జీ7: రష్యా లేకుండా ఈ మీటింగ్ ఏంటి.. రష్యాను మళ్లీ మన జట్టులో చేర్చుకోవాలి - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

జీ7, అమెరికా, ట్రంప్, రష్యా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జీ7 సదస్సు వద్ద నిరసనలు

పారిశ్రామిక దేశాలైన జీ7 బృందంలోకి రష్యాను తిరిగి చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

క్రిమియాను ఆక్రమించుకోవడంతో 2014లో రష్యాను జీ7 నుంచి బహిష్కరించారు. కానీ ఇప్పుడు ట్రంప్ రష్యాను తిరిగి జీ7లో చేర్చుకోవాలని సూచించారు. ఒకప్పుడు రష్యా కూడా ఈ బృందంలో ఉండేది. అప్పుడు ఈ బృందం పేరు జీ8.

ప్రపంచంలో దాదాపు 60 శాతం వాణిజ్యానికి ప్రాతినిధ్యం వహించే ఈ దేశాలు ప్రతిఏటా కలుసుకుంటాయి.

కెనడా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, జర్మనీలున్న జీ7 సదస్సు ఈసారి కెనడాలోని క్యుబెక్‌లో ఉన్న లా మెల్‌బాయ్‌లో జరుగుతోంది.

డొనాల్డ్ ట్రంప్

రష్యా గురించి ట్రంప్ ఏమన్నారు?

జీ7 సభ్యదేశాల సంఖ్య తగ్గిపోవడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.

''మనకు ఇష్టం ఉన్నా లేకున్నా, అది సరైన నిర్ణయం కాదు. ఇది ఒకప్పుడు జీ8గా ఉండేది. అప్పట్లో రష్యా కూడా ఇందులో ఉండేది. ఇప్పుడు రష్యా లేకుండా ఈ మీటింగ్ ఏంటి? ఈ మీటింగ్‌లో రష్యా కూడా ఉండాలి. మీకు నచ్చినా నచ్చకున్నా.. నేను రాజకీయంగా సరిగ్గా చెబుతుండకపోవచ్చునేమో.. కానీ, మనం ప్రపంచాన్ని నడిపించాలి. జీ8 నుంచి రష్యాను బయటకు పంపేశారు. ఇప్పుడు రష్యాను వెనక్కు రానివ్వాలి'' అని ట్రంప్ అన్నారు.

ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇటలీ ప్రధాని గ్యుసెపె కాంటి అందరి ప్రయోజనాల కోసం రష్యాను తిరిగి చేర్చుకోవాలంటూ ట్రంప్‌కు మద్దతు తెలపగా.. కెనడా, బ్రిటన్ దీనిని వ్యతిరేకించాయి.

రష్యా క్రిమియాను ఆక్రమించుకున్నపుడు జీ8లోని మిగతా దేశాలు, రష్యా తన తీరును మార్చుకునేంతవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అన్నాయి.

ఇటీవల ఇతర దేశాలతో వాణిజ్య లావాదేవీలపై ట్రంప్ పన్నులను భారీగా పెంచడంతో అమెరికాకు, ఇతర దేశాలకు మధ్య అంతరాలు పెరిగాయి.

జీ7 సదస్సులో ఇరాన్, వాతావరణంలో మార్పులపై కూడా అమెరికాకు, ఇతర దేశాలకు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సదస్సులో ఏం జరగొచ్చు?

ట్రంప్ ఇటీవల స్టీల్, అల్యూమినియంపై పన్నులు పెంచడంపై కెనడా, ఫ్రాన్స్‌లు అసంతృప్తితో ఉన్నాయి.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మేక్రాన్ వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదని, దాని వల్ల మొదట నష్టం జరిగేది అమెరికా కార్మికులకే అన్నారు.

అయితే బ్రిటన్ ప్రధాని థెరెసా మే మధ్యేమార్గాన్ని అవలంబిస్తూ, అమెరికా పన్నుల విషయంలో ఈయూ ప్రతీకార చర్యలకు పాల్పడకుండా మరింత సంయమనం పాటించాలని సూచించారు.

అయితే ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గకుండా వరుస ట్వీట్లతో తన వాదనను సమర్థించుకున్నారు.

సదస్సుకు ముందు విలేకరులతో మాట్లాడుతూ, అమెరికా విషయంలో ఇతర దేశాలు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. అయితే పరిస్థితి చక్కబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

క్యూబెక్‌ అజెండా

ఈ ఏడాది సదస్సులో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

  • సమ్మిళిత ఆర్థికాభివృద్ధి
  • లైంగిక సమానత్వం, మహిళా సాధికారత
  • ప్రపంచ శాంతి, భద్రత
  • భవిష్యత్తులో ఉపాధి కల్పన
  • వాతావరణ మార్పులు, సముద్రాలు

ఈ సదస్సులో ఇరాన్ విషయంపై కూడా భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. 2015లో ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందం నుంచి ఇటీవల ట్రంప్ వైదొలగారు. దీనిపై ఆ ఒప్పందంలో భాగస్వాములైన ఇతర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా తీవ్రమైన నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ఈసారి కూడా సమావేశాల భద్రత కోసం సుమారు 8 వేల మంది సైనికులు, పోలీసు అధికారులను మోహరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)