#FIFA2018: మీరు తప్పక తెలుసుకోవాల్సిన 20 విషయాలు

వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలు మరో నాలుగు రోజుల్లో రష్యాలో ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రపంచ కప్ మొదలు కావడానికి ముందుగా మీరు తప్పక తెలుసుకోవాల్సిన వాస్తవాలనూ, ఘటనలను మీ కోసం అందిస్తున్నాం. వీటితో ఫుట్‌బాల్‌కు సంబంధించిన మౌలిక విషయాలపై మీకు అవగాహన కలుగుతుంది.

1. ఇప్పుడు జరగనున్న ఫుట్‌బాల్ పోటీలు 21వ ప్రపంచ కప్.

2. 2015 మార్చి 12న ఫీపా మహిళల ప్రపంచ కప్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ తూర్పు తీమోర్, మంగోలియాల మధ్య జరిగింది. ఇందులో తూర్పు తీమోర్ 5-1 తేడాతో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత తీమోర్ జట్టులో అనర్హులైన ఆటగాళ్లు ఆడారని తేలింది. దాంతో ఓడిన మంగోలియా జట్టుకే విజయం దక్కింది. అయితే, ఈ తీర్పు చాలా ఆలస్యంగా రావడంతో మంగోలియాకు అనుకూలంగా వచ్చినా దానికి అదేమీ ఉపయోగపడలేదు.

BBC
రష్యా

ఫొటో సోర్స్, Getty Images

3. ఈసారి ప్రపంచ కప్‌లో మొత్తం 32 టీంలు పాల్గొంటున్నాయి. 2026 ప్రపంచ కప్‌లో 48 టీంలు పాల్గొంటాయి.

4. ఐస్‌లాండ్, పనామా జట్లు మొట్టమొదటిసారి ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెడుతున్నాయి.

5. ఇప్పటి వరకు అత్యధిక సార్లు ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్న దేశం బ్రెజిల్. అన్నింటికన్నా ఎక్కువగా ఐదుసార్లు కప్ గెల్చుకున్న దేశం కూడా అదే. ఒకవేళ ఈసారి గెలిస్తే బ్రెజిల్‌కు ఆరవ విజయం అవుతుంది.

6. గత మూడు ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక గోల్స్ సాధించిన ఘనత జర్మనీ జట్టుదే. 2006లో 14, 2010లో 16, 2014లో 18 గోల్స్ సాధించింది.

7. ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటివరకు అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు జర్మనీకి చెందిన వాడే. 2002 నుంచి 2014 మధ్య మొత్తం 24 మ్యాచ్‌లు ఆడిన మిరోస్లావ్ క్లోసే 16 గోల్స్ కొట్టాడు.

ఫీఫా ప్రపంచ కప్

ఫొటో సోర్స్, REUTERS/Mohamed Abd El Ghany

8. ప్రపంచ కప్ మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ సాధించిన రికార్డు రష్యన్ ఆటగాడు ఓలెక్ సాలెంకో పేరిట నమోదై ఉంది. 1994లో కేమరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన మొత్తం ఐదు గోల్స్ కొట్టాడు.

9. గత ప్రపంచ కప్ పోటీలను దాదాపు 320 కోట్ల మంది వీక్షించారు. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో సగం.

10. ఇప్పటి వరకు ప్రపంచ కప్ గెల్చుకున్న జట్లన్నింటికీ కోచ్ స్వదేశానికి చెందిన వాడే.

11. రష్యా (సోవియట్ యూనియన్ కాదు) జట్టు ఇప్పటి వరకు ఎప్పడూ గ్రూప్ స్టేజి వరకు కూడా చేరుకోలేదు. ఈసారి సొంత గడ్డపై ఆడబోతున్నందున ప్రదర్శన మెరుగ్గా ఉండొచ్చు.

12. 2018 ప్రపంచ కప్ నైజీరియా జట్టుకు ఆరో ప్రపంచ కప్.

రష్యా

ఫొటో సోర్స్, Getty Images

13. దక్షిణ కొరియా 10వ సారి ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనబోతోంది. మరే ఆసియా దేశం కూడా ప్రపంచ కప్‌కు ఇన్ని సార్లు క్వాలిఫై కాలేదు.

14. ఇరాన్ వరుసగా రెండు సార్లు ప్రపంచ కప్‌ పోటీల్లో పాల్గొనేందుకు క్వాలిఫై అయ్యింది. ఇది ఆ దేశ ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారి.

15. ఈ ప్రపంచ కప్‌కు క్వాలిఫై అయిన అతి చిన్న దేశం ఐస్‌లాండ్. దీని జనాభా కేవలం 3 లక్షల 34 వేలు మాత్రమే. మరోవైపు జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్ పరిస్థితి తెలిసిందే.

16. ఇప్పటి వరకు ఎక్కువసార్లు పాల్గొన్నప్పటికీ ఎన్నడూ కప్ గెల్చుకోని దేశం నెదర్లాండ్స్. అయితే ఈసారి రష్యాలో ఆడటానికి ఆ దేశం క్వాలిఫై కాలేదు.

17. 1958 తర్వాత మొట్టమొదటి సారి ఇటలీ ప్రపంచ కప్‌కు క్వాలిఫై కాలేకపోయింది.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, AIZAR RALDES/AFP/Getty Images

18. 1986 తర్వాత అమెరికా కూడా తొలిసారి ఈ పోటీలకు క్వాలిఫై కాలేదు.

19. ఫీఫా ప్రపంచ కప్ పోటీలు యూరప్, ఆసియా ఖండాల్లో జరగడం ఇదే మొదటిసారి. రష్యా రెండు ఖండాల్లో వ్యాపించి ఉందన్న విషయం తెలిసిందే.

20. పనామా జట్టు ప్రపంచ కప్‌ పోటీల్లో పాల్గొనడానికి క్వాలిఫై అయిన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు అక్టోబర్ 11న జాతీయ సెలవుదినంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)