుగ్గా ఉండాలి. సరైన శిక్షణ, సాధనతోనే అది సాధ్యమవుతుంది.

ఫుట్‌బాల్‌కు పరుగు ప్రాణం లాంటిది. కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు 90 నిమిషాల వ్యవధిలో దాదాపు 14.5కి.మీలు పరుగెత్తుతారు. ఇతర ఆటలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఉదాహరణకు ఒక ఆట ముగిసేసరికి బాస్కెట్‌బాల్‌లో సగటున ఓ ఆటగాడు 2-3.5కి.మీ., టెన్నిస్‌లో 4.5-7.5కి.మీ, హాకీలో 6-7.5కిమీ పరుగెత్తుతాడు. కానీ ఫుట్‌బాల్ ఆ విషయంలో చాలా ముందుంది. సగటున ఒక్కో ఆటగాడు 10.5కి.మీ. నుంచి 14.5కి.మీ., అదీ గంటకు దాదాపు 35కి.మీ. వేగంతో పరుగెత్తుతాడు.

ఆ స్థాయిలో ఫిట్‌నెస్ సాధించడానికి ఫుట్‌బాల్ ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తారు. స్పెయిన్, నెదర్లాండ్స్, ఇటలీ లాంటి కొన్ని దేశాల్లో కోచ్‌లు ‘10,000 టచ్‌’ల సిద్ధాంతాన్ని పాటిస్తారు. అంటే ట్రెయినింగ్‌లో భాగంగా రోజు మొత్తంలో కనీసం పదివేల సార్లు ఆటగాడి కాలికి ఫుట్‌బాల్ తగలాలి. తొలి దశలో వారంలో ఆరు రోజుల పాటు ఇదే తరహా శిక్షణ ఉండేలా చూసుకుంటారు. ఆ క్రమంలోనే సాధనతో పాటు వ్యాయామం కూడా పూర్తవుతుంది.

జన్యువులు కూడా ఆటగాళ్ల శారీరక సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. ఫుట్‌బాల్‌లో ఎత్తుకు కూడా చాలా ప్రాధాన్యముంటుంది. సాధారణంగా గోల్‌ కీపర్లు ఆరడుగులకు పైగా ఎత్తే ఉంటారు. అంత ఎత్తు లేని వాళ్లు కూడా టెక్నిక్‌పైన పట్టు సాధించడం ద్వారా మెరుగ్గా ఆడే అవకాశం ఉంటుంది.

సునీల్ చెత్రి

ఫొటో సోర్స్, Matthew Ashton - AMA

ఫొటో క్యాప్షన్, ఫుట్‌బాల్‌కు ఎత్తు మాత్రమే అర్హత కాదని భారత ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి నిరూపించాడు

ఫుట్‌బాల్‌లో పొట్టివాళ్లూ గట్టివాళ్లే..

‘దక్షిణ అమెరికన్లు పొట్టిగా ఉంటారు. దాన్ని కూడా వాళ్లు అనుకూలంగా మార్చుకున్నారు. ఇతరులతో పోలిస్తే వాళ్లు బంతిని సులువుగా డ్రిబిల్(ఒక దిశ నుంచి మరో దిశకు మరల్చడం) చేయగలరు’ అని డాక్టర్.విజయ్ సుబ్రమణియన్ చెబుతారు. అనేకమంది అంతర్జాతీయ క్రీడాకారులకు ఆయన ఫిట్‌నెస్ నిపుణుడిగా సేవలందించారు.

‘ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఫలానా ఎత్తుండాలనే నియమమేమీ లేదు. పొట్టిగా ఉన్నవాళ్లు బంతిని మెరుగ్గా డ్రిబిల్ చేయగలరు. పొడుగ్గా ఉండేవాళ్లు గాల్లో మెరుగ్గా ఎటాక్ చేయగలరు. గోల్‌కీపర్లు, డిఫెండర్లకు ఎత్తు కచ్చితంగా అనుకూలంగా మారుతుంది’ అంటారాయన.

‘ఒక వారమో, ఒక నెలో వ్యాయామం చేసి, సరైన ఆహారం తీసుకుంటే ఫిట్‌నెస్ రాదు. అది జీవన విధానంలో భాగం కావాలి. ఇటీవల కాలంలో భారత క్రీడాకారుల ఫిట్‌నెస్ స్థాయి పెరుగుతోంది. కానీ ఇప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలకు చాలా దూరంలో ఉన్నారు’ అని సుబ్రమణియన్ చెబుతారు.

