'కల్బుర్గి, గౌరీ లంకేశ్ హత్యల్లో వాడిన తుపాకీ ఒకటే'

గౌరీ లంకేశ్

ఫొటో సోర్స్, Facebook

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

హేతువాది డాక్టర్ ఎంఎం కల్బుర్గి, జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ల హత్యల మధ్య సంబంధం ఉన్నట్టుగా రుజువైందని కర్ణాటక పోలీసులు తెలిపారు.

గౌరీ లంకేశ్ హత్యపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఈ వివరాలున్నాయి.

డాక్టర్ కల్బుర్గీ హత్యకు వాడిన 7.65 ఎంఎం నాటు తుపాకీనే గౌరీ హత్యలో కూడా వాడారని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. బెంగళూరు కోర్టులో పోలీసులు సమర్పించిన 660 పేజీల చార్జిషీటులో ఈ ఫోరెన్సిక్ నివేదిక భాగంగా ఉంది.

డాక్టర్ కల్బుర్గిని 2015 సెప్టెంబర్ 30న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన నివాసం ఎదుటే కాల్చి చంపారు. కల్బుర్గి హిందూమతంలోని కొన్ని దురాచారాలపై రచనలు, ప్రసంగాలు చేస్తుండేవారు.

జర్నలిస్టు గౌరీ లంకేశ్‌పై 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని ఆమె ఇంటి గుమ్మం దగ్గరే హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి కాల్పులు జరపగా ఆమె అక్కడే మృతి చెందారు.

హిందూమతాన్ని వ్యతిరేకిస్తున్నారన్న ఆరోపణలతోనే ఈ ఇద్దరినీ హత్య చేశారనే ప్రచారం ఉంది.

ఈ రెండు హత్యలలో వాడిన బుల్లెట్లు, కార్ట్రిజ్డిలు "ఒకే నాటు రకం పిస్టల్ (7.65 మిమీ) నుంచి కాల్చినవే" అని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడి చేసింది.

గౌరీ లంకేశ్

ఫొటో సోర్స్, Getty Images

డాక్టర్ కల్బుర్గి హత్య కేసులో గత మూడేళ్లలో అరెస్టులేవీ జరగలేదు కాబట్టి ఈ ఫోరెన్సిక్ నివేదిక కీలకమని భావిస్తున్నారు. "ఈ రెండు కేసుల పురోగతిలో ఇదొక కీలక పరిణామం" అని ఒక పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు.

పోస్ట్‌మార్టం సందర్భంగా డాక్టర్లు గౌరీ మృతదేహం లోంచి మూడు బుల్లెట్లు బయటకు తీశారు. హత్యాస్థలంలో ఇంటి గోడపై దిగబడిన మరో బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో డాక్టర్ కల్బుర్గి దేహంలో లభ్యమైన రెండు బుల్లెట్లతో వీటిని పోల్చినట్టు ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు.

ప్రవీణ్ అలియాస్ సుజిత్ కుమార్‌కు నాటు తుపాకీని ఇచ్చినట్లు ఆరోపణలున్న కేటీ నవీన్ కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది.

గోవాలోని పోండాలో జరిగిన ఒక మత సమావేశంలో 'హిందూత్వను ఆయుధాలతో రక్షించుకోవాలి'' అని చెప్పినట్లు నవీన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలం కాపీ బీబీసీ వద్ద ఉంది.

ఇలాంటి భావజాలం ఉన్నవారు మరికొందరున్నారని.. వారు తనతో సంప్రదిస్తారని ఈ సమావేశం తరువాత నిర్వాహకుల్లో ఒకరు తనతో చెప్పారని నవీన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

గౌరీ లంకేశ్

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN/GETTY IMAGES

ఆ క్రమంలోనే ప్రవీణ్ తనను సంప్రదించాడని.. ఇదంతా చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ గౌరీ లంకేశ్‌ హిందూ వ్యతిరేక వైఖరికి తాను వ్యతిరేకం కాబట్టి వారికి సహకరించాలని నిర్ణయించుకున్నట్టుగా నవీన్ అందులో వెల్లడించాడు.

ప్రవీణ్ గతంలో కన్నడ రచయిత కేఎస్ భగవాన్ హత్యకు కుట్ర పన్నాడన్న కేసులో అరెస్టయ్యాడు. అనంతరం పోలీసులు ఆయన్ను గౌరీలంకేశ్ హత్య కేసులో అరెస్టు చేశారు.

ఈ కేసులో పోలీసులు.. హిందూత్వ సంస్థలైన సనాతన సంస్థ, దాని అనుబంధ హిందూ జాగృతి సమితి (హెచ్‌జేఎస్)లకు చెందిన అమోల్ కాలే (మహారాష్ట్రలోని పుణెవాసి), అమిత్ దెగ్వేకర్(గోవాలోని పోండా నివాసి), మనోహర్ ఎదావె (కర్ణాటకలోని విజయపురకు చెందినవారు)లను అరెస్టు చేశారు.

అయితే, డాక్టర్ కల్బుర్గి హత్య కేసులో మాత్రం ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

కల్బుర్గి హత్యకు ముందు కొల్హాపూర్‌లో వామపక్ష నేత గోవింద్ పన్సారేను కాల్చి చంపారు.

అంతకు ముందు 2013 ఆగస్టు 30న పుణెలో హేతువాది నరేంద్ర దభోల్కర్‌నీ ఇలాంటి 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతోనే కాల్చి చంపారు.

హత్యకు గురయిన ఈ నలుగురిపైనా హిందూత్వ వ్యతిరేకులన్న ముద్ర ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)