గుజరాత్: ‘దళితురాలివై ఉండి మా ఎదురుగా కుర్చీలో కూర్చుంటావా అంటూ కొట్టారు’

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
- రచయిత, భార్గవ పారిఖ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఒక దళిత కుటుంబంపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 6న అహ్మదాబాద్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢోల్కా తాలూకా వల్తేరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
'ఉన్నత' కులాలకు చెందిన కొందరు తనను వారి ఎదుట కుర్చీలో కూర్చున్నందుకు కొట్టారనీ, అడ్డుకోవడానికి వచ్చిన తన కుటుంబ సభ్యులపై కూడా వారు దాడి చేశారని ఓ దళిత మహిళ ఆరోపించారు.
దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 'ఉన్నత' కులాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఈ నెల 6న వల్తేరా పంచాయతీలో ఆధార్ కార్డు క్యాంపు నిర్వహించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. అంగన్‌వాడీ ఉద్యోగినులకు ఆ క్యాంపు బాధ్యతలు అప్పగించారు.
పల్లవీ జాదవ్ అనే అంగన్‌వాడీ కార్యకర్త ఆధార్ కార్డు కోసం వచ్చిన వారి వివరాలు తీసుకుంటున్నారు. 'ఉన్నత' కులానికి చెందిన వారి వేలి ముద్రలను తీసుకుంటుండగా వివాదం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
బాధితురాలు పల్లవి బీబీసీతో మాట్లాడారు. ''నేను వేలి ముద్రల కోసం కొందరి చేతులను పట్టుకోగా వాళ్లు దీనిని వ్యతిరేకించారు. ఏం జరిగిందో నాకు అర్థమయ్యేలోపు అక్కడ చాలా మంది గుమికూడి, నాపై దాడికి దిగారు'' అని ఆమె తెలిపారు.
''నన్ను కులం పేరు పెట్టి దూషించారు. దళితురాలివై ఉండి, మా ముందు కుర్చీలో కూర్చుంటావా అంటూ కేకలు వేశారు. నేను కూర్చున్న కుర్చీని కాలితో తన్నారు. దాంతో నేను కింద పడ్డాను. ఆ తర్వాత నాపై కర్రలతో దాడి చేశారు'' అని పల్లవి వివరించారు.
పల్లవిపై దాడి వార్త తెలిసిన వెంటనే ఆమె భర్త గణ్‌పత్ జాదవ్, కుమారుడు జిగర్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
గణ్‌పత్ బీబీసీతో మాట్లాడుతూ, ''నేను, మా అబ్బాయి అక్కడికి చేరుకోగానే, నా భార్య చుట్టూ చాలా మంది గుమికూడి ఉండడం చూశాను. వాళ్లంతా ఆమెను తిడుతూ, కొడుతున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మమ్మల్ని కూడా కొట్టారు'' అని వివరించారు.
ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన జాదవ్ కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దర్బార్ కులం వారికీ, దళితులకు మధ్య కొన్నాళ్ల క్రితం జరిగిన ఘర్షణలకు కొనసాగింపుగానే తమపై దాడి జరిగిందని జాదవ్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
ఇదే గ్రామంలో కొన్నాళ్ల క్రితం ఓ దళితుడు తన పేరు చివర 'సింగ్' అని పెట్టుకోవడంతో వివాదం చెలరేగింది. సాధారణంగా 'ఉన్నత' కులాలవారైన దర్బార్‌లు తమ పేరు చివర 'సింగ్' అని పెట్టుకుంటారు.
అయితే ఒక దళితుడు తన పేరు చివర సింగ్ అని పెట్టుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.
అయితే పోలీసులు మాత్రం ఇప్పుడు జరిగిన ఈ దాడికి, గతంలో తలెత్తిన వివాదానికి మధ్య సంబంధం లేదని అంటున్నారు.
పల్లవీ జాదవ్ కేసులో పోలీసులు జయరాజ్ సింగ్ వేగాడ్, భాను వేగాడ్, కాను చావ్డా, రాను చావ్డా, సంజయ్‌లతో పాటు మొత్తం పది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగతా ఏడుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