‘ప్రస్తుత వరల్డ్‌కప్ ఆడుతున్నవారిలో క్రిస్టియానో రొనాల్డో ఫిట్‌నెస్ అత్యుత్తమం. అతడు గెంతినంత ఎత్తు, దూరం ఇప్పటివాళ్లలో ఎవరూ దూకలేరు. అందుకే మైదానంలో అందరికీ అతడో బలమైన ప్రత్యర్థిలా కనిపిస్తాడు’ అంటారు సుబ్రమణియన్.

బలం, వేగం, స్టామినా.. ఇవన్నీ ఆడే క్రమంలోనే సహజంగా మెరుగవుతూ ఉంటాయి. కానీ అవి ఏ స్థాయికి చేరుకుంటాయనేది ఆటగాళ్ల సాధనతో పాటు కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులపైనా ఆధారపడి ఉంటుంది.

ఫుట్‌బాలర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫుట్‌బాల్ కాళ్లతోనే కాదు, మెదడులోనూ ఆడతారు

మానసికంగా ఎలా ఉండాలి?

‘ఫుట్‌బాల్ మైదానంలోనే కాదు మెదడులోనూ ఆడతారు’ అని ఆశిష్ పెండ్సే చెబుతారు. ఆశిష్ గతంలో జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాడు. ప్రస్తుతం ‘వివా ఫుట్‌బాల్ మేగజీన్‌’కు ఆయన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్.

‘బంతిని ఎప్పుడు పాస్ చేయాలి? ఎప్పుడు డ్రిబిల్ చేయాలి? ఎప్పుడు బలంగా కొట్టాలి? వేగాన్ని ఎప్పుడు పెంచి తగ్గించాలి? గోల్‌పోస్ట్ పైన ఎప్పుడు దాడి చేయాలి?.. ఇలా ఓ పక్క కాళ్లతో బంతిని ముందుకు నడిపిస్తూనే ఆటగాడు అప్పటికప్పుడు ఆలోచించాలి. మానసికంగా దృఢంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. చాలామంది అంతర్జాతీయ ఆటగాళ్లను, మెస్సీ, నెయిమార్, రొనాల్డో లాంటి సూపర్ స్టార్లను వేరు చేసేది ఈ మానసిక సామర్థ్యమే’ అని ఆశిష్ చెబుతారు.

ఫుట్‌బాల్ మైదానంలో మానసికంగా దృఢంగా ఉంటే శారీరక ప్రతికూలతలతో సమస్య ఉండదు. అందుకే ఎత్తుగా లేని ఆటగాళ్లు వ్యూహ రచనపైన దృష్టిపెట్టి ప్రత్యర్థులను బోల్తా కొట్టించాలని నిపుణులు సూచిస్తారు. దీన్నే గేమ్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు.

‘శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నా మానసిక బలం లేనప్పుడు ఫుట్‌బాల్‌లో రాణించడం కష్టం. సాధారణ ఆటగాళ్లకూ, సూపర్ స్టార్లకూ తేడా అక్కడే కనిపిస్తుంది. క్రికెట్‌కు ఎక్కువ క్రేజ్‌ ఉన్న భారత్‌లాంటి దేశంలో అయితే ఫుట్‌బాల్ ఆటగాళ్లు మానసికంగా మరింత బలంగా ఉండాలి. ఫుట్‌బాల్‌పై అమితమైన ప్రేమతో పాటు ఎంత కష్టమైన పడటానికి సిద్ధంగా ఉండాలి. ఇది గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. చదువుతో మెదడు పదును పెరుగుతుంది. ఆటను నిశితంగా పరిశీలిస్తే ఆలోచనా పరిధి విస్తరిస్తుంది’ అంటారు ఆశిష్. అందుకే ఫుట్‌బాల్ ఒక మైండ్ గేమ్ అన్నది ఆయన అభిప్రాయం.

కోచింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరైన కోచింగ్‌తోనే బంతిపై పట్టు సాధించడం ఎలాగో తెలుస్తుంది

కోచింగ్‌తో ఎంత లాభం?

ప్రతిభ చాలా మందికి ఉంటుంది. కానీ దానికి మెరుగులు దిద్దాలంటే మంచి కోచ్ సాయం కావాలి. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని సమూలంగా మార్చే శక్తి ఆ కోచ్‌లకే ఉంది.

