శ్రీదేవి: ‘ఆమె ఏడిస్తే.. మీ బుగ్గలు తడి అవుతాయి’

మహిళ

ఫొటో సోర్స్, NISHA SUSAN

నాగిని సినిమాలో శ్రీదేవిలా డ్రస్ వేసుకుందో అమ్మాయి. అరే.. అక్కడే మిస్టర్ ఇండియా సినిమాలో శ్రీదేవి గెటప్‌లో మరో మహిళ!

అది బెంగళూరు నగరం. వాళ్లంతా శ్రీదేవి జ్ఞాపకార్థం ఆమెలా తయారై ఒకే వేదికపై తళుక్కుమన్నారు. శ్రీదేవిలా నాట్యం చేశారు. వారిలో యుతులు, నడివయసు మహిళలు అందరూ ఉన్నారు.

దీన్నే ఇంగ్లీషులో 'కాస్‌ప్లే' అని పిలుస్తారు.

శ్రీదేవి మరణం ఆమె అభిమాలను కలిచివేసింది. ఆమె మరణించి నెలలు గడుస్తున్నా ఎందరో అభిమానులు ఇప్పటికీ ఆమె జ్ఞాపకాల్లోనే మునిగి తేలుతున్నారు.

దాదాపు 300 సినిమాల్లో నటించి, 5 దశాబ్దాల పాటు సినీ తెరపై మెరిసిన శ్రీదేవిని ఆమె అభిమానులు 'సూపర్ స్టార్'గా ఆరాధించేవారు.

మహిళ

ఫొటో సోర్స్, DARSHANA DAVE

శ్రీదేవికి నివాళులు అర్పించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వహకురాలు నిషా సుశాన్ అన్నారు. ఈమె 'లేడీస్ ఫింగర్' అనే మహిళా వెబ్‌సైట్‌కు ఎడిటర్ కూడా.

''శ్రీదేవి నటనలో హాస్యం మేళవించి ఉంటుంది. హాస్యం పండించడంలో ఆమె జీనియస్. ఆమె తన నటనపై చూపిన శ్రద్ధ, తన విషయంలో కూడా తీసుకునివుంటే బాగుండు. ఆమె జ్ఞాపకార్థం.. హాస్యం కలగలిసిన కార్యక్రమం చేయాలనుకున్నాం. ముఖ్యంగా.. మగవారిని భయపెట్టే వికటాట్టహాసం చేయాలని అనుకున్నాం'' అని నిషా తెలిపారు.

పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం సమయలో రేణుక చౌదరి నవ్వినపుడు ఆమెను హిందూ పురాణాల్లోని రాక్షస పాత్రతో పోల్చి, మహిళా ఉద్యమకారుల ఆగ్రహానికి గురి అవడాన్ని నిషా గుర్తు చేసుకున్నారు.

మహిళ

ఫొటో సోర్స్, MISHTA ROY

''మహిళా లోకం మరిచిపోలేని వారిని స్మరించుకుంటూ ఓ కార్యక్రమం చేద్దామనుకున్నాం. కేవలం సంస్మరణ సభలకు పరిమితం కాకుండా వారి జ్ఞాపకాల్లో పిచ్చెక్కినట్లు మునిగితేలాలని నిర్ణయించుకున్నాం. అపుడు శ్రీదేవి మా కళ్లముందు వెలిగింది'' అని నిషా అన్నారు.

''ప్రేక్షకులను రెప్పార్పకుండా చేసే కొద్ది మంది నటుల్లో శ్రీదేవి ఒకరు. ఆమె ఏడిస్తే.. మీ బుగ్గలు తడి అవుతాయి. ఆమె నవ్వితే.. మీకు తెలియకుండానే మీరూ నవ్వుతారు'' అని 'బాలీవుడ్‌ను మలుపు తిప్పిన 50 సినిమాలు' పుస్తక రచయిత శుభ్రా గుప్తా బీబీసీతో అన్నారు.

మహిళలు

ఫొటో సోర్స్, DARSHANA DAVE

నాగిని, చాల్‌బాజ్, మిస్టర్ ఇండియా.. లాంటి ఎన్నో సినిమాల్లో శ్రీదేవి గెటప్‌లను అనుకరిస్తూ మహిళలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీదేవి పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆమె జ్ఞాపకాల్లో మునిగిపోయారు.

''ఈ మహిళల్లో చాలా మందికి మా వెబ్‌సైట్ గురించి తెలిసుండదు. కానీ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి, శ్రీదేవికి నివాళి అర్పించడానికే వీరందరూ అక్కడికి వచ్చారు'' అని నిషా అన్నారు.

మహిళ

ఫొటో సోర్స్, HARSHINI VASU

''ఇక్కడికి వచ్చిన మహిళల్లో చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారే. ఈ విధంగా వస్త్రధారణ చేసుకోవడం అంటే ఇంకొకరిలా మారిపోవడం కాదు.. తమను తామే మరో కోణంలో చూసుకోవడం'' అని నిషా అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)