‘ఫుట్‌బాల్‌లో శిక్షణ ఎప్పుడు తీసుకోవాలనే దానిపైన భారత్‌లో తల్లిదండ్రుల ఆలోచనే చాలా చిత్రంగా ఉంటుంది. పిల్లలు ప్రొఫెషనల్ క్రీడాకారులుగా ఎదగాలంటే ఐదారేళ్ల వయసులోనే అకాడమీలో చేరి శిక్షణ తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఐదేళ్ల వయసులో మెస్సీ అయినా, మామూలు పిల్లల్లోనైనా ఒకే స్థాయి సామర్థ్యం ఉంటుంది. అందరూ అనుకునేలా అంత చిన్న వయసులో సహజమైన ప్రతిభ అంటూ ఏమీ ఉండదు’ అంటారు ఫుట్‌బాల్ నిపుణులు నోవీ కపాడియా.

అంతర్జాతీయ ఫుట్‌బాల్, హాకీ మ్యాచ్‌లకు నోవీ కపాడియా కామెంటేటర్‌గా సేవలందించారు. ఫుట్‌బాల్‌పైన పుస్తకాలు రాశారు. గతంలో కోచ్‌గానూ సేవలందించారు.

‘పిల్లలను చిన్నప్పట్నుంచీ ఫుట్‌బాల్ మైదానానికి తీసుకెళ్లి స్వేచ్ఛగా వదిలేయాలి. అప్పుడే 12-13ఏళ్లు వచ్చాక వాళ్ల సామర్థ్యంపైన ఒక అంచనా వస్తుంది. దాని ఆధారంగా వారికి ప్రొఫెషనల్‌ శిక్షణ కొనసాగించాలో లేదో నిర్ణయించుకోవచ్చు.

వీడియో క్యాప్షన్, 1 2 3 గో.. అంకెల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్

ప్రొఫెషనల్‌గా రాణించాలంటే చదువునూ త్యాగం చేయాలని కొందరు భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసికంగానూ ఫిట్‌గా ఉంటేనే ఫుట్‌బాల్‌లో రాణిస్తారు. చదువుతోనే ఆ తెలివితేటలు పెరుగుతాయి. ఇతర దేశాల్లో ఆటగాళ్లు చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. గతేడాది అమెరికా అండర్-17 జట్టు ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు వచ్చినప్పుుడు వాళ్లతో పాటు కొందరు టీచర్లు కూడా వచ్చారు. ఆటగాళ్ల ప్రాక్టీస్ ముగిశాక ఆ టీచర్లు వాళ్లకు పాఠాలు చెప్పడం నేను చూశా. చదువుకు వాళ్లిచ్చే ప్రాధాన్యం అలాంటిది. ఆటలో రాణించేందుకు ఆ చదువే సాయపడుతుంది’ అని కపాడియా వివరిస్తారు.

ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా ఎదగడానికి ఎలాంటి దగ్గర దారులూ, సూత్రాలూ లేవనీ, అంకిత భావం, ప్రాక్టీస్‌తోనే అది సాధ్యమవుతుందనీ ఆయన అంటారు.

బంతిని నియంత్రించడం, దానిపైన పట్టు సాధించడం, డ్రిబిల్ చేయడం, పరుగెత్తుతూనే బంతిని అదుపులో ఉంచుకోవడం లాంటి నైపుణ్యాలన్నీ కోచ్‌లే నేర్పగలరు. భారత్‌కు ప్రస్తుతం అలాంటి మెరుగైన కోచ్‌ల అవసరం చాలా ఉంది. యూరోపియన్ దేశాలకు ఆ కొరత లేదు. అందుకే పోటీలో భారత్‌తో పోలిస్తే అవి చాలా ముందున్నాయి.

ఫుట్‌బాల్ స్టేడియం

ఫొటో సోర్స్, Getty Images

సదుపాయాలు ఎంత ముఖ్యం?

ఫుట్‌బాల్ ఆడటానికి పెద్దగా డబ్బుతో పనిలేదు. ఒక బంతి, కాస్త ఖాళీ స్థలం ఉంటే చాలు. కానీ ప్రొఫెషనల్‌గా ఎదగాలంటే మంచి మైదానాలతో పాటు సాధన చేయడానికి బలమైన ప్రత్యర్థులు కూడా కావాలి.

అనేక యూరోపియన్, లాటిన్ అమెరికా దేశాల్లో ఫుట్‌బాల్ ప్రజల జీవన విధానంలో ఒక భాగమైంది. అక్కడ మంచి మైదానాలకు ఏమాత్రం కొరత లేదు.

అందుకే భారత్‌లో చిన్నప్పట్నుంచి చాలామంది క్రికెట్ ఆడినట్లే అక్కడ ఫుట్‌బాల్ ఆడతారు. దాంతో తెలీకుండానే వాళ్లకు ఆటపై ఇష్టంతోపాటు సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రొఫెషనల్ శిక్షణతో అది మరింత రాటు దేలుతుంది.

ఫుట్‌బాల్ ఆడేవాళ్లు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పోటీతత్వం కూడా పెరుగుతుంది. దాంతో అందరికంటే మెరుగ్గా ఆడేవాళ్లే పైపైకి వెళ్తారు. అలా మెరుగైన వసతులు పరోక్షంగా మంచి ఆటగాళ్లను అందించడానికి తోడ్పడుతున్నాయి. కానీ భారత్‌లో పరిస్థితులు భిన్నం. ఇక్కడ మైదానాలతో పాటు పోటీతత్వం లేకపోవడం కూడా ప్రతికూలంగా మారాయి.

‘భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఏమాత్రం పోటీ లేదు. కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆ ఆటకు ప్రాధాన్యమిస్తున్నాయి. అండర్-17 జట్టులో 8మంది ఈశాన్య రాష్ట్రానికి చెందిన వాళ్లున్నారు. 5-6మంది మాత్రమే వేరే రాష్ట్రాల నుంచి ఉన్నారు. అలాంటప్పుడు భారత్ ఫుట్‌బాల్ ఆడుతుందని ఎలా చెప్పగలం’ అని కపాడియా ప్రశ్నిస్తారు.

1960-70ల్లో దేశంలో చాలా ఫుట్‌బాల్ మైదానాలుండేవి. హైదరాబాద్‌ లాంటి నగరంలో చాలామంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుండేవారు. కానీ ఇప్పుడు అక్కడ ఫుట్‌బాల్ మైదానాలన్నీ క్రికెట్ స్టేడియాలుగా మారిపోయాయి అంటారు కపాడియా.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితి మారుతోందంటారు ఆశిష్ పెండ్సే. ‘90ల్లో దేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి సరైన ప్రణాళికలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు సీనియర్ జట్టులో చేరాలంటే అండర్-12, 14 లాంటి విభాగాల్లో ఆడటం తప్పనిసరైంది. దేశంలో 30దాకా మంచి ఫుట్‌బాల్ అకాడమీలున్నాయి. వాటి ద్వారా దాదాపు 1500-2000మంది ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు’ అని ఆశిష్ చెబుతారు. కానీ వాళ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకోవడానికి చాలా సమయమే పడుతుందని ఆయన అంటారు.

‘బలమైన ప్రత్యర్థులతో పోటీ పడితేనే క్రీడాకారుల సామర్థ్యం బయటికొస్తుంది. కానీ భారత్‌కు అలాంటి ప్రత్యర్థులతో ఆడే అవకాశం చాలా తక్కువగా వస్తుంది. ఉదాహరణకు బెల్జియం లాంటి దేశంతో ఆడితే భారత ఫుట్‌బాల్ ప్రమాణాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కానీ భారత్‌ లాంటి తక్కువ ర్యాంకులో ఉన్న దేశంతో బెల్జియం ఆడటానికి ఎందుకు ఆసక్తి చూపిస్తుంది?’ అని ఆశిష్ ప్రశ్నిస్తారు.

‘గతేడాది అండర్-17 యూత్ కప్ ఆడటానికి అమెరికా జట్టు భారత్‌కు వచ్చింది. వాళ్ల ఆటను పరిశీలించి విశ్లేషించడానికి ఏడుగురు సభ్యుల బృందం కూడా వచ్చింది. గోవాలో ఎర్రటి ఎండలో కూర్చొని వాళ్ల ఆటగాళ్ల ప్రాక్టీస్‌తో పాటు మ్యాచ్‌ని కూడా షూట్ చేశారు. దాని ఆధారంగా వాళ్ల ఆటతీరును అంచనా వేసి మెరుగులు దిద్దుతారు. కానీ అదే సమయంలో భారత్‌కు కనీసం ఒక వీడియోగ్రాఫర్ కూడా లేరు. ఇలాంటి ప్రాథమిక విషయాల్లోనే భారత్‌కు ఇతర దేశాలకూ చాలా వ్యత్యాసముంది. అందుకే సామర్థ్యంలోనూ అదే స్థాయిలో అంతరం కనిపిస్తుంది’ అని ఆశిష్ వివరిస్తారు.

వసతులు మెరగైతే సరిపోదు, ఆటగాళ్లు, క్రీడా అధికారుల దృక్పథంలోనూ మార్పు రావాలంటారు నోవీ కపాడియా. ‘ఏ ప్రణాళికలైనా ఆచరణాత్మకంగా ఉండాలి. ప్రపంచ కప్‌ అన్నది ఓ 20ఏళ్ల ప్రాజెక్టు. ఇప్పట్నుంచీ దానికి సన్నద్ధమవ్వడం మొదలుపెడితే భారత్‌ 20ఏళ్లకు కానీ ఓ స్థానానికి చేరలేదు. కానీ ఇక్కడ ఓర్పు తక్కువ. వెంటనే ఫలితాలు రావాలనుకుంటారు. అది సరి కాదు. పదో తరగతిలో సెక్షన్ ఏ, సెక్షన్ జీ ఉంటే.. యూరోపియన్ దేశాలు ఏ సెక్షన్‌లో ఉన్నాయి. భారత్ జీ సెక్షన్‌లో ఉంది. అది ఏ లోకి రావాలంటే చాలా సమయం పడుతుంది’ అంటారాయన.

సాధన

ఫొటో సోర్స్, Getty Images

ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్

ఆటలో ఎంత నైపుణ్యం ఉన్నా, టెక్నిక్‌లో ఎంత బలంగా కనిపించినా దానికి సరైన ప్రాక్టీస్ తోడవ్వకపోతే ఎంత గొప్ప ఆటగాడైనా మైదానంలో మామూలూ వ్యక్తిలానే మిగిలిపోతాడు.

ఫుట్‌బాల్‌లో చాలామంది కోచ్‌లు, ఆటగాళ్లు ‘10వేల గంటల ప్రాక్టీస్’ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఫుట్‌బాల్‌ను కనీసం పది వేల గంటలపాటు సాధన చేసే వాళ్లే ప్రొఫెషనల్‌గా మారగలరని వాళ్లు భావిస్తారు. కానీ అందరికీ ఈ సూత్రం వర్తించదని కూడా కొందరంటారు.

ఎవరు ఏం చెప్పినా, ప్రొఫెషనల్‌గా రాణించాలంటే అందరికీ వర్తించే ఏకైక సూత్రం.. ప్రాక్టీస్. ఫుట్‌బాల్‌లో సాంకేతికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం. టచ్, బంతిపైన నియంత్రణ ఆటకు ప్రాణం. ఆ నైపుణ్యాలన్నీ ప్రాక్టీస్‌తోనే సాధ్యమవుతాయి.

తమ జట్టు సభ్యులంతా మైదానాన్ని వదిలిపెట్టాక కూడా డేవిడ్ బెక్‌హాం, జినేదిన్ జిదాన్ లాంటి ఆటగాళ్లు తమ టచ్, బంతి నియంత్రణపైన అదే పనిగా సాధన చేసేవాళ్లని పేరుంది. రొనాల్డో కూడా ఫ్రీ కిక్స్, బంతిని వేర్వేరు విధాలుగా కొట్టడం, గోల్‌లో తాము అనుకున్న చోటే బంతి పడేలా కొట్టడం లాంటి నైపుణ్యాల కోసం గంటల తరబడి శ్రమించేవాడు. ఈ ప్రాక్టీస్ ఫలితమంతా వాళ్ల ఆటలో స్పష్టంగా కనిపిస్తుంది.

‘సాధనతో పనులు సమకూరు ధరలోన’... అన్న మాట ఫుట్‌బాల్‌కూ పూర్తిగా వర్తిస్తుంది.

ఏదేమైనా కోచ్‌లూ, ఫిజియోలూ, నిపుణులూ చెప్పే మాట ఒక్కటే.. ఫుట్‌బాలర్‌గా మారడానికి శారీరక, మానసిక దృఢత్వం, సరైన కోచింగ్, వసతులు, సాధన కలిస్తే చాలు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. ఈ ఐదు అంశాలకూ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేదే, మనం ఏ స్థాయి ఫుట్‌బాలర్ అవుతామనేది నిర్ణయిస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